దౌర్జన్యాలతో దక్కించుకుంటే.. ఇక ఎన్నికలెందుకు? | What is the significance of conducting elections: YS Jaganmohan Reddy | Sakshi
Sakshi News home page

దౌర్జన్యాలతో దక్కించుకుంటే.. ఇక ఎన్నికలెందుకు?

Published Tue, Jul 8 2014 1:03 AM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM

దౌర్జన్యాలతో దక్కించుకుంటే.. ఇక ఎన్నికలెందుకు? - Sakshi

దౌర్జన్యాలతో దక్కించుకుంటే.. ఇక ఎన్నికలెందుకు?

 ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీలను నెరవేర్చలేని స్థితిలో ఉన్న మీరు (చంద్రబాబు) అసలు మనుషులు కాదనిపిస్తోంది. ప్రజలకు అబద్ధాలు చెప్పారు. హామీలు నెరవేర్చలేని స్థితిలో ఉన్న మీరు  ప్రజల దృష్టిని మళ్లించాలనే ఉద్దేశంతో ప్రతిపక్షం అనేదే లేకుండా చేయాలని పన్నాగాలు పన్నుతున్నారు. రాబోయే రోజుల్లో.. ఓట్లేసిన ప్రజలే ప్రతిపక్షమై మీ చొక్కాలు, కాలర్లు పట్టుకునే పరిస్థితి వస్తుంది. 
 
 రుణమాఫీలు చేస్తానని చెప్పి, ఆ పని చేయకుండా జనంలోకి వెళితే రైతులంతా చొక్కా పట్టుకుంటారు. ఇంటింటికీ ఒక ఉద్యోగం ఇస్తామన్నారు. ఉద్యోగం ఇవ్వకపోతే నెలకు 2,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. ఆ పని ప్రభుత్వం కనుక చేయకపోతే నిరుద్యోగులు, చదువుకున్న విద్యార్థులు తప్పకుండా కాలర్ పట్టుకుని రెండు వేలెందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తారు. 
 - వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
  • స్థానిక ఎన్నికల్లో టీడీపీ తీరుపై గవర్నర్‌కు వై.ఎస్.జగన్ ఫిర్యాదు
  •   రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీయే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది 
  •   జడ్‌పీ, ఎంపీపీ, మునిసిపల్ అధ్యక్ష పీఠాల కోసం దౌర్జన్యం చేస్తోంది
  •   {పజాతీర్పునకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ సభ్యులను కిడ్నాప్ చేసి, 
  •  భయపెట్టి, ప్రలోభపెట్టి తమకు ఓట్లు వేయించుకుంటోంది
  •   సీఎం చంద్రబాబే జడ్‌పీటీసీలతో మాట్లాడుతూ ప్రలోభపెడుతున్నారు
  •   కలెక్టర్లు, ఎస్‌పీలు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు
  •   మా పార్టీకి మెజారిటీ వచ్చిన చోట్లా.. గెలవకుండా అడ్డుకుంటున్నారు 
  •   అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు బాహాటంగా వీరంగం వేస్తున్నారు
  •   బాబు సీఎం అయ్యాక 17 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలను చంపించారు
  •   టీడీపీ దాడులపై కేసుల నమోదుకు పోలీసులు నిరాకరిస్తున్నారు
  •   అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అని ప్రజలు నిర్ఘాంతపోతున్నారు
  •   రాష్ట్రంలో ఎన్నికల సంఘం ఉందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి
  •   ఇలా దౌర్జన్యంగా పీఠాలు లాక్కునేకంటే.. నామినేట్ చేసుకోవచ్చు కదా!
  •   ఈ పరిస్థితుల్లో ఇక ఉప ఎన్నికలు ఎలా నిర్వహిస్తారో ఊహించొచ్చు 
  •   {పతిపక్షం గొంతు నొక్కటానికి అధికారపక్షం ఈ దురాగతాలు చేస్తోంది 
  •   స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ ఆగడాలు, అక్రమాలను నియంత్రించండి 
  •   వీడియో దృశ్యాలతో సహా గవర్నర్‌కు వైఎస్సార్ సీపీ అధినేత ఫిర్యాదు 
  •   త్వరలో రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రులకూ ఫిర్యాదు చేస్తాం
 సాక్షి, హైదరాబాద్: ‘‘స్థానిక సంస్థల్లో ఇతర పార్టీ గుర్తులపై ఎన్నికైన వారిని అధికారపక్షం భయపెట్టి, ప్రలోభపెట్టి తమ వైపుకు లాక్కొని వారితో ఓట్లేయించుకునేట్లయితే ఇక ప్రజాస్వామిక వ్యవస్థకు అర్థమేముంది? ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరమేముంది? ఆ పదవులకు అధికారపక్షమే నామినేట్ చేసుకుంటే సరిపోతుంది కదా!’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు.
 
