పలు పరీక్ష కేంద్రాల్లో భిన్నమైన ఫలితాలు
సికర్, నామకల్‌లోని కేంద్రాల్లో టాప్ స్కోర్
రీటెస్ట్ ఫలితాలు ఆశ్చర్యకరం
లోతుగా విశ్లేషించాల్సిన అవసరముంది
నీట్ యూజీ–2024 పరీక్ష ఫలితాలపై వివాదం కొనసాగుతూనే ఉంది. మే 5న దేశవ్యాప్తంగా పరీక్ష నిర్వహించగా.. 23 లక్షల మందికిపైగా హాజరయ్యారు. గత నెలలో ఫలితాలు వెల్లడికాగా..పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ ఆందోళన వ్యక్తమైంది. అనేకమంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు పరీక్ష నిర్వహణ సంస్థ.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తాజాగా పట్టణాలు, పరీక్ష కేంద్రాల వారీగా ఫలితాలను వెల్లడించింది.
700+ స్కోర్‌తో ఆలిండియా కోటా సీటు..
నీట్‌లో 700+ మార్కులు స్కోర్ చేసిన 2,321 మంది విద్యార్థులకు ఆల్ ఇండియా కోటాలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) వంటి ప్రముఖ విద్యాసంస్థల్లో మెడికల్ సీటు లభిస్తుంది. అదేవిధంగా 650+ మార్కులు స్కోర్ చేసిన 30,204 మంది విద్యార్థులకు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రవేశం దక్కుతుంది. అలాగే 600+ మార్కులు స్కోర్ చేసిన 81,550 మంది విద్యార్థులకు ప్రైవేట్ కళాశాలల్లో ఏదో ఒక చోట సీటు సొంతమయ్యే అవకాశముంది.
రీటెస్ట్ తర్వాత ఫలితం..
గ్రేస్ మార్కుల వివాదం నేపథ్యంలో సుప్రీంకోర్టు.. నీట్ రీటెస్ట్‌కు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ రీటెస్ట్ త ర్వాత హరియాణాలోని ఒక పరీక్ష కేంద్రంలో ఆశ్చర్యకర ఫలితాలు వెల్లడయ్యాయి. హిస్సార్‌లోని హరదయాళ్ పబ్లి క్ స్కూల్ పరీక్ష కేంద్రంలో రీటెస్ట్‌కు ముందు వెల్లడించిన ఫలితాల్లో మొత్తం 8 మంది విద్యార్థులకు 720, 719, 718 మార్కులు వచ్చాయి.
రీటెస్ట్ ఫలితాలు వెల్లడయ్యాక ఈ పరీక్ష కేంద్రంలో గరిష్ట స్కోర్ 682 మాత్రమే. అంతేకాకుండా కేవలం ఇద్దరు విద్యార్థులకు మాత్రమే 650+ మార్కు లు వచ్చాయి. 13 మంది విద్యార్థులు 600+ మార్కులు స్కోర్ చేశారు. దీన్నిబట్టే చూస్తే రీటెస్ట్‌కు ముందు ఈ సెంటర్‌లో వెల్లడయిన ఫలితం ఆశ్చర్యకరమని చెప్పొచ్చు.
సికర్ ఫలితం.. ఆశ్చర్యకరం
రాజస్తాన్‌లోని సికర్ పట్టణంలో మొత్తం 50 కేంద్రాల్లో నీట్ యూజీ పరీక్ష జరిగింది. ఈ పట్టణంలోని కేంద్రాల్లో మొత్తం 27,216 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా.. 149 మందికి 700+ స్కోర్ వచ్చింది. 650 + స్కోర్ చేసిన విద్యార్థుల సంఖ్య 2,037. అలాగే 4,297 మంది విద్యార్థులు 600 + స్కోర్ చేశారు. సికర్‌లో నీట్ రాసిన విద్యార్థుల సగటు మార్కులు 362.
దేశవ్యాప్తంగా పరీక్ష రాసిన మొత్తం 23 లక్షల మందిలో 30,204 మంది విద్యార్థులు 650+ స్కోర్ చేశారు. కేవలం 1.3 శాతం మంది. కాని ఒక్క సికర్‌లోనే 2,037 మంది 650+ స్కోర్ చేశారు. ఇది 6.8 శాతం. అదేవిధంగా దేశవ్యాప్తంగా పరీక్ష రాసిన వారిలో 1.3 శాతం మందికి మాత్రమే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు వచ్చే అవకాశం లభించగా.. సికర్‌లో పరీక్ష రాసిన వారిలో ఏకంగా 7.48 శాతం మందికి ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్ దక్కుతోంది.
ఇక్కడే చాలా మందికి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ ఏదో జరిగిందని నేను అనడం లేదు. కాని కేవలం 50 పరీక్ష కేంద్రాలున్న ఒక్క సిటీలో ఇంత మందికి బెస్ట్ స్కోర్ ఎలా సాధ్యమనే ప్రశ్న చాలా మందికి ఎదురవుతోంది.
ఒక్క కేంద్రంలో 12 మందికి 700+
» అహ్మదాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పరీక్ష కేంద్రంలో మొత్తం 676 మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాయగా.. ఏకంగా 12 మందికి 700 + స్కోర్ వచ్చింది.
» నామకల్‌లోని ద నవోదయా అకాడెమీ సీనియర్ సెకండరీ స్కూల్‌లో 659 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా.. 8 మందికి 700+ మార్కులు వచ్చాయి.
» సికర్‌లోని టాగోర్ పీజీ కాలేజీలో 356 మంది పరీక్ష రాయగా.. 5గురికి 700+ స్కోర్ వచ్చింది.
టాప్ 50లో 37 సికర్ నుంచే
» 650 మార్కుల కంటే ఎక్కువ స్కోర్ చేసిన టాప్ 50 పరీక్ష కేంద్రాల్లో 37 సికర్‌లోని పరీక్ష కేంద్రాలే. అలాగే దేశంలో బెస్ట్ ఫలితం వచ్చిన టాప్ 60 పరీక్ష కేంద్రాల్లో 43 సికర్ నుంచే ఉన్నాయి. టాప్ 50లో నామకల్‌లోని ఐదు పరీక్ష కేంద్రాలు, హర్యాన, హిస్సార్‌లోని జఝర్ వంటివి ఉన్నాయి.
ళీ రాజ్‌కోట్‌లోని ఒక పరీక్ష కేంద్రంలో ఏకంగా 200 మంది విద్యార్థులకు 600 + మార్కులు వచ్చాయి.
రాజస్థాన్ బెస్ట్ ప్రదర్శన
» దేశ వ్యాప్తంగా నీట్ యూజీలో ఉత్తమ ఫలితాలు చూపిన టాప్ 10 సిటీలో.. ఐదు రాజస్థాన్ నుంచే ఉన్నాయి.
» రాష్ట్రాలు/కేంద్రాలు పాలిత పాంత్రాల వారిగా చూసే.. నీట్‌లో ఉత్తమ ఫలితం చూపిన టాప్ పది రాష్ట్రాల్లో వరుసగా చండీగఢ్, రాజస్థాన్, హరియాణా కేరళ, ఢిల్లీ, పంజాబ్, ఒడిశా, గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి.
» ఈశాన్య రాష్ట్రాల్లో నీట్ ఫలితాలు నిరాశజనకంగా ఉన్నాయి. కాగా కొన్ని పరీక్ష కేంద్రాలు, కొన్ని సిటీల్లో ఇలా ఎందుకు ఫలితం భిన్నంగా ఉంది. ఇక్కడ ఎక్కువ మందికి బెస్ట్ ర్యాంకులు ఎలా వచ్చాయి అనే సందేహం రావడం సహజం. అయితే దీనికి ఈ సిటీల్లో అందుబాటులో ఉన్న కోచింగ్ సౌకర్యాలు కారణం కావచ్చు. కోచింగ్ వల్ల కొన్ని చోట్ల విద్యార్థులు మంచి ఫలితం సాధించి ఉండొచ్చు.
» కోచింగ్‌కు పేరుగాంచిన కోటా పట్టణంలోని పరీక్ష కేంద్రాల్లో హాజరైన విద్యార్థుల డేటాను విశ్లేషించినా.. సికర్‌లో పరీక్ష రాసిన విద్యార్థులు ఎంతో ముందున్నారని అర్థమవుతోంది. కోటాలో 27,118 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైతే..700+ స్కోర్ చేసింది 74 మంది(0.27శాతం) మాత్రమే. అదే సికర్‌లో ఆ సంఖ్య రెండింతలుగా ఉంది. 650+ స్కోర్ చేసిన విద్యార్థుల సంఖ్య 1,066(3.93 శాతం)గా ఉంది. అలాగే ఇక్కడ 2,599 విద్యార్థులు 600 + స్కోర్ చేశారు. 600+స్కోర్ చేసిన విద్యార్థులు కోటాలో 9.58 శాతం ఉండగా.. సికర్‌లో అది 16 శాతంగా ఉంది.
రాష్ట్రాలవారీగా 700కు పైగా మార్కులు వచ్చిన విద్యార్థులు
రాజస్థాన్482
కేరళ194
హరియాణా146
మహారాష్ట్ర 205
ఉత్తరప్రదేశ్184
తెలంగాణ49
Comments
Please login to add a commentAdd a comment