దేశానికి నీట్ అవసరం లేదు.. న‌టుడు విజ‌య్ కీల‌క వ్యాఖ్య‌లు | Hero Vijay Demands Removal Of NEET Exam | Sakshi
Sakshi News home page

దేశానికి నీట్ అవసరం లేదు.. న‌టుడు విజ‌య్ కీల‌క వ్యాఖ్య‌లు

Published Wed, Jul 3 2024 1:59 PM | Last Updated on Wed, Jul 3 2024 2:05 PM

Hero Vijay Demands Removal Of NEET Exam

చెన్నై: వైద్య విద్య‌లో ప్ర‌వేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వ‌హించే నీట్ యూజీ ప‌రీక్ష నిర్వ‌హణ‌పై దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. నీట్ ప‌రీక్ష‌లో అక్ర‌మాలు జ‌రిగాయంటూ, పేప‌ర్ లీక్ అయిన‌ట్లు విద్యార్ధులు ఆందోళ‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు. అటు విప‌క్షాలు సైతం  నీట్ అక్ర‌మాల‌పై పార్ల‌మెంట్‌లో చర్చ జరపాలని పట్టుబడుతున్నాయి.

ఈ క్ర‌మంలో తాజాగా త‌మిళ స్టార్ హీరో విజ‌య్ నీట్ వివాదంపై స్పందించారు.  నీట్ పరీక్ష వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పేప‌ర్‌ లీక్ కారణంగా ప్ర‌జ‌ల విశ్వసనీయతను కోల్పోయిందన్నారు. వివాదాస్పద నీట్ పరీక్షను రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు.

ఇటీవల జరిగిన పదోతరగతి, పన్నెండవ త‌ర‌గ‌తి పరీక్షల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు ఉపకార వేతనాల ప్రదానోత్సవం రెండో దశ కార్యక్రమంలో తమిళనాడు వెట్రి కజగం పార్టీ అధ్యక్షుడైన‌ విజయ్ నీట్ పరీక్షకు వ్యతిరేకంగా మాట్లాడారు. నీట్ పరీక్ష రద్దుకోసం తమిళనాడు స్టాలిన్ సర్కారు అసెంబ్లీలో చేసిన తీర్మానానికి మద్దతు ఇస్తున్నానని ఆయన ప్రకటించారు. ఈ సమస్యకు పరిష్కారంగా రాజ్యాంగాన్ని సవరించాలని అభిప్రాయపడ్డారు.

‘నీట్ పరీక్షపై ప్రజలకు నమ్మకం పోయింది. దేశానికి నీట్ అవసరం లేదు. నీట్ నుంచి మినహాయింపు ఒక్కటే పరిష్కారం. రాష్ట్ర అసెంబ్లీలో నీట్‌కి వ్యతిరేకంగా ఆమోదించిన తీర్మానాన్ని స్వాగతిస్తున్నాను. తమిళనాడు ప్రజల భావోద్వేగాలను గౌరవించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. విద్యను ఉమ్మడి జాబితా నుంచి రాష్ట్ర జాబితా కిందకు తీసుకురావాలి.

నీట్‌ పరీక్ష కారణంగా తమిళనాడులో పెద్ద సంఖ్యలో పేద, అర్హులైన, అట్టడుగున ఉన్న విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించలేకపోతున్నారు’.అని తెలిపారు ఈ సమస్యకు తాత్కాలిక పరిష్కారంగా ప్రత్యేక ఉమ్మడి జాబితాను రూపొందించడానికి రాజ్యాంగాన్ని సవరించాలని అభిప్రాయపడ్డారు. దానికింద విద్య, ఆరోగ్యాన్ని చేర్చాలన్నారు.

 ఇక నీట్‌ పరీక్షను రద్దు చేయాలని త‌మిళ‌నాడు రాష్ట్ర అసెంబ్లీలో డీఎంకే ప్ర‌భుత్వం ఏకగ్రీవంగా తీర్మానించిన విష‌యం తెలిసిందే. వైద్యసీట్లను భర్తీ చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించాలని, మునుపటిలా 12వ తరగతి మార్కుల ఆధారంగా సీట్లు కేటాయింపులు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement