సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ప్రకంపనలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం, దేశ సరిహద్దు వద్ద చైనా దుశ్చర్యతో 20 మంది సైనికుల మరణం తరువాత దేశీయంగా చైనాపై ఆగ్రహం మరింత రాజుకుంది. చైనా వస్తువులు, దిగుమతులను నిషేధించి, దాని ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టాలన్న డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది. అయితే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ ఇందుకు భిన్నంగా స్పందించింది. చైనా వస్తువులను బహిష్కరించడం సాధ్యం కాకపోవచ్చని వ్యాఖ్యానించింది. చైనా దిగుమతులపై భారత్ ఎక్కువగా ఆధారపడి ఉన్నందున బహిష్కరణ డిమాండ్ నెరవేరకపోవచ్చని గురువారం అభిప్రాయపడింది. అయితే చైనా ఉత్పత్తులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ప్రయత్నించాలని తెలిపింది. (గణేష్ విగ్రహాలు కూడా చైనా నుంచేనా ?)
దేశ సరిహద్దు వద్ద చైనాతో ఏర్పడిన వివాదం నేపథ్యంలో భారతదేశ స్వావలంబన అంశంపై ప్రభుత్వానికి మద్దతునిస్తున్నాం, కానీ మనం చాలా కీలకమైన ముడి పదార్థాల కోసం చైనాపై ఆధారపడుతున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ అధ్యక్షుడు శరద్ కుమార్ సారాఫ్ అన్నారు. భారతీయ వస్తువులకు ప్రాధాన్యత ఇవ్వాలని, చైనా వస్తువులను కొనడం మానేయాలని ప్రభుత్వం భారతీయులను కోరాలి. కానీ చైనా ఉత్పత్తులను నిషేధించడం లేదా బహిష్కరించాలన్న డిమాండ్ అన్ని భారతీయ తయారీదారులను కష్టాల్లోకి నెడుతుందన్నారు. మనం ఎగుమతి చేసే వస్తువులను తయారు చేయడానికి చాలా ముడి పదార్థాలను దిగుమతి చేసుకుంటామని సంస్థ డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ అన్నారు. (బాయ్ కాట్ చైనా : సీఏఐటీ మరో అడుగు)
కాగా చైనా ఉత్పత్తులను బహిష్కరించాలనే ప్రచారంలో ముందంజలో ఉన్న ట్రేడ్ బాడీ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) 'చైనాను బహిష్కరించండి' అంటూ దేశీయ టాప్ పారిశ్రామికవేత్తలకు ఒక లేఖ రాసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment