ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ఇన్‌చార్జి మంత్రి
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ఇన్‌చార్జి మంత్రి
Published Tue, Dec 20 2016 11:43 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM
- ' మునుగాల ' నిందితులను అరెస్ట్ చేయకపోతే హై కోర్టును ఆశ్రయిస్తాం
– వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు కొత్తకోట ప్రకాష్‌రెడ్డి
గూడూరు: టీడీపీకే చెందిన రౌడీలకే పనులు జరగాలని ఆ పార్టీకి చెందిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు అ«ధికారులకు ఆదేశాలు ఇస్తూ ప్రజాస్వామాన్ని ఖూనీ చేస్తున్నాడని వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర పాలక మండలి మెంబర్, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం వైఎస్‌ఆర్‌సీపీ దివ్యాంగుల విభాగం మండల అధ్యక్షుడు బండిరాజు గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్తకోట మాట్లాడుతూ టీడీపీ కోడుమూరు ఇన్‌చార్జి విష్ణువర్దన్‌రెడ్డిపై 60 కేసులున్నాయని, ఆయనపై రౌడీ షీట్ కూడా ఉందని గుర్తు చేశారు. అటువంటి వ్యక్తి సూచించిన పనులనే చేయాలని ఇన్‌చార్జి మంత్రి ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇవ్వడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
కోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి ఓట్లు లేవని కేవలం ఎన్నికల్లో గెలిచిన వారిని కొనుగోలు చేసుకోవడం తప్ప విష్ణువర్దన్‌రెడ్డి సాధించింది ఏమీ లేదన్నారు. తన స్వంత ఊరి ప్రజలు(ఎదురూరు)చేతిపంపుల ద్వారా వచ్చే ఉప్పు నీటినే తాగుతూ కష్టాలు పడుతున్నా పట్టించుకోకుండా గూడూరులో అభివృద్ధి చేశానని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఢిల్లీలో అధికారులను పలుమార్లు కలిసి గూడూరుకు రూ.42 కోట్లతో ప్రత్యేక పైప్‌లైన్ స్కీమ్ మంజూరు చేయిస్తే తన వల్లే జరిగిందని చెప్పుకోవడం విష్ణు అవివేకమన్నారు. మునుగాల ఎత్తిపోతల పథకం కింద ఆయకట్టు రైతుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసిన టీడీపీ స్థానిక నేతలను వారం రోజుల్లో అరెస్ట్ చేయకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని ప్రకాష్‌రెడ్డి హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో పార్టీ గూడూరు, కర్నూలు మండలాల కన్వీనర్లు ఎల్.భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి చనుగొండ్ల దౌల, స్థానిక నేతలు డీటీ విఠల్, ఎస్.సంజీవరావు, రవిప్రతాప్, డీలర్ బజారి, జె.కొండల్ ఉన్నారు.
Advertisement
Advertisement