![NEET row: 3 AIIMS Patna doctors detained before Supreme Court hearing today](/styles/webp/s3/article_images/2024/07/18/neet.jpg.webp?itok=dkSulnUn)
నేషనల్ ఎంట్రన్స్-కమ్-ఎలిజిబిలిటీ టెస్ట్ (నీట్)-యుజీ పేపర్ లీక్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. నీట్ వ్యవహారాన్ని విచారిస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తాజాగా బిహార్‌లోని ఎయిమ్స్ పాట్నాకు చెందిన ముగ్గురు వైద్యులను అరెస్ట్ చేసింది.ఈ ముగ్గురిపైనా పేపర్ లీక్, ప్రవేశ పరీక్షలో అవకతవకలు తదితర ఆరోపణలు ఉన్నాయి.
నిందితుల గదులకు సీల్ వేసిన సీబీఐ.. ల్యాప్‌టాప్, మొబైల్‌ను సీజ్ చేసింది. ముగ్గురూ 2021 బ్యాచ్‌కు చెందిన వైద్యులుగా గుర్తించారు. నేడు వీరిని అధికారులు విచారించనున్నారు.
కాగా రెండు రోజుల క్రితమే నీట్ పేపర్ దొంగతనం ఆరోపణలపై సీబీఐ ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. బిహార్‌లో పంకజ్ కుమార్, జార్ఖండ్‌లో రాజు సింగ్‌ను అరెస్ట్ చేసింది. పాట్నా ప్రత్యేక కోర్టు వీరిద్దరికీ 14, 10 రోజుల సీబీఐ కస్టడీకి పంపింది. ఈ కేసులో కింగ్‌పిన్ రాకేష్ రంజన్ అలియాస్ రాకీ కూడా కస్టడీలో ఉన్నాడు.
ఇదిలా ఉండగా నేడు(గురువారం) నీట్ పేపర్ లీక్ సహా అక్రమాలకు సంబంధించిన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జూలై 11న జరిగిన విచారణలో కేంద్రం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నుంచి స్పందన లేకపోవడంతో.. పరీక్షను రద్దు చేయాలని, మళ్లీ పరీక్ష నిర్వహించాలని, అక్రమాలపై దర్యాప్తు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌లను కోర్టు జూలై 18కి వాయిదా వేసింది.
ఇదిలా ఉండగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించేదే నీట్-యూజీ పరీక్ష. ఈ ఏడాది మే 5న జరిగిన ఈ పరీక్షలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో వివాదం చెలరేగింది. బిహార్‌లో సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ పేపర్ లీకేజీకి సంబంధించినది కాగా, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రలో నమోదైనవి అభ్యర్థులను మోసగించిన వాటికి సంబంధించినవి
Comments
Please login to add a commentAdd a comment