విచారణకు అడ్డుపడుతున్నారని న్యాయవాదిపై సీజేఐ ఆగ్రహం
నీట్ విచారణ సందర్భంగా మంగళవారం కోర్టులో ఘటన
న్యూఢిల్లీ: ‘నీట్’లో అవకతవకలపై మంగళవారంనాడు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా అడ్డుపడిన న్యాయవాది మాథ్యూస్ నెడుంపరపై సీజేఐ డీవై చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయ వాది నరేంద్ర హుడా వాదన వినిపిస్తుండగా నెడుంపర అడ్డుపడ్డారు. తాను ‘అమికస్’నని, బెంచ్ అడిగిన ప్రశ్నకు జవాబిస్తానని చెప్పారు.
దానిపై సీజేఐ తాను ఏ ఎమికస్‌ను నియమించలేదన్నారు. దాంతో నెడుంపర ‘‘మీరు నాకు గౌరవం ఇవ్వకుంటే... నేను వెళ్లిపోతా’ అన్నారు. అందుకు సీజేఐ ఆగ్రహంతో ‘మిస్టర్ నెడుంపర... మీరు కోర్టు హాల్లో ఉన్నారు. సెక్యూరిటీని పిలవండి... ఆయనను బయటకు పంపిస్తారు’ అని అన్నారు. దాంతో నెడుంపర తానే వెళ్లిపోతా నన్నారు.
వెంటనే సీజేఐ ‘వెళ్లిపోతానని మీరు చెప్పకూడదు. 24 ఏళ్లుగా జ్యుడీషియరీని చూస్తున్నా. కోర్టులో ప్రొసీడింగ్స్‌ను లాయర్లు డిక్టేట్ చేయరు’ అని పేర్కొన్నారు. నెడుంపర కూడా.. ‘1979 నుంచి నేనూ జ్యుడీషియరీని చూస్తున్నా’ అనడంతో సీజేఐ తీవ్రంగా హెచ్చరించారు. దీంతో బయటకు వెళ్లిన నెడుంపర కాసేపటికే తిరిగొచ్చి ‘సారీ.. నేనెలాంటి తప్పూ చేయలేదు, అనుచితంగా ట్రీట్ చేశారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తున్నా’’ అని చెప్పారు. నెడుంపర కోర్టు విచారణకు అంతరాయం కలిగించిన ఘటనలు గతంలోనూ ఉన్నాయి.
‘నీట్’ రీ టెస్టుకు సుప్రీం నో
⇒ పరీక్ష సమగ్రత దెబ్బతినలేదన్న అత్యున్నత న్యాయస్థానం
⇒ వ్యవస్థాగత లీక్‌కు ఎలాంటి ఆధారాలు లేవు
⇒ పరీక్ష రద్దు చేయడం సాధ్యం కాదని స్పష్టీకరణ
⇒ సహేతుక తీర్పు వెలువరిస్తామన్న సీజేఐ
కోర్టు నిర్ణయాల ద్వారా లేదా మెటీరియల్ ఆన్ రికార్డ్ ఆధారంగా నీట్ రద్దు చేయాలని ఆదేశించడం సమర్థ్ధనీయం కాదని భావిస్తున్నాం. ప్రస్తుత దశలో పరీక్ష సమగ్రతకు వ్యవస్థాగత ఉల్లంఘన ఉందని నిర్ధారణకు రావడానికి ఎలాంటి మెటీరియల్ రికార్డులో లేదు. పరీక్ష మళ్లీ నిర్వహించడం సాధ్యం కాదు. – సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్
సాక్షి, న్యూఢిల్లీ: నీట్–యూజీ 2024 రద్దు చేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. రద్దు చేస్తే లక్షలాది మంది అభ్యర్థులపై ప్రభావం పడుతుందని పేర్కొంది. పేపర్ లీక్ వాస్తవమని, అయితే.. వ్యవస్థాగత పేపర్ లీక్ జరిగిందనడానికి తగిన ఆధారాలు లేనందున పరీక్ష సమగ్రత దెబ్బతిన్నదనడానికి అవకాశాల్లేవని స్పష్టం చేసింది.
రద్దుతో వైద్య కళాశాలల్లో ప్రవేశాల షెడ్యూల్‌కు అంతరాయం, వైద్యవిద్యపై ఊహించలేని ప్రభావం పడుతుందని, భవిష్యత్‌లో అర్హత కలిగిన వైద్య నిపుణుల లభ్యతపైనా ప్రభావం చూపుతుందని వెల్లడించింది. ఇది కొందరు అభ్యర్థులకు ప్రతికూలత అవుతుందని తెలిపింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ఎన్టీఏ తరఫున సీనియర్ న్యాయవాది కౌశిక్, పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు నరేందర్ హుడా, సంజయ్ హెగ్డే, మాథ్యూస్ నెడుంపర, ఇతర న్యాయవాదుల సుదీర్ఘ వాదనలు వినిపించారు.
నీట్–యూజీ, 2024పై దాఖలైన వేర్వేరు పిటిషన్లను సుదీర్ఘంగా విచారించిన సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఆదేశాలు వెలువరించింది. సహేతుకమైన తీర్పు తర్వాత వెలువరిస్తామని తెలిపింది. పేపర్ లీక్ వ్యవస్థాగతంగా జరిగిందని, నిర్వహణ లోపాలు ఉన్నాయని పరీక్ష మళ్లీ నిర్వహించాలన్న వాదనలను కోర్టు తోసిపుచ్చింది.
సీబీఐకి దర్యాప్తు బదిలీ తర్వాత జూలై 10, జూలై 17, జూలై 21 తేదీల్లో ఆరు నివేదికలు దాఖలు చేసిందని, విచారణ కొనసాగుతోందని వెల్లడిస్తు న్నప్పటికీ హజారీబాగ్, పట్నాలోని కేంద్రాల నుంచి సేకరించిన 155 మంది విద్యార్థులు లీక్ లబ్ధిదారులుగా గుర్తించిందని తెలిపింది. సీబీఐ విచారణలో ఎక్కువ మంది కళంకిత అభ్యర్థులు, అవకతవకలకు పాల్పడినట్లు తేలితే సదరు విద్యార్థి కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి చేసినప్పటికీ, ఏ దశలోనైనా చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది.
సదరు విద్యార్థులు ఎలాంటి క్లెయిమ్‌లు చేసుకోవడానికి అర్హులు కారని స్పష్టం చేసింది. అయితే, హజారీబాగ్, పట్నాల్లో లీక్ వాస్తమని పేర్కొంది. సీబీఐ నివేదిక ప్రకారం ఆ ప్రాంతాల్లో లీక్ లబ్ధిదారులైన అభ్యర్థులు 155 మంది మాత్రమే కాబట్టి, కళంకిత, కల్మషం లేని విద్యార్థులను గుర్తించొచ్చని స్పష్టం చేసింది. భౌతిక శాస్త్రానికి సంబంధించి ఓ అస్పష్ట ప్రశ్నకు ఐఐటీ, ఢిల్లీ నిపుణుల బృందం నివేదికను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిపింది.
నిపుణుల సూచన మేరకు సదరు ప్రశ్నకు నాలుగు ఆప్షన్‌ను సమాధానంగా గుర్తించి తదనుగుణంగా ఫలితాలు లెక్కించాలని ఎన్టీఏను ఆదేశించింది. సమయం కోల్పోయిన, ప్రశ్నాపత్రం మార్పు, భాషా సమస్యల కారణంగా 1,563 మందికి పరీక్ష తిరిగి నిర్వహించాలన్న డివిజన్ బెంచ్ నిర్ణయాన్ని సమర్థించింది. సుప్రీంకోర్టులో పిటిషన్లను ఉపసంహరించుకొన్న తర్వాత వ్యక్తిగత ఫిర్యాదుల విషయంలో సంబంధింత హైకోర్టుకు వెళ్లడానికి అభ్యర్థులకు అనుమతించింది.
నీట్ రద్దు చేయాలన్న పిటిషన్లు తోసిపుచ్చుతూ విచారణ ముగించింది. నీట్–యూజీ నిర్వహణ పటిష్టం చేసేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీపై తదుపరి ఆదేశాలుంటాయని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment