మళ్లీ నీట్ పరీక్ష నిర్వహిస్తారంటూ అభ్యర్థులకు ఫోన్‌లు
షార్ట్‌టర్మ్ కోర్సులో చేరితే ప్రత్యేక రాయితీలంటూ ఆకర్షణ
రాష్ట్రస్థాయి ర్యాంకులు ఇవ్వక పోవడంతో అభ్యర్థుల్లో గందరగోళం
సాక్షి, హైదరాబాద్: ‘యూజీ నీట్ పరీక్ష రద్దు అవుతుంది. కొత్తగా మళ్లీ పరీక్ష నిర్వహించనుంది. అందుకే షార్ట్‌టర్మ్ కోర్సు ప్రారంభించాం. మీ అమ్మాయిని వెంటనే చేరి్పస్తే ఫీజు కూడా రాయితీ ఇస్తాం’ రెండ్రోజుల కిందట ఓ ప్రముఖ నీట్ కోచింగ్ సెంటర్ నుంచి విద్యార్థి తండ్రికి వచి్చన ఫోన్‌కాల్ ఇది. ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి యూజీ నీట్ ప్రవేశాలపై తీవ్ర గందరగోళం నెలకొంది. నీట్ పరీక్షలో కొందరు అదనపు మార్కుల ప్రయోజనం, ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం, టాప్ ర్యాంకులపై రగడ తదితర అంశాలతో దేశవ్యాప్తంగా తీవ్ర అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈ పరిస్థితిని కొన్ని కోచింగ్ సెంటర్లు క్యాష్ చేసుకునే దిశగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. నీట్ పరీక్ష రద్దు కానుందని, మళ్లీ కొత్తగా పరీక్ష నిర్వహిస్తారనే ప్రచారానికి ఊపందిస్తూ షార్ట్ టర్మ్ కోర్సులను ప్రారంభిస్తున్నాయి. నీట్ పరీక్ష రాసిన అభ్యర్థులను ఈ కోర్సుల్లో చేరాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ఫీజు తక్కువంటూ బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మే 5న జరిగిన యూజీ నీట్–2024 పరీక్షకు దేశవ్యాప్తంగా 571 నగరాల్లో 4,750 కేంద్రాల్లో నిర్వహించారు. మొత్తం 23 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఇందులో రాష్ట్రం నుంచి 1.05 లక్షల మంది పరీక్ష రాసినట్లు అంచనా.
రూ.25 వేల నుంచి రూ.30 వేల ఫీజు
యూజీ నీట్–2024 ప్రవేశాల ప్రక్రియ జూలై 6 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. కానీ నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై తీవ్ర దుమారం కావడం, ప్రతిపక్షాల నిరసన ఏకంగా పార్లమెంటును స్తంభించే పరిస్థితి నెలకొనడంతో అన్ని వర్గాల్లోనూ అయోమయం నెలకొంది. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రోజురోజుకు తీగలాగితే డొంక కదిలినట్లు కనిపిస్తుండటంతో కౌన్సెలింగ్ నిర్వహిస్తారా? లేదా కొత్తగా పరీక్ష నిర్వహిస్తారా? అనే సందిగ్ధంలో విద్యార్థులున్నారు. మరో వారం రోజుల్లో నీట్ కౌన్సెలింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా ఇంకా రాష్ట్రస్థాయి ర్యాంకులు విడుదల కాలేదు.
కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. మరోవైపు మెరుగైన మార్కులు వచ్చినప్పటికీ విద్యార్థులకు లక్షల్లో ర్యాంకులు రావడంతో సీటు వస్తుందా? రాదా? అంచనా వేసే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో కొత్తగా పరీక్ష నిర్వహిస్తారనే ప్రచారం ఊపందుకోవడంతో అప్పటివరకు ఖాళీగా ఉండలేక షార్ట్‌టర్మ్ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. షార్ట్‌టర్మ్ కోర్సు కోసం ఒక్కో కోచింగ్ సెంటర్ రూ.25 వేల చొప్పున వసూలు చేస్తుండగా.. కొన్నిమాత్రం రూ.30 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. పరీక్ష నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా కోర్సుల్లో చేరి డబ్బులు వృథా చేసుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment