హిందువులమంటూ హింసాద్వేషాల వ్యాప్తి
లోక్‌సభలో రాహుల్ వ్యాఖ్యల దుమారం
హిందూ సమాజంపైనే తీవ్ర వ్యాఖ్యలివి: ప్రధాని నరేంద్ర మోదీ
వెంటనే క్షమాపణలు చెప్పాల్సిందే: కేంద్ర హోంమంత్రి అమిత్ షా
హిందువులంటే మోదీ, బీజేపీ, ఆరెస్సెస్సేనా: రాహుల్ గాంధీ
మోదీ ఆత్మతో పరమాత్మ నేరుగా సంప్రదిస్తాడట..
తనను దేవుడే పంపాడని ఆయనే స్వయంగా చెప్పుకున్నారని ఎద్దేవా
నీట్ సంపన్నుల పరీక్షగా మారిందంటూ ధ్వజం..
చర్చకు నిరాకరించిన స్పీకర్, సభ నుంచి విపక్షాల వాకౌట్
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలు సోమవారం ఊహించినట్టుగానే నీట్ దుమారానికి వేదికగా మారాయి. అది కేవలం సంపన్నుల పరీక్షగా మారిపోయిందని, ప్రతిభావంతులైన విద్యార్థుల భవిష్యత్తుకు సమాధి కడుతోందని విపక్ష నేత రాహుల్‌గాంధీ ఆవేదన వెలిబుచ్చారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో ఆయన గంటా 40 నిమిషాల పాటు మాట్లాడారు. అయితే విపక్ష నేత హోదాలో రాహుల్ చేసిన తొలి ప్రసంగమే సభలో తీవ్ర దుమారం రేపింది. లక్షలాది మంది విద్యార్థుల భవిత ప్రమాదంలో పడ్డా మోదీ సర్కారుకు చీమ కుట్టినట్టు కూడా లేదంటూ ఆయన దుయ్యబట్టారు.
ఆ క్రమంలో చేసిన ‘హిందూ’వ్యాఖ్యలు తీవ్ర కలకలానికి దారి తీశాయి. ‘‘తాము హిందువులమని చెప్పకునే వాళ్లు నిరంతరం హింసా ద్వేషాలను, అవాస్తవాలను వ్యాప్తి చేయడంలో మునిగి తేలుతున్నారు’’అంటూ రాహుల్ తీవ్ర విమర్శలు చేయడంతో సభలో గగ్గోలు రేగింది. అధికార బీజేపీ సభ్యులంతా వాటిని తీవ్రంగా ఖండించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా కలగజేసుకుని రాహుల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఆక్షేపించారు. ‘‘విపక్ష నేత మొత్తం హిందూ సమాజాన్నే హింసాత్మకమైనదిగా అభివరి్ణంచారు.
ఇది చాలా తీవ్రమైన అంశం’’అంటూ దుయ్యబట్టారు. వాటిని రాహుల్ తోసిపుచ్చారు. తన వ్యాఖ్యలు కేవలం బీజేపీని ఉద్దేశించినవి మాత్రమేనని స్పష్టం చేశారు. ‘‘హిందూ సమాజమంటే కేవలం బీజేపీ, ఆరెస్సెస్, మోదీ మాత్రమే కాదు’’అంటూ చురకలు వేశారు. నిర్భీతి, అహింస గురించి మాట్లాడుతూ శివుడు, గురు నానక్, జీసస్ ఫొటోలు సభలో ప్రదర్శించారు. సభలో మత చిహ్నాల ప్రదర్శనకు నిబంధనలు అంగీకరించబోవని స్పీకర్ ఓం బిర్లా వారిస్తున్నా పట్టించుకోలేదు. ‘‘అన్ని మతాలూ, అందరు మహానుభావులూ చెప్పింది అహింస, నిర్భీతి గురించే.
కానీ తాము హిందువులమని చెప్పుకునే వాళ్లు మాత్రం కేవలం హింస, ద్వేషం, అసత్యాల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. ఏ లెక్కన చూసుకున్నా మీరసలు హిందువులే కాదు’’అంటూ బీజేపీ నేతలను దుయ్యబట్టారు. ‘‘మైనారిటీలు దేశానికి గర్వకారణం. అన్ని రంగాల్లోనూ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దేశభక్తులు. వారిపైనా బీజేపీ దారుణంగా దాడులకు దిగుతోంది. ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులపై హింసాద్వేషాలను వ్యాప్తి చేస్తోంది’’అని ఆక్షేపించారు. రాహుల్ ప్రసంగాన్ని ఆయన తల్లి సోనియాగాం«దీ, సోదరి ప్రియాంకా గాంధీ వద్రా లోక్‌సభ ప్రేక్షకుల గ్యాలరీ నుంచి వీక్షించారు.
హిందువులంతా హింసావాదులా: అమిత్ షా
రాహుల్ వ్యాఖ్యలపై నిరసనలతో బీజేపీ సభ్యులు హోరెత్తించారు. రాహుల్ తక్షణం సభకు క్షమాపణ చెప్పి తీరాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా డిమాండ్ చేశారు. ‘‘దేశంలో కోట్లాది హిందువులున్నారు. వారంతా హింసకు పాల్పడేవాళ్లేనన్నది రాహుల్ ఉద్దేశమా? 1975లో ఎమర్జెన్సీ విధింపు, 1984లో సిక్కు వ్యతిరేక అల్లర్ల వంటి అకృత్యాలన్నీ కాంగ్రెస్ పుణ్యమే. దేశమంతటా ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసిందే కాంగ్రెస్. అలాంటి పారీ్టకి చెందిన రాహుల్‌కు అహింస గురించి మాట్లాడే అర్హతే లేదు’’అంటూ మండిపడ్డారు. అయినా రాహుల్ వెనక్కు తగ్గలేదు.
‘‘క్రైస్తవం, ఇస్లాం, బౌద్ధం, జైనం, సిక్కు వంటి మతాలన్నీ ధైర్యం, నిర్భీతి వంటివాటి గురించే చెప్పాయి. కానీ బీజేపీ ప్రజాస్వామిక విలువలపై ఏనాడూ నమ్మకం లేదు. మోదీ ఆదేశాల మేరకు నాపై లెక్కలేనన్ని దాడులు జరిగాయి. 20కి పైగా కేసులు పెట్టారు. నా ఇంటిని లాగేసుకున్నారు. నాపై ఈడీని ప్రయోగించి 55 గంటల పాటు విచారణ జరిపారు. అయినా వెరవకుండా రాజ్యాంగ పరిరక్షణ పోరాటంలో ముందుండి నిలిచా. రాజ్యాంగంపై, భారత దేశ మూల భావనలపై బీజేపీ పాల్పడుతున్న వ్యవస్థీకృత దాడులకు లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు అడ్డుకట్ట వేశారు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీ వాళ్లు కూడా నాతో పాటు రాజ్యాంగానికి జై కొట్టాల్సి వస్తోంది’’అంటూ ఎద్దేవా చేశారు.
‘నీట్’పై విపక్షాల వాకౌట్
సోమవారం లోక్‌సభ సమావేశం కాగానే నీట్–యూజీ పేపర్ లీకేజీ అంశాన్ని రాహుల్ ప్రస్తావించి తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. ‘‘నీట్ వంటి ప్రొఫెషనల్ పరీక్షను కేవలం సంపన్న విద్యార్థులకు అనువైనపక్కా కమర్షియల్ పరీక్షగా మార్చేశారు. గత ఏడేళ్లలో 70కి పైగా పేపర్లు లీకయ్యాయి. ఇంత ముఖ్యమైన అంశంపై ప్రభుత్వం చర్చకు కూడా అంగీకరించడం లేదు. ఇది చాలా తీవ్రమైన అంశం. కనుక సభలో ఒక రోజంతా ప్రత్యేకంగా చర్చ చేపడదాం’’అని ప్రతిపాదించారు. అందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అభ్యంతరం తెలిపారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ఇతర అంశాలపై చర్చ కోరడం లోక్‌సభ సభ్యునిగా నా దశాబ్దాల అనుభవంలో ఎప్పుడూ చూడలేదు’’అన్నారు. అనంతరం నీట్‌పై చర్చకు స్పీకర్ తిరస్కరించారు. అందుకోసం ప్రత్యేక నోటీసివ్వాలని విపక్షాలకు సూచించారు. స్పీకర్ నిర్ణయాన్ని నిరసిస్తూ విపక్షాలన్నీ వాకౌట్ చేశాయి. అంతకుముందు మణిపూర్ కల్లోలం, రైతు ఆత్మహత్యలు, జమ్మూ కశీ్మర్లో హింసాకాండ, జీఎస్టీ, నోట్ల రద్దు తదిరాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వ తీరును రాహుల్ దుయ్యబట్టారు. మణిపూర్‌ను మోదీ సర్కారు అంతర్యుద్ధం దిశగా నెట్టేస్తోందని ఆరోపించారు. ‘‘విపక్షాన్ని శత్రువులుగా చూడకండి. ప్రతి అంశంపైనా దేశ హితం కోసం ప్రజోపయోగకరమైన చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం’’అన్నారు.
విపక్షాల నిరసన
విపక్ష నేతలను వేధించేందుకు వారిపైకి మోదీ సర్కారు దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోందని ఇండియా కూటమి సభ్యులు ఆరోపించారు. ఇందుకు నిరసనగా రాహుల్‌తో పాటు వారంతా పార్లమెంటు మకర ద్వారం వద్ద నిరసనకు దిగారు. ‘విపక్షాల గొంతు నొక్కేందుకు దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడం మానుకోండి’, ‘బీజేపీలో చేరండి, అవినీతికి లైసెన్సు పొందండి’అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తదితరులపై ఈడీని ఉసిగొల్పడం మానుకోవాలంటూ డిమాండ్ చేశారు.
రాహుల్‌ది బాధ్యతారాహిత్యం: బీజేపీ
లోక్‌సభలో రాహుల్ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారంటూ బీజేపీ విమర్శించింది. విపక్ష నేత వంటి బాధ్యతాయుత స్థానంలో ఉంటూ నీట్, హిందూ సమాజం, అగి్నవీర్ పథకం... ఇలా అన్ని అంశాలపైనా హుందాతనం లేని వ్యాఖ్యలు చేశారని కేంద్ర మంత్ర అశ్వినీ వైష్ణవ్ ఆరోపించారు. రాహుల్ ఇప్పటిదాకా బాధ్యతల్లేని అధికారాన్ని మాత్రమే ఆస్వాదించారంటూ బీజేపీ సభ్యుడు అనురాగ్ ఠాకూర్ దుయ్యబట్టారు. సభకు నిత్యం డుమ్మా కొట్టడాన్ని అలవాటుగా మార్చుకున్నారంటూ ఎద్దేవా చేశారు.
మోదీ నవ్వరెందుకో...!
ప్రధాని మోదీ గురించి రాహుల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘మోదీజీ! మీరెందుకు ఎప్పుడూ సీరియస్‌గా ఉంటారు? విపక్షాలతో ఎప్పుడూ సరదాగా మాట్లాడరు. సభలో మేం ఎదురైనప్పుడు మీలో చిరునవ్వు కూడా కని్పంచదు’’అన్నారు. మోదీ స్పందిస్తూ, ‘‘విపక్ష నేతను సీరియస్‌గా తీసుకోవాలని మన ప్రజాస్వామ్యం, రాజ్యాంగం నాకు నేర్పాయి’’అనడంతో ఎన్డీఏ సభ్యులంతా నవ్వుల్లో మునిగిపోయారు.
మోదీకి తలవంచి అభివాదమా?
రాహుల్ అభ్యంతరం, స్పీకర్ వివరణ
నిండు సభలో ప్రధాని మోదీకి స్పీకర్ ఓం బిర్లా తలవంచి అభివాదం చేయడం సరికాదన్న రాహుల్ వ్యాఖ్యలు వారి మధ్య సంవాదానికి దారి తీశాయి. ‘‘మీరు స్పీకర్‌గా ఎన్నికయ్యాక నేను అభినందించినప్పుడు నిటారుగా నిలబడి నాతో కరచాలనం చేశారు. కానీ మోదీ కరచాలనం చేసినప్పుడు ఆయనకు వంగి నమస్కరించారు’’అంటూ రాహుల్ ఆక్షేపించారు. దీన్ని అధికార పక్ష సభ్యులంతా తీవ్రంగా తప్పుబట్టారు. రాహుల్ సభాపతి స్థానంపైనే తీవ్ర అభియోగాలు మోపుతున్నారంటూ అమిత్ షా ఆక్షేపించారు. స్పీకర్ స్పందిస్తూ, ‘‘ప్రధాని సభా నాయకుడు. పైగా నా కంటే పెద్దవారు. పెద్దలను గౌరవిస్తా. అవసరమైతే పాదాభివందనం చేస్తా. సమ వయస్కులతో సమాన స్థాయిలో ప్రవర్తిస్తా. అది నా సంస్కృతి’’అని బదులిచ్చారు. అయినా రాహుల్ ఊరుకోలేదు. ‘‘మీ తీరును గౌరవిస్తా. కానీ లోక్‌సభలో స్పీకరే అందరికంటే పెద్దవారు. సభలో అంతా మీకే అభివాదం చేయాలి’’అన్నారు.
‘మైక్ కట్’విమర్శలు...
ధన్‌ఖడ్, బిర్లా సీరియస్
విపక్షాలకు మైక్ కట్ చేస్తున్నామన్న విమర్శలపై రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్, స్పీకర్ ఓం బిర్లా తీవ్రంగా స్పందించారు. గత వారం సభలో రాహుల్ మాట్లాడుతుండగా మైక్ కట్ చేశానన్న విపక్షాల ఆరోపణలను బిర్లా తీవ్రంగా ఖండించారు. ‘‘ఇది స్పీకర్ స్థానం గౌరవానికి సంబంధించిన అంశం. మైకుల నియంత్రణ స్పీకర్ చేతిలో ఉండదు. ఈ విషయం విపక్షాలకూ తెలుసు. అయినా ఉద్దేశపూర్వకంగా సభ బయట తప్పుడు ఆరోపణలు చేశారు’’అంటూ ఆగ్రహం వెలిబుచ్చారు. అనంతరం రాజ్యసభలోనూ ఇదే అంశం చర్చకొచి్చంది. విపక్ష నేత ఖర్గే మాట్లాడుతుండగా అంతరాయం కలగడంతో మైక్ కట్ చేశారని విపక్ష సభ్యుడు ప్రమోద్ తివారీ అన్నారు. దానిపై ధన్‌ఖడ్ సీరియసయ్యారు. ‘‘మీ వ్యాఖ్యలతో సభను కించపరుస్తున్నారు. మిస్టర్ ఖర్గే! మైక్‌లను మెకానికల్‌గా నియంత్రిస్తారు తప్ప అది సభాపతి చేతిలో ఉండదు. అది మీకూ తెలుసు’’అంటూ మండిపడ్డారు.
మోదీపై రాహుల్ మాటల తూటాలు
– మనమంతా మామూలుగా పుట్టి మట్టిలో కలిసే జీవమాత్రులం. మోదీ అలా కాదు. ఆయన ఆత్మతో పరమాత్మ నేరుగా సంప్రదిస్తాడు. తనను దేవుడే పంపాడని మోదీయే స్వయంగా చెప్పుకున్నారు! దేవునితో తనకు నేరుగా కనెక్షన్ ఉందని ప్రకటించుకున్నారు. పెద్ద నోట్లు రద్దు చేయాలంటూ ఓ నాటి రాత్రి వేళ బహుశా మోదీకి దైవసందేశం అందినట్టుంది. వెంటనే ఆ మేరకు ప్రకటన చేసేశారు!
– అంతా మర్చిపోయిన మహాత్మా గాం«దీని ఓ సినిమా తిరిగి గుర్తు చేసిందని మోదీ సెలవిచ్చారు. దాదాపుగా మృతప్రాయుడైన గాం«దీకి ఒక సినిమా పునర్జీవం పోసిందట! ఇంతటి అవగాహనరాహిత్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి!
– సైనికులను అవసరానికి వాడి, ఆ తర్వాత పారేసే కార్మికులుగా మార్చేసిన అగి్నపథ్ కూడా మోదీ మెదడులో పురుడుపోసుకున్న పథకమే. మేం అధికారంలోకొస్తే దాన్ని తక్షణం రద్దు చేస్తాం.
Comments
Please login to add a commentAdd a comment