నీట్-యూజీ 2024 పరీక్ష పేపర్ లీక్ కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ అరెస్టులు మొదలుపెట్టింది. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న మనీశ్ కుమార్, అశుతోష్‌ను బిహార్‌లోని పట్నాలో అదుపులోకి తీసుకొంది.
ఇప్పటికే పేపర్ లీక్‌కు సంబంధించి సీబీఐ క్రిమినల్ కేసు నమోదు చేసింది. దీంతోపాటు బిహార్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలు నమోదుచేసిన అభియోగాలను కూడా తమకు బదలాయించాలని నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే గుజరాత్‌లోని గోద్రా తాలుకా పోలీస్‌స్టేషన్‌లో మాల్‌ప్రాక్టీస్‌పై ఓ ఎఫ్‌ఐఆర్ నమోదైంది. సీబీఐ మొత్తం ఈ వ్యవహారంలో ఆరు కేసులను దర్యాప్తు చేస్తోంది.
సీబీఐ వర్గాల ప్రకారం, మనీశ్ కుమార్ కొందరు విద్యార్థులను తన కారులో ఓ స్కూలుకు తరలించి అక్కడ వారికి పేపర్ అందజేసీ బట్టీ కొట్టించాడు. మరోవైపు ఆశుతోశ్ ఆ విద్యార్థులకు తన ఇంట్లోనే ఆశ్రయం కల్పించాడు. గురువారం సీబీఐ తొలుత నిందితులిద్దరనీ ప్రశ్నించి అనంతరం అరెస్టు చేసింది.
నీట్-యూజీ 2024 పరీక్షను దేశవ్యాప్తంగా మే 5వ తేదీన నిర్వహించింది. దీనికి 24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పేపర్ బిహార్, గుజరాత్ రాష్ట్రాల్లో లీకైనట్లు ఇటీవల కాలంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ మధ్యలోనే జూన్ 4న ఎన్‌టీఏ ఫలితాలు ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. దీంతో కేంద్రం కూడా ఈ వ్యవహారంపై దృష్టి సారించింది. కేంద్ర విద్యాశాఖ ప్రకటన అనంతరం కేసు బాధ్యతలు తీసుకున్న సీబీఐ ఇప్పటివరకూ ఆరు ఎఫ్ఐఆర్‌లు రిజిస్టర్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment