2019–24 మధ్య దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాల లీకేజీ
మొదటి రెండు స్థానాల్లో యూపీ, బిహార్
పరీక్షల నిర్వహణలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సూపర్
పకడ్బందీగా నిర్వహణతో ఒక్కసారి కూడా ఏ పేపరూ లీక్ కాలేదు
సాక్షి, అమరావతి : దేశంలో ప్రశ్నపత్రాల లీకులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే నీట్ ప్రశ్నపత్రాల లీకేజీపై దేశవ్యాప్తంగా ఆందోళనలు.. దానిపై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో ఇప్పుడు ప్రశ్నపత్రాల లీకేజీ అంశాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.
కోసం నిర్వహించే పోటీ పరీక్షలు.. వైద్య, ఇంజినీరింగ్ తదితర కోర్సుల్లో చేరేందుకు ప్రవేశపరీక్షలు, వార్షిక పరీక్షల ప్రశ్నపత్రాలు లీకుకావడం అంతకంతకూ పెరుగుతోంది. ప్రధానంగా 2019 నుంచి 2024 వరకు ప్రశ్నపత్రాలు లీకులు అమాంతంగా పెరిగాయి. ఈ ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో ఏకంగా 65 రకాల పరీక్షల ప్రశ్నపత్రాలు లీకుకావడం గమనార్హం.
గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా ప్రశ్నపత్రాల లీకుల వివరాలివీ..
» 2019–24 మధ్య దేశంలో పోటీ పరీక్షలు, ప్రవేశ పరీక్షలు, వార్షిక పరీక్షలకు సంబంధించి 65 ప్రశ్నపత్రాలు లీకయ్యాయి. వాటిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వాటిలో సైన్యంలో నియామకాల కోసం నిర్వహించిన ఆర్మీ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్–2021, ఉపాధ్యాయుల నియామకం కోసం నిర్వహించిన సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటీఈటీ)–2023, నీట్–యూజీ–2021, జాయింట్ ఎంటన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్–2021 ప్రధానమైవి.
» ప్రశ్నపత్రాలు లీకైన వాటిలో 45 పరీక్షలు ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు 45 ఉన్నాయి. మొత్తం మూడు లక్షల ఉద్యోగాల భర్తీకోసం ఆ పరీక్షలు నిర్వహించారు. వాటిలో రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లలో టీచర్ల నియామక పోటీ పరీక్షలు, అసోం, రాజస్థాన్, కర్ణాటక, జమ్మూ–కశ్మీర్‌లలో పోలీసు నియామక పరీక్షలు, ఉత్తరాఖండ్ అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీ పరీక్ష, తెలంగాణ, గుజరాత్, రాజస్థాన్‌లలో జూనియర్
ఇంజినీర్ పోస్టుల భర్తీ పరీక్షలు మొదలైనవి ఉన్నాయి.
» ఇక ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలకు కోసం నిర్వహించిన 17 ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాలూ లీకయ్యాయి.
» మొత్తం మీద గత ఐదేళ్లలో ఇలా 65 రకాల ప్రశ్నపత్రాలు లీక్ కాగా.. వాటిలో 27 పరీక్షలను రద్దుచేయడంగానీ వాయిదా వేయడంగానీ చేశారు.
» అలాగే, గత ఐదేళ్లలో 19 రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాలు లీకయ్యాయి. మొదటి రెండు స్థానాల్లో ఉత్తరప్రదేశ్, బిహార్ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఎనిమిది ప్రశ్నపత్రాలు, బిహార్‌లో ఆరు లీకయ్యాయి. గుజరాత్, మధ్యప్రదేశ్‌లలో నాలుగు చొప్పున.. హరియాణా, కర్ణాటక, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లలో మూడేసి ప్రశ్నాపత్రాలు.. తెలంగాణ, ఢిల్లీ, మణిపుర్‌లలో రెండేసి ప్రశ్నపత్రాలు లీక్ కాగా.. జమ్మూ–కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్‌లలో ఒక్కో ప్రశ్నపత్రం లీకైంది.
శభాష్ ఏపీవైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ఘనత ఇదీ..
2019–24 మధ్య కాలంలో పోటీ పరీక్షల నిర్వహణ దేశవ్యాప్తంగా విఫలమైనప్పటికీ ఏపీకు మాత్రం ఆ మరక అంటలేదు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల కోసం నిర్వహించిన పోటీ పరీక్షలు, ఉన్నత విద్యా సంస్థల్లో చేరేందుకు నిర్వహించిన ప్రవేశపరీక్షలను పకడ్బందీగా నిర్వహించింది.
ఏకంగా ఒకేసారి 1.50 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నియామక పరీక్ష, 6,500 మంది పోలీసుల నియామక పరీక్ష, గ్రూప్–1, గ్రూప్–2 తదితర ప్రవేశ పరీక్షలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహించింది.
Comments
Please login to add a commentAdd a comment