రూ.1,006 కోట్లు తాగేశారు | third place in the sales of alcohol from karimnagar | Sakshi
Sakshi News home page

రూ.1,006 కోట్లు తాగేశారు

Published Sat, Jun 21 2014 4:05 AM | Last Updated on Fri, Aug 17 2018 7:44 PM

రూ.1,006 కోట్లు   తాగేశారు - Sakshi

రూ.1,006 కోట్లు తాగేశారు

మద్యం అమ్మకాల్లోజిల్లా మూడో స్థానం
జూన్‌లో మరో రూ.100 కోట్లు?
జూలై నుంచి నూతన దుకాణాలు


మద్యాన్ని మంచినీళ్లలