
ఎగుమతిదారులకు మార్చితో ముగిసిన క్రితం ఆర్థిక సంవత్సరంలో (2021–22) రూ.1.75 లక్షల కోట్ల డ్యూటీ డ్రాబ్యాక్, జీఎస్‌టీ రిఫండ్స్ జరిపినట్లు పరోక్ష పన్నులు, కస్టమ్స్ సెంట్రల్ బోర్డ్ (సీబీఐసీ) చైర్మన్ వివేక్ జోహ్రీ ‘సివిల్ సర్వీసెస్ డే’ కార్యక్రమంలో తెలిపారు. ఈ–కామర్స్ ద్వారా రత్నాలు, ఆభరణాల ఎగుమతులను సులభతరం చేయడానికి తమ శాఖ ఒక పథకంపై కసరత్తు చేస్తోందని ఆయన వెల్లడించారు.
రిఫండ్స్ త్వరిత గతిన జరగడానికి, ఎగుమతిదారులకు వర్కింగ్ క్యాపిటల్ సౌలభ్యతకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. 2021–22లో డ్యూటీ డ్రాబ్యాక్ పంపిణీ రూ.24,000 కోట్లుకాగా, జీఎస్‌టీ రిఫండ్స్ విలువ రూ.1.51 లక్షల కోట్లని వివరించారు. 2020–21తో పోత్చితే ఇది 33 శాతం అధికమని వివరించారు. రెవెన్యూ పురోగతికి తమ శాఖ తగిన చర్యలు అన్నింటినీ తీసుకుంటున్నట్లు తెలిపారు. డిజిటలైజేషన్ ప్రణాళికలను ఆయన ప్రస్తావిస్తూ, ‘‘ప్రత్యేక ఆర్థిక జోన్ల (ఎస్‌ఈజెడ్) యూనిట్‌లకు వర్తించే కస్టమ్స్ ప్రాసెస్ మొత్తం డిజిటలైజేషన్ చేసే విషయంపై కసరత్తు చేస్తున్నాము. ఇ–కామర్స్ ద్వారా రత్నాలు– ఆభరణాల ఎగుమతుల కోసం పథకాలను రూపొందించడంపై దృష్టి సారిస్తున్నాము. దేశీయంగా ఇప్పటికే ఈ విధానం అమలవుతోంది.
ఈ–కామర్స్ ద్వారా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూర్చాలన్నది మా ప్రధాన ఉద్దేశం’’ అని అన్నారు. ఎగుమతులు–దిగుమతులు, ఇందుకు సంబంధించి చెల్లింపుల పరిష్కార ప్రక్రియలో ఈ–కామర్స్‌కు పెద్దపీట వేయడంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఈ దిశలో ఆయా అంశాలను సరళీకరించి, హేతుబద్దీకరించడంపై కీలక చర్య తీసుకుంది. ఇందుకు వీలుగా ప్రస్తుత నిబంధనలను సవరించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఒక ముసాయిదా మార్గదర్శకాల పత్రాన్ని సెంట్రల్ బ్యాంక్ ప్రతిపాదించింది.
‘‘ఎగుమతి, దిగుమతులకు సంబంధించి చిన్న స్థాయి చెల్లింపుల పక్రియను ఈ కామర్స్ ద్వారా సులభతరం చేయడానికి తీసుకువస్తున్న ఆన్‌లైన్ ఎక్స్‌పోర్ట్–ఇంపోర్ట్ ఫెసిలిటేటర్స్’ అనే శీర్షికన మార్గదర్శకాలు జారీ అయ్యాయి. బ్యాంకులు, ఇతర సంబంధిత వర్గాల నుంచి స్వీకరించిన అభిప్రాయాల ప్రాతిపదిక, సమగ్ర సమీక్ష అనంతరం తగిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది’’ అని ఇటీవల ఆర్‌బీఐ ప్రకటన సూచించింది.
చదవండి: సిమెంటుకు పెరగనున్న డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment