సాక్షి,న్యూఢిల్లీ : నీట్ పరీక్ష లీకేజీపై దాఖలైన పిటిషన్లపై వచ్చే వారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ఈ తరుణంలో గుజరాత్‌కు చెందిన నీట్ యూజీ ప్రవేశ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన 50 మందికి పైగా విద్యార్ధులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
నీట్ పరీక్షను రద్దు చేయొద్దని కేంద్రానికి, నీట్ పరీక్ష నిర్వహించిన ఎన్‌టీఏకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అదే విధంగా నీట్ పేపర్ లీకేజీకి పాల్పడ్డ నిందితులకు కఠినంగా శిక్షించేంలా కేంద్ర విద్యాశాఖకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.
నీట్ పేపర్ లీకేజీ ఆ తర్వాత జరిగిన వరుస పరిణామాలపై సుప్రీం కోర్టులో 26 పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ధర్మాసనం జులై 8న విచారించనుంది.
అదే సమయంలో 56 మంది విద్యార్ధులు నీట్ పరీక్ష రద్దు చేయొద్దంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం విశేషం. ఈ సందర్భంగా పిటిషనర్లలో ఒకరైన నీట్ యూజీ విద్యార్ధి సిద్దార్ధ్ కోమల్ మాట్లాడుతూ.. కేంద్రం,ఎన్‌టీఏ.. నీట్ పరీక్షను మరోసారి నిర్వహించుకుండా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీం కోర్టును విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇది నిజాయితీ, కష్టపడి చదివిన విద్యార్ధులకు తీవ్రం నష్టం వాటిల్లడమే కాదు.. విద్యాహక్కు ఉల్లంఘనకు దారితీసినట్లవుతుందన్నారు.
నీట్ పరీక్ష క్వశ్చన్ పేపర్ లీక్ చేసిన నేరస్తుల్ని, అందుకు సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. పేపర్ లీకేజీ ఎక్కడెక్కడ జరిగిందో అందుకు బాధ్యులైన వారిని శిక్షించాలని దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరుతున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment