
నీట్ పిటిషన్ల విచారణ.. సీజేఐ బెంచ్ ఆసక్తికర వ్యాఖ్యలు
నీట్ యూజీ పేపర్ లీక్ అయ్యిందన్నది స్పష్టంగా తేలింది
రీఎగ్జామ్ నిర్వహించాలని ఆదేశించడం చివరి ఆప్షన్ మాత్రమే
మధ్యతరగతి కుటుంబాల కలకు.. 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశమిది
నిందితుల్ని గుర్తించలేనినాడు మేమే రీఎగ్జామ్‌కు ఆదేశిస్తాం
లీకైన పేపర్ ఎంతమందికి చేరిందో తేలాల్సి ఉంది
పేపర్ లీక్‌పై సమగ్ర దర్యాప్తు జరగాలి
మూడు ప్రధాన అంశాలపై ఎన్టీఏ వివరణ ఇవ్వాల్సి ఉంది
దర్యాప్తు నివేదిక స్టేటస్ రిపోర్ట్ సీబీఐ మాకు సమర్పించాలి
నీట్ రద్దు.. మళ్లీ నిర్వహించాలన్న పిటిషన్లపై విచారణ జులై 11వ తేదీకి వాయిదా
న్యూఢిల్లీ, సాక్షి: నీట్ యూజీ పరీక్షకు సంబంధించిన పేపర్ లీక్ అయ్యిందనేది స్పష్టమైందని, అయినప్పటికీ తిరిగి పరీక్ష నిర్వహించడం అనేది చివరి ఆప్షన్‌గానే ఉండాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. నీట్ పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలన్న పిటిషన్లపై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
నీట్ పేపర్ లీక్ అయ్యిందనేది స్పష్టమైంది. ఇది ఒప్పుకోవాల్సిన విషయం. కానీ, ఇక్కడ ప్రశ్న ఏంటంటే.. ఆ ప్రశ్నాపత్రం ఎంత మందికి చేరింది?. ఎంత మంది ఆ లీకేజీతో లాభపడ్డారు?. ఇప్పటివరకు ఎంత మందిని గుర్తించారు?. పేపర్ లీక్‌తో ఇంకా లాభపడ్డవాళ్లు ఎవరైనా ఉన్నారా?. ఈ కేసులో ఇంకా తప్పు చేసిన వాళ్లను గుర్తించాల్సి ఉందా?.. పేపర్ లీక్‌తో లాభపడిన విద్యార్థుల్ని ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఎంత మంది ఫలితాల్ని హోల్డ్‌లో పెట్టారు?. వీటన్నింటిపై సమగ్ర దర్యాప్తు జరగాలి. ఆ నివేదిక మాకు సమర్పించాలి అని కేంద్రాన్ని, ఎన్టీఏని కోర్టు ఆదేశించింది. అలాగే పేపర్ లీక్‌లకు సంబంధించిన లోపాలను పసిగట్టేందుకు దేశవ్యాప్తంగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది? అని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు.
ప్రధానంగా మూడు అంశాలపై ఎన్టీఏ నుంచి మాకు స్పష్టత కావాలి
- లీక్ ఎలా జరిగింది.. ఎక్కడకెక్కడ జరిగింది?
- పేపర్ లీక్‌కు, పరీక్షకు మధ్య ఎంత సమయం ఉంది
- పేపర్ లీకేజీ వ్యవహారంలో నిందితులను ట్రేస్ చేసేందుకు ఎన్టీఏ తీసుకున్న చర్యలేంటి?
.. ఇది తమ పిల్లలు డాక్టర్లు, ఇంజినీరింగ్‌లు కావాలన్న మధ్యతరగతి కుటుంబాల కలకు సంబంధించిన వ్యవహారాన్ని మేం విచారణ జరుపుతున్నాం. సుమారు 23లక్షల మందితో జీవితాలతో ముడిపడిన అంశం ఇది. అందుకే నీట్ పరీక్ష పవిత్రతను దెబ్బతీశారని రుజువైనా లేదంటే నేరం చేసిన వారిని గుర్తించలేకపోయినా మేం నీట్ రీ-టెస్ట్‌కు ఆదేశిస్తాం. లీకైన ప్రశ్నపత్రం సోషల్‌మీడియాలో వ్యాప్తి చేశారని తెలిసినా మళ్లీ పరీక్ష నిర్వహించాలని చెబుతాం. కానీ, రీ-టెస్ట్‌కు ఆదేశించే ముందు.. లీకైన పేపర్ ఎంతమందికి చేరిందో తేలాల్సి ఉంది’’ అని ధర్మాసనం తెలిపింది. ఈ తరుణంలో విచారణను గురువారానికి వాయిదా వేస్తూ.. ఆరోజు పిటిషనర్ల వాదనలు వింటామని సుప్రీం ధర్మాసనం చెప్పింది.
వాదనల సందర్భంగా.. ముందుగా కేంద్రం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి కొన్ని వివరాలను సీజేఐ బెంచ్ ఆరా తీసింది..
నీట్ పేపర్ సెట్ చేసిన తర్వాత ప్రింటింగ్ ప్రెస్ కు ఎలా పంపించారు ?: సీజేఐ
ప్రింటింగ్ ప్రెస్ నుంచి పరీక్షా కేంద్రానికి ఎలా పంపారు ?: సీజేఐ
ఏ తేదీలలో ఈ ప్రక్రియ జరిగింది ?: సీజేఐ
దీనికి అడిషనల్ సోలిసిటర్ జనరల్ సమాధానమిస్తూ.. ఒకే సెంటర్ లో పేపర్ లీక్ అయ్యిందన్నరు.
అంటే నీట్ పేపర్ లీక్ అయ్యిందనేది స్పష్టం అయ్యింది: సీజేఐ
ఈ అంశంపై జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది: సీజేఐ
23 లక్షల మంది భవిష్యత్తును పరిరక్షించాల్సిందే: సీజేఐ
పరీక్ష మళ్లీ ఎందుకు నిర్వహించకూడదు?: కేంద్రంతో సీజేఐ
అక్రమార్కులను గుర్తించకపోతే తిరిగి పరీక్ష నిర్వహించడం మినహా మరేదైనా మార్గం ఉందా ?: సీజేఐ
పేపర్ లీక్ పై ఆరు ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి : పిటిషనర్లు
ఒకే సెంటర్ లో పేపర్ లీక్ అయ్యింది : ప్రభుత్వం
పరీక్షకు మూడు గంటల ముందు పేపర్ లీక్ అయ్యింది: ఎన్టీఏ
NEET-UG 2024 exam: Supreme Court observes that one thing is clear that leak (of question paper) has taken place. The question is, how widespread is the reach? The paper leak is an admitted fact. pic.twitter.com/qyfZQESMsx
— ANI (@ANI) July 8, 2024
నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకైందని, అవకతవకలు, అక్రమాలు జరిగాయని, పరీక్షను రద్దు చేయాలని సుప్రీం కోర్టులో గత నెల రోజుల వ్యవధిలో వేర్వేరు రోజుల్లో మొత్తం 38 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిని విచారణకు స్వీకరించిన కోర్టు.. ఆయా సందర్భాల్లో కేంద్రానికి, ఎన్టీఏకు వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. ఆ పిటిషన్లను మొత్తంగా కలిపి ఇవాళ(జులై 8వ) విచారణ చేపట్టింది కోర్టు.
సుప్రీం విచారణతోనే..
ఈ ఏడాది మే 5వ తేదీన దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2024 పరీక్ష నిర్వహించారు. అయితే పరీక్ష పేపర్ లీక్ అవడంతో పాటు పరీక్ష నిర్వహణలో అవకతవకలు చోటుచేసుకున్నట్లు వార్తలు రావడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఫలితాల్లో ఏకంగా 67 మందికి జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు రావడంపైనా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే సుప్రీం ఆదేశాల మేరకు ఇటీవల గ్రేస్ మార్కులు కలిపిన 1,563 మందికి మళ్లీ పరీక్ష నిర్వహించి సవరించిన నీట్ ర్యాంకుల జాబితాను ఎన్‌టీఏ విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం.. జులై6వ తేదీన కౌన్సెలింగ్ జరగాల్సి ఉంది. అయితే కౌన్సెలింగ్‌ను కోర్టు వాయిదా వేయకపోయినప్పటికీ.. నీట్ ఆందోళనల పరిణామాల నేపథ్యంలో ఎన్టీఏనే వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment