
న్యూఢిల్లీ: కీలకమైన నీట్, నెట్ పరీక్షల్లో పేపర్ లీకేజీ ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్, నెట్ పరీక్షలను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్‌పై శనివారం వేటు వేసింది.
ఇండియా ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్, ఎండీ ప్రదీప్‌సింగ్ ఖరోలాకు ఎన్‌టీఏ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. యూజీసీ–నెట్ పరీక్ష నిర్వహించిన మరుసటి రోజే, ఈనెల 19న కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. పరీక్షల సమగ్రతకు భంగం వాటిల్లిందని హోంశాఖ తెలుపడంతో యూజీసీ– నెట్‌ను రద్దు చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, పీహెచ్‌డీల ప్రవేశానికి నెట్ పరీక్షను ఏడాదికి రెండుసార్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది.