నీట్ యూజీ పరీక్షలో అవకతవకలపై వివాదం కొనసాగుతున్న వేళ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు, ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. వైద్య విద్యలో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్ష నీట్ నుంచి రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని, జాతీయ స్థాయిలో ఈ వ్యవస్థను తొలగించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
వైద్య విధ్యలో విద్యార్ధుల ఎంపిక ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా కాకుండా ప్లస్ 2(12వ తరగతి) మార్కుల ఆధారంగా మాత్రమే ఉండాలని కోరారు. ఇది విద్యార్ధులపై అనవసరమైన అదనపు ఒత్తిడిని తగ్గిస్తుందని చెప్పారు.
"దీనికి సంబంధించి, తమిళనాడును నీట్ నుండి మినహాయించాలని మరియు 12వ తరగతి మార్కుల ఆధారంగా మెడికల్ అడ్మిషన్లు అందించాలని మేము మా శాసనసభలో ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించాము. ఇది రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించాం. అయితే ఇంకా పెండింగ్‌లో ఉంది," అని స్టాలిన్ లేఖలో పేర్కొన్నారు.
నీట్ మినహాయింపు కోసం తమిళనాడు చేస్తున్న డిమాండ్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కూడా లేఖ రాశారు. ఇటీవల నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై రాష్ట్రం వ్యతిరేకత వ్యక్తం చేస్తుందని సీఎం తెలిపారు. నీటి తొలగింపుపై ఇతర రాష్ట్రాలు కూడా కోరుతున్నాయని పేర్కొన్నారు.
పై విషయాలను పరిగణనలోకి తీసుకుని, నీట్ నుంచి తమిళనాడును మినహాయించే బిల్లుకు కేంద్ర ప్రభుత్వం తన సమ్మతిని అందించాలని, జాతీయ స్థాయిలో వైద్య కమిషన్ చట్టాన్ని కూడా సవరించాలని కోరుతూ తమిళనాడు శాసనసభ శుక్రవారం ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించిందని చెప్పారు.
కాగా.. నీట్‌ను రద్దు చేయడానికి తమ తమ అసెంబ్లీలలో ఇదే విధమైన తీర్మానాన్ని ఆమోదించడాన్ని పరిశీలించాలని కోరుతూ ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌లోని సీఎంలను స్టాలిన్ లేఖల ద్వారా కోరారు.
Comments
Please login to add a commentAdd a comment