పాట్నా: దేశవ్యాప్తంగా ‘నీట్’ ఆందోళనలు కొనసాగుతున్నాయి. పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని విద్యార్థి సంఘాలు ఇప్పటికే సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. నీట్ అవకతవకలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని అవి కోరుతున్నాయి. ఇంకోపక్క.. నీట్ అభ్యర్థులతో ఇవాళ సాయంత్రం రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. ఈలోపు విస్తుపోయే విషయం ఒకటి వెలుగు చూసింది.
పరీక్షకు ముందే నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యిందనే వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న బీహార్ పోలీసులు.. దాదాపుగా ఆ విషయాన్ని నిర్ధారించుకున్నారు!. ఈ కేసులో అరెస్టైన నీట్ అభ్యర్థి అనురాగ్ యాదవ్(22) ఆ విషయాన్ని అంగీకరించినట్లు తేలింది. లీక్ అయిన ప్రశ్నాపత్రం, పరీక్షలో వచ్చిన పత్రం ఒక్కటేనని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. ఇందుకు సంబంధించిన లేఖ(Confession Letter) ఓ జాతీయ మీడియా సంస్థ ద్వారా బయటకు వచ్చింది.
పాట్నా నీట్ పరీక్ష కేంద్రంలో రాసిన విద్యార్థులకు ముందుగానే పశ్నాపత్రం చేరిందనే విషయం బయటకు పొక్కింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటివరకు 13 మందిని అరెస్ట్ చేసిన బీహార్ పోలీసులు.. అమిత్ ఆనంద్ అనే వ్యక్తి ఈ వ్యవహారానికి ప్రధాన సూత్రధారిగా నిర్ధారించారు. ప్రశ్నాపత్రం లీక్‌కు రూ.30-32 లక్షలు తీసుకున్నట్లు అతను ఒప్పుకున్నట్లు సమాచారం. ఇక సికిందర్ ప్రసాద్ యాదవేందు అనే ఇంజినీర్ ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించాడు. అనురాగ్ యాదవ్‌కు యాదవేందు దగ్గరి బంధవు కూడా. పరీక్షకు ముందు యాదవేందు అనురాగ్‌కు ఓ ప్రశ్నాపత్రంతో పాటు సమాధానాలను కూడా ఇచ్చాడట. అయితే పరీక్షలోనూ అవే ప్రశ్నలు వచ్చాయని అనురాగ్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. దీంతో ఈ ఘటనపై బీహార్ పోలీసులను కేంద్ర విద్యాశాఖ వివరణ కోరింది.
అంతకు ముందు ఈ కేసులో యాదవేందు ఇచ్చిన స్టేట్‌మెంట్ కలకలం రేపింది. ఈ మొత్తం వ్యవహారంలో ఓ మంత్రి జోక్యం ఉందని, ఆయనే తనతో(యాదవేందు) మరికొందరికి ప్రభుత్వ బంగ్లాలో సౌకర్యాలు కల్పించారని వాంగ్మూలం ఇచ్చాడు నిందితుడు. దీంతో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరగనుంది? రాజకీయంగా ఎలాంటి దుమారానికి కారణం కానుంది? అనే ఆసక్తి నెలకొంది.
దేశవ్యాప్తంగా నీట్-యూజీ ఎగ్జామ్ మే 5 తేదీన జరగ్గా.. 4,750 సెంటర్‌లలో 24 లక్షల మంది రాశారు. జూన్ 14న ఫలితాలు రావాల్సి ఉండగా.. మూల్యాంకనం త్వరగా ముగియడంతో జూన్ 4వ తేదీనే విడుదల చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment