నీట్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక ప్రకటన చేశారు. విద్యార్థుల ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై బిహార్ ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని పేర్కొన్నారు. పరీక్ష పేపర్ లీకేజ్‌పై పూర్తి స్థాయి రిపోర్టు అడిగామని తెలిపారు. దోషులెవరైనా వదిలి పెట్టమని, చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నీట్ వ్యవహారంపై ఉన్నస్థాయి కమిటీ వేస్తున్నామని చెప్పారు.
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వైద్య సంస్థలలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులలో ప్రవేశం కోరుకునే విద్యార్థుల కోసం ప్రతి సంవత్సరం నిర్వహించే ఏకైక ప్రవేశ పరీక్ష నీట్-యూజీ. ఈ సంవత్సరం మే 5న నిర్వహించిన ఈ పరీక్షకు సుమారు 24లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. జూన్ 4న ఫలితాలు ప్రకటించారు.
కాగా 1563 మంది విద్యార్థులకు అదనంగా గ్రేస్ మార్కులు ఇచ్చారు. ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లో మార్పులు, పరీక్ష కేంద్రాల వద్ద సమయం కోల్పోవడంతో వీటిని కలిపారు. దీంతోపాటు అనేకమంది పూర్తి స్థాయి మార్కులు రావడంతో నీట్ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు, పేపర్ లీకైనట్లు ఆరోపణలు రావడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై విచారణ కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment