పాట్నా: నీట్ పేపర్ లీకేజీలో ప్రధాన సూత్ర దారి బీహార్‌లోని షాపూర్‌కు చెందిన సంజీవ్ ముఖియా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
దేశంలో వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు మే 5న నీట్-యూజీ ప్రవేశ పరీక్ష 2024 నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించింది. ఈ పరీక్ష నిర్వహణకు ముందు పేపర్ లీకేజీ కావడం దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారమే చెలరేగింది.
అయితే ఈ పేపర్ లీకేజీ అంతా బీహార్‌లోని పాట్నా ఓ బాయ్స్ హాస్టల్ కేంద్రంగా జరిగినట్లు తెలుస్తోంది. మే 5న నీట్ పరీక్ష జరగాల్సి ఉండగా.. మే 4న లీకేజీలో మాస్టర్ మైండ్ బీహార్ నూర్సరాయ్‌లోని నలంద కాలేజీ ఆఫ్ హార్టికల్చర్ టెక్నికల్ అసిస్టెంట్ సంజీవ్ ముఖియా బాయ్స్ హాస్టల్‌లో నీట్ పరీక్ష రాసే 25మంది విద్యార్ధులకు వసతి కల్పించాడు.
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు సంజీవ్ ముఖియా నీట్ క్వశ్చన్ పేపర్, జవాబుల పత్రాన్ని అదే హాస్టల్‌లో విద్యార్ధులకు అందించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆ హాస్టల్‌ను ప్రభాత్ రంజన్ అనే వ్యక్తి నుంచి తీసుకున్నాడు.
ఇంతకీ ఎవరా ప్రొఫెసర్
పేపర్ లీక్ కేసుకు సంబంధించి బీహార్ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం ప్రభాత్ రంజన్‌కు సైతం ప్రశ్నించారు. ఈ పేపర్ లీకేజీలో హస్తం ఉందని గుర్తించారు. రంజన్ నీట్ పేపర్లను ప్రొఫెసర్ నుంచి తీసుకొని సంజీవ్ ముఖియాకు ఇచ్చినట్లు తేలింది. పరీక్షకు ముందు రోజే పేపర్లు విద్యార్ధులకు అందుబాటులోకి వచ్చినా సమయం లేకపోవడం వల్ల పూర్తిగా చదవలేదని సమాచారం. ఇక, పోలీసులు దర్యాప్తు చేస్తున్న పేపర్ లీక్ కేసులో ముఖియాతో సంబంధం ఉన్న రవి అత్రి పేరు కూడా బయటపడింది.
చదవండి : 👉 నీట్ పేపర్ లీక్‌పై కేంద్రం చర్యలు
ముఖియాను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ముమ్మరం చేశారు. నీట్ పేపర్ లీక్‌తో ముఖియా ప్రమేయం ఉన్నట్లు సూచించే వివరాలు వెలుగులోకి రావడంతో అతన్ని అరెస్ట్ చేసేందుకు బీహార్ పోలీసుల ఆర్ధిక నేరాల విభాగం( ఈఓయూ) ప్రయత్నాలు ముమ్మరం చేసింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం..ఈఓయూ నలంద, గయా, నవాడా జిల్లాల్లోని పోలీసు బృందాలను అప్రమత్తం చేసింది.
ఇదిలా ఉండగా, లీకైన పేపర్లు ఉత్తరప్రదేశ్ నుండి జార్ఖండ్ మీదుగా బీహార్‌కు చేరుకున్నాయని పోలీసులు అనుమానించడంతో జార్ఖండ్‌కు చెందిన పలువురు అనుమానితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
సంజీవ్ ముఖియా ఎవరు
2010లో పరీక్ష పేపర్ లీకేజీ వార్తల సమయంలో సంజీవ్ ముఖియా పేరు మారు మ్రోగింది. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్‌ఈ) సహా అనేక పరీక్షల పేపర్ లీక్‌లకు సూత్రధారి. ఆ తర్వాత పేపర్ లీకేజీల కోసం ఓ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. సంజీవ్ కుమారుడు శివ కుమార్ గతంలో బీపీఎస్‌ఈ పరీక్ష లీక్ వ్యవహారంలో అరెస్టయ్యాడు. ఇప్పటికీ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. సంజీవ్ ముఖియా భార్య మమతా దేవి గతంలో రామ్‌విలాస్ పాశ్వాన్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ నుంచి టికెట్‌పై పోటీ చేశారు.
నిందితులపై కఠిన చర్యలు
కాగా, వరుస పేపర్ లీక్‌లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కేంద్ర ప్రభుత్వం అందుకు బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొనేందుకు ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్ 2024ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ఎవరైనా చట్టవిరుద్ధంగా పరీక్ష పేపర్లను అందుకున్నా, ప్రశ్నలు, జవాబులను లీక్ చేసినా, పరీక్ష రాసే వారికి అనుచితంగా సాయం చేసినా, కంప్యూటర్ నెట్‌వర్క్‌ను ట్యాంపరింగ్ చేసినా, నకిలీ పరీక్షలు నిర్వహించినా, నకిలీ ప్రవేశపరీక్ష కార్డులు జారీ చేసినా నేరంగా పరిగణిస్తారు. కారకులకు 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలుశిక్ష, రూ.కోటి వరకు జరిమానా విధించడానికి వీలుంది.
Comments
Please login to add a commentAdd a comment