-
అరవయ్యేళ్ల స్వప్నం సాకారం
-
విభజన బిల్లుకు రాజ్యసభ ఆమోదం
-
ఆద్యంతం వాయిదాలు, ఆందోళనల నడుమ బిల్లుపై సాగిన చర్చ
-
మద్దతు తెలుపుతూనే సీమాంధ్ర సమస్యలు ప్రస్తావించిన బీజేపీ
-
సీమాంధ్రకు ప్రత్యేక తరగతి హోదా, ప్యాకేజీలు ప్రకటించిన ప్రధాని
-
బిల్లును వ్యతిరేకిస్తూ వెల్‌లో ఆందోళనకు దిగిన తృణమూల్, శివసేన
-
కాంగ్రెస్ - బీజేపీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందన్న సీపీఎం
-
టీ-బిల్లుకు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్, బీజేపీ, ఆర్‌జేడీ, ఎన్‌సీపీ
-
వ్యతిరేకించిన సీపీఎం, శివసేన, శిరోమణి అకాలీదళ్, ఎస్‌పీ, ఏజీపీ
-
చర్చ చివర్లో బిల్లుపై ఓటింగ్... మూజువాణి ఓటుతోనే ఆమోదం
ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ‘ప్రత్యేక రాష్ట్ర’ కల సాకారమైంది. ఏళ్ల తరబడి సాగించిన పోరాటం ఫలించింది. తెలంగాణ.. దేశంలో 29వ రాష్ట్రంగా అతి త్వరలో అవతరించనుంది. మంగళవారం లోక్‌సభ ఆమోదం పొందిన ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లును.. గురువారం రాజ్యసభ ఆమోదించింది. కాంగ్రెస్, బీజేపీలు మరోసారి ఒకేతాటిపైకి వచ్చి బిల్లును ఆమోదించాయి. బిల్లుపై రాష్ట్రపతి సంతకం, గెజిట్ నోటిఫికేషన్ అనే లాంఛనాలు మాత్రమే పూర్తికావాల్సి ఉంది. ఆ ‘గెజిట్ నోటిఫికేషన్’లో సూచించిన సమయంలోగా సిబ్బంది, ఆస్తులు, అప్పుల పంపకాలను పూర్తిచేసుకొని ‘అపాయింటెడ్ డే’ నుంచి రెండు రాష్ట్రాలు ఉనికిలోకి వస్తాయి. కేంద్ర ప్రభుత్వం వ్యూహం ప్రకారం.. వారం రోజుల్లో రెండు రాష్ట్రాలు ఏర్పడే అవకాశముందని తెలుస్తోంది. మరోవైపు.. తెలంగాణ బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వం సీమాంధ్రకు ప్రత్యేక తరగతి హోదాతో సహా.. 6 సూత్రాల అభివృద్ధి ప్యాకేజీని ప్రకటించింది. మొత్తంమీద రాజ్యసభలో.. సీమాంధ్ర సభ్యులు, విభజనను వ్యతిరేకిస్తున్న సీపీఎం, తృణమూల్ కాంగ్రెస్ సభ్యుల నిరసనల మధ్యే.. కొత్తగా ఎలాంటి సవరణలనూ చేపట్టకుండానే.. తెలంగాణ బిల్లును రాజ్యసభ ఆమోదించింది.
సాక్షి, న్యూఢిల్లీ: ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ‘ప్రత్యేక రాష్ట్ర’ కల సాకారమైంది. ఏళ్ల తరబడి సాగించిన పోరాటం ఫలించింది. తెలంగాణ.. దేశంలో 29వ రాష్ట్రంగా అతి త్వరలో అవతరించనుంది. మంగళవారం నాడు లోక్‌సభ ఆమోదం పొందిన ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు.. గురువారం నాడు రాజ్యసభలో కూడా ఆమోదం పొందింది.
ఒక్కటైన బీజేపీ, కాంగ్రెస్...
లోక్‌సభలో మాదిరిగానే.. రాజ్యసభలో సైతం సీమాంధ్ర సభ్యులు, విభజనను వ్యతిరేకిస్తున్న తృణమూల్ కాంగ్రెస్, శివసేన తదితర పార్టీల సభ్యుల తీవ్ర నిరసనల మధ్య.. మూజువాణి ఓటుతోనే తెలంగాణ బిల్లును ఆమోదించారు. కాంగ్రెస్, బీజేపీలు ఇక్కడ కూడా ఒక్కతాటిపై నిలిచి బిల్లును ఆమోదింపచేశాయి. అంతకుముందు.. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకూ సభ్యుల ఆందోళనలతో సభ ఏకంగా ఏడుసార్లు వాయిదాపడింది. అనంతరం సాయంత్రం 4:30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ మూడున్నర గంటల పాటు ఏకధాటిగా కొనసాగిన సభలో.. అధికార, విపక్షాల నేతలతో సహా దాదాపు అన్ని పార్టీల సభ్యులూ బిల్లుపై చర్చలో పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే తెలంగాణ బిల్లును చర్చకు ప్రవేశపెట్టగా.. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ సభకు హాజరయ్యారు. చర్చ ఆద్యంతం సీమాంధ్ర సభ్యులతో పాటు తృణమూల్ కాంగ్రెస్, శివసేన సభ్యులు విభజన వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఈ గందరగోళంలో పలుమార్లు ఎవరు ఏం మాట్లాడుతున్నారో కూడా వినిపించని పరిస్థితి నెలకొంది. చర్చ చివర్లో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ చేసిన ప్రకటన సైతం ఎవరికీ వినిపించలేదు. దీంతో ఆయన ప్రకటనపై బీజేపీ నేత వెంకయ్యనాయుడు, ఇతర విపక్షాల సభ్యులు పలుమార్లు వివరంగా అడిగి తెలుసుకోవాల్సి వచ్చింది. ప్రధాని ప్రకటన చేస్తున్న సమయంలో తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు పలువురు వెల్‌లో నిలబడి ‘బిల్లును చించి పారేయండి’ అని నినాదాలు చేస్తూ కాగితాలను ముక్కలుగా చింపి సభలో వెదజల్లుతూ ఉన్నారు. ఆ సమయంలో పలువురు కాంగ్రెస్ సభ్యులు ప్రధానికి, హోంమంత్రికి రక్షణ వలయంలా నిల్చున్నారు.
కొందరి మద్దతు... కొందరి వ్యతిరేకత: తొలుత మాట్లాడిన వెంకయ్యనాయుడు తెలంగాణ ఏర్పాటుకు తమ సంపూర్ణ మద్దతు ఉందంటూనే.. సీమాంధ్ర ప్రాంత ఆందోళనలను పరిష్కరించాలని, వాటిని బిల్లులో చట్ట రూపంలో తీసుకురావాలని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత అరుణ్‌జైట్లీ కూడా ఇదే విధంగా మాట్లాడారు. టీడీపీ ఎంపీలు ఎప్పటిలాగానే రెండు ప్రాంతాల నుంచి రెండు భిన్నమైన వాదనలు వినిపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును స్వాగతిస్తున్నామని, రాష్ట్ర ఏర్పాటుకు రెండు లేఖలు ఇచ్చామని దేవేందర్‌గౌడ్, గుండు సుధారాణి స్పష్టంచేశారు. బిల్లు చట్టబద్ధంగా లేదని, దానిని అటార్నీ జనరల్‌కు రిఫర్‌చేయాలని సి.ఎం.రమేశ్ పేర్కొనగా.. తెలంగాణ ఏర్పాటును స్వాగతిస్తున్నామని సుజనా చౌదరి చెప్పారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రి చిరంజీవి మాట్లాడుతూ.. కాంగ్రెస్ నిర్ణయాన్ని తప్పుపట్టడంతో అధికార పార్టీ ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంది. కేంద్రమంత్రి తన మంత్రివర్గ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడవచ్చా? అనేది రూలింగ్ ఇవ్వాలని ప్రతిపక్ష నాయకుడు అరుణ్‌జైట్లీ డిప్యూటీ చైర్మన్ కురియన్‌ను కోరారు. అయితే ఏం మాట్లాడాలనే సభ్యుడి ఇష్టమని కురియన్ బదులిచ్చారు. ఇక తృణమూల్ కాంగ్రెస్ ఉదయం నుంచి బిల్లుకు వ్యతిరేకంగా సుదీర్ఘంగా ఆందోళన చేసింది. కాంగ్రెస్ - బీజేపీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందంటూ సీపీఎం తీవ్ర విమర్శలు చేసింది. విభజన బిల్లును వ్యతిరేకిస్తున్నామని ప్రకటించింది. శివసేన, శిరోమణి అకాళీదల్, సమాజ్‌వాది పార్టీ, అస్సాం గణపరిషత్‌లు కూడా బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, ఆర్‌జేడీ, ఎన్‌సీపీ తదితర పార్టీలు మద్దతు పలికాయి.
మూజువాణి ఓటుతో ఆమోదం...
రాత్రి ఏడున్నర గంటల సమయంలో బిల్లుపై డిప్యూటీ చైర్మన్ ఓటింగ్ చేపట్టారు. బిల్లు ఆమోదం, సవరణల ఆమోదం మొత్తం మూజువాణి ఓటుతోనే పూర్తిచేశారు. వెంకయ్యనాయుడు సహా పలువురు ఇతర సభ్యులు ఇచ్చిన సవరణలు వీగిపోయాయి. మొదటి క్లాజుకే సవరణ కోరిన వెంకయ్యనాయుడు.. డివిజన్‌కు పట్టుపట్టారు. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్నందున డివిజన్ చేపట్టలేనని డిప్యూటీ చైర్మన్ తేల్చిచెప్పారు. దీంతో అన్నింటికీ మూజువాణి ఓటు విధానం అనుసరించారు. చివరిగా బిల్లు ఆమోదం పొందుతున్న సమయంలో సీపీఎం డవిజన్‌కు గట్టిగా పట్టుపట్టింది. సభలో గందరగోళం ఉందంటూ కురియన్ అందుకు నిరాకరించారు. సభ అదుపులోనే ఉందని, వెల్‌లో ఎవరూ లేరని సీతారాం ఏచూరి పలుమార్లు పేర్కొన్నారు. ఆ సమయంలో కేవలం సీమాంధ్ర టీడీపీ సభ్యులు అక్కడ నిలబడ్డారు. సీపీఎం సభ్యులు వారిని పిలిచినా వెల్‌లోనే ఉండిపోయారు. తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు కూడా ఒక దశలో తమ సీట్లలోకి వెళ్లేందుకు ప్రయత్నించినా.. సీమాంధ్ర టీడీపీ సభ్యులు మాత్రం వెల్‌ను వీడలేదు. దీంతో డిప్యూటీ చైర్మన్ డివిజన్ చేపట్టడం సాధ్యంకాదని పేర్కొనటంతో సీపీఎం సభ్యులు నిరసన తెలుపుతూ వాకౌట్ చేశారు. సరిగ్గా 8.02 గంటలకు బిల్లుకు ఆమోదం కోరుతూ షిండే తీర్మానం ప్రతిపాదించారు. 8:06 గంటలకు మూజువాణి ఓటుతో తీర్మానం ఆమోదం పొందినట్లు డిప్యూటీ చైర్మన్ ప్రకటించారు. అనంతరం సభను శుక్రవారానికి వాయిదా వేశారు.
ప్రధాని ప్రకటనకు బీజేపీ ఓకే...
పదేళ్లు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో గవర్నర్ అధికారాలకు రాజ్యాంగ సవరణతో చట్టబద్ధత కల్పించాలని, తద్వారా సీమాంధ్ర ప్రజలకు రక్షణ కల్పించాలని, పోలవరం ముంపు బాధిత మండలాలను సీమాంధ్రలో కలపాలని బీజేపీ పట్టుపట్టినా.. చివరకు ఆర్థిక అంశాల్లోనే తాను అనుకున్నది సాధించగలిగింది. రాజ్యసభలో సవరణలు తెస్తే మళ్లీ లోక్‌సభకు వెళ్లాలని, ఇదంతా ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదని భావించిన కేంద్రం ప్రధానమంత్రితో ప్రకటన చేయించటానికే పరిమితమైంది. బీజేపీ కూడా అందుకు సమ్మతించింది. అయితే ప్రధానమంత్రి చేసిన ప్రకటనలో కొన్ని అంశాలపై స్పష్టత లేనందున వెంకయ్యనాయుడు సవరణ ప్రతిపాదన చేసినా అది వీగిపోయింది. వెంకయ్యనాయుడు మధ్యమధ్య తాను ఇచ్చిన సవరణ ప్రతిపాదనలపై కేంద్రమంత్రుల ద్వారా వివరణ తీసుకున్నారు. ముఖ్యంగా ‘‘సీమాంధ్ర రాజధానికి సాయమేది? స్పెషల్ కేటగిరీ 10 ఏళ్లు ఏదీ? అది పదేళ్లు ఉండాలి. ఐదేళ్లలో ఎలాంటి పరిశ్రమలు ఏర్పడవు...’’ అని పేర్కొన్నారు. హోంమంత్రి షిండే లేచి ‘‘ఉదయం మనం చర్చించుకున్నప్పుడు.. ఐదేళ్లుగా అని అనుకున్నాం కదా..!’’ అని బదులిచ్చారు. ఆ తర్వాత దుమ్ముగూడెం-సాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టుపై స్పష్టత ఇవ్వాలని వెంకయ్య కోరగా.. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నింటికీ రక్షణ ఉంటుందని జైరాం రమేశ్ వివరించారు. అలాగే.. సీమాంధ్రకు తొలి ఏడాది రెవెన్యూ లోటును కేంద్ర బడ్జెట్ నుంచి భర్తీ చేస్తారని జైరాం వివరించారు. దీనిపై వెంకయ్య మరింత స్పష్టత కోరగా.. మధ్యంతర బడ్జెట్‌ను ఇప్పటికే పార్లమెంటు ఆమోదించిందని, అందులో చేర్చటం సాధ్యం కాదని, రాబోయే పూర్తిస్థాయి బడ్జెట్‌లో దీనిని చేరుస్తారని జైరాం వివరణ ఇవ్వటంతో వెంకయ్య సంతృప్తిచెందారు. మరో సభ్యుడు మహాపాత్ర సవరణను ప్రతిపాదిస్తూ ‘పోలవరం ప్రాజెక్టును ఛత్తీస్‌గఢ్, ఒడిశా వ్యతిరేకిస్తుండగా.. అనేక కేసులు పెండింగ్‌లో ఉండగా.. ఆ ప్రాజెక్టుపై ఎలా హామీ ఇస్తారు..’ అని ప్రశ్నించారు. దానికి జైరాం వివరణ ఇస్తూ.. అది బహుళార్థక సాధక ప్రాజెక్టు అని, దానికి పూర్తిచేయాల్సినవన్నీ పూర్తిచేశాకే నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు.
ఉదయమంతా వాయిదాల పర్వమే: అంతకుముందు ఉదయం 11 గంటల నుంచి పలుమార్లు సభ సమావేశమైనపుడు పలువురు మంత్రులు కొన్ని నివేదికలు ప్రవేశపెట్టారు. మధ్యాహ్నం 2.30 గంటలకు సమావేశమైనపుడు విజిల్ బ్లోయర్ ప్రొటెక్షన్ బిల్లుపై చర్చకు డిప్యూటీ చైర్మన్ ప్రతిపాదించగా.. బీజేపీ సభ్యుడు ప్రకాశ్‌జవదేకర్ తెలంగాణ బిల్లు ఎప్పుడు తెస్తారని అడిగారు. సీపీఎం సభ్యుడు ఏచూరి మాత్రం విజిల్ బ్లోయర్ బిల్లుపై చర్చ జరగాలన్నారు. ఈ గందరగోళంలో సభ మళ్లీ వాయిదాపడింది. సభ 2.39కి మరోసారి అరగంట వాయిదాపడింది. తిరిగి 3.08కి సమావేశమైంది. తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని హోంమంత్రిని కోరగా షిండే ప్రవేశపెట్టారు. ఆయన ప్రసంగానికి సభ్యులు అడ్డుతగలటంతో సభను పది నిమిషాలపాటు వాయిదావేశారు. అక్కడి నుంచి మళ్లీ నాలుగు సార్లు పది నిమిషాలకోసారి చొప్పున సభ వాయిదా పడింది. చివరికి 4:30 గంటలకు చర్చ మొదలైంది.