ఈ నెల 3, 4, 5 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మునిసిపల్, మండల, జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నికల సందర్భంగా అధికార తెలుగుదేశం పార్టీ పాల్పడిన దౌర్జన్యాలపై జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. పార్టీకి చెందిన సహచర ఎమ్మెల్యేలతో ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలను పూసగుచ్చినట్టు వివరించారు. ఆయా జిల్లాల్లో ఈ ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, వారి కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడిన ఘటనలపై ల్యాప్‌టాప్‌లో విడియోను ప్రదర్శించి చూపడమే కాకుండా సమగ్ర సమాచారంతో కూడిన డీవీడీని, దానితో పాటు ఒక వినతిపత్రాన్ని గవర్నర్‌కు అందజేశారు. జిల్లా కలెక్టర్, పోలీసుల సమక్షంలో వారి సహకారంతో అధికారపక్ష నేతలు ఎలా అక్రమాలకు పాల్పడిందీ ఆయన దృష్టికి తెచ్చారు. నెల్లూరు జిల్లా పరిషత్‌లో టీడీపీ ఎమ్మెల్యేలు చేసిన వీరంగం, వైఎస్సార్ సీపీ జెడ్‌పీటీసీలను వారు లాక్కుని వెళ్లిన దృశ్యాలను చూపించారు. అంతులేకుండా సాగుతున్న అధికారపక్షం అక్రమాలు, ఆగడాలను అరికట్టాలని గవర్నర్‌కు జగన్ విజ్ఞప్తిచేశారు.
 
వీడియో దృశ్యాలను తిలకిస్తున్నప్పుడు ఎన్నికల సందర్భంగా గొడవ చేస్తున్న వారి వివరాలను నరసింహన్ అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాలను గవర్నర్‌కు వివరించిన అనంతరం జగన్ రాజ్‌భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉన్న పార్టీయే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఇంతటి దారుణానికి దిగడం ఎంతవరకు సమంజసమని టీడీపీపై ధ్వజమెత్తారు. వేరే పార్టీ బీ ఫారంపైన ఎన్నికైన ఎంపీటీసీలు, జెడ్‌పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను లాక్కోవాలనే ఆలోచన ఎక్కడా ఎవరూ చేసి ఉండరని పేర్కొన్నారు.
 
‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినందుకు చంద్రబాబు సంతోషించకుండా మండల, జిల్లా పరిషత్, మునిసిపల్, కార్పొరేషన్ల మేయర్, చైర్మన్ పదవులను కూడా ఇతర పార్టీల నుంచి లాక్కోవాలని ప్రయత్నించడం దౌర్భాగ్యం. స్థానిక ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా.. వైఎస్సార్ సీపీ గుర్తుపై ఎన్నికైన వ్యక్తులను భయపెట్టి, ప్రలోభపెట్టి, కిడ్నాప్ చేసి వాళ్లతో బలవంతంగా టీడీపీకి ఓట్లేయించుకుంటున్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తే నేరుగా జెడ్‌పీటీసీలకు ఫోన్లు చేసి మాట్లాడుతున్నారంటే ఈ వ్యవస్థ ఎక్కడికి పోతోందో ప్రజాస్వామ్యంలో ఉన్న వారంతా ఆలోచించాలి’’ అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయంలో ప్రజా స్వామ్యవాదులు స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement