సాక్షి, అమరావతి: వాహనంతో రోడ్డెక్కితే చాలు ‘టోలు’ ఒలిచేస్తున్నారు. దేశంలో టోల్ చార్జీల రాబడి రికార్డుస్థాయిలో పెరిగింది. దేశంలో 2023–24లో రూ.64,809 కోట్లు టోల్ చార్జీల రూపంలో వసూలు చేయడం విశేషం. ఇది 2022–23 కంటే 39శాతం అధికం. కేంద్ర ప్రభుత్వం ‘బిల్డ్–ఆపరేట్–ట్రాన్స్‌ఫర్’(బీవోటీ) విధానంలో జాతీయ రహదారులను నిర్మిస్తుండటంతో కొత్త రహదారులు టోల్ చార్జీల పరిధిలోకి వస్తున్నాయి. దేశంలో 2022 డిసెంబర్ నాటికి 35,996 కి.మీ.మేర టోల్ చార్జీలు వసూలు చేసే జాతీయ రహదారులు ఉండేవి. కాగా, 2023 డిసెంబర్ నాటికి జాతీయ రహదారులు 45,428 కి.మీ.కు పెరిగాయి. దాంతోపాటు వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో టోల్ చార్జీల రూపంలో జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ)కు ఆదాయం అమాంతంగా పెరుగుతోంది.
8 కోట్లకుపైగా ఫాస్టాగ్‌లు
వాహనదారుల నుంచి టోల్ చార్జీల వసూలు చేసేందుకు 2023, డిసెంబర్ నాటికి 8కోట్లకు పైగా ఫాస్టాగ్‌లను జారీచేశారు. దీంతో ప్రస్తుతం దేశంలో రోజుకు సగటున రూ.147.31కోట్లు టోల్ చార్జీల రూపంలో వసూలు చేస్తున్నారు. ఇక త్వరలోనే శాటిలైట్ ఆధారిత టోల్ ఫీజు విధానాన్ని ఎన్‌హెచ్‌ఏఐ ప్రవేశపెట్టనుంది. టోల్ చార్జీలను కూడా దశలవారీగా పెంచనుంది.
వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి టోల్ చార్జీలు పెంచాలని ఎన్‌హెచ్‌ఏఐ ముందుగా నిర్ణయించింది. కానీ, సాధారణ ఎన్నికల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఆ నిర్ణయం అమలును రెండు నెలలు వాయిదా వేసింది. ఈ నెల 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ముగిసిన తర్వాత 5శాతం టోల్ చార్జీలను పెంచింది. శాటిలైట్ ఆధారిత టోల్ ఫీజు అమల్లోకి వచ్చినప్పుడు మళ్లీ పెంచే అవకాశం ఉంది. దీంతో వాహనదారులపై టోల్ చార్జీల భారం మరింత పెరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment