న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యానికి భారత్ తల్లిలాంటిదని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ‘‘అంతర్జాతీయంగా ఎన్నో ప్రతికూలతలు ఉన్నా, వేగంగా ఎదుగుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ప్రజాస్వామ్యంతో సత్ఫలితాలు లభిస్తాయనడానికిదే నిదర్శనం’’ అన్నారు. గురువారం నిర్వహించిన ‘ప్రజాస్వామ్యం కోసం శిఖరాగ్ర సదస్సు–2023’లో మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. ప్రభుత్వ కార్యక్రమాలకు దేశ ప్రజల సమ్మిళిత ప్రయత్నాలే తగిన బలాన్ని ఇస్తున్నాయని చెప్పారు. పాలకులను ప్రజలంతా కలిసి ఎన్నుకొనే ఆలోచన ప్రపంచ దేశాల కంటే చాలా ఏళ్ల ముందే భారత్‌లో ఆవిర్భవించిందని గుర్తుచేశారు.
ప్రజల ప్రథమ విధి పాలకులను ఎన్నుకోవడమేనని మహాభారతంలో ఉందని తెలిపారు. ప్రాచీన భారతదేశంలో ఎన్నో గణతంత్ర రాజ్యాలుండేవని చెప్పడానికి చారిత్రక ఆధారాలున్నాయని వివరించారు. ‘‘గణతంత్ర రాజ్యాల్లో పాలనాధికారం వారసత్వంగా దక్కేది కాదు. పాలకులను ప్రజలు ఎన్నుకునేవారు’’ అని వెల్లడించారు. ప్రజాస్వామ్యం అనేది కేవలం ఒక నిర్మాణం కాదని, అదొక స్ఫూర్తి అని మోదీ పేర్కొన్నారు. ‘ప్రజాస్వామ్యం కోసం శిఖరాగ్ర సదస్సు–2023’కు అమెరికా, కోస్టారికా, జాంబియా, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా దేశాల అధినేతలు ఆతిథ్యం ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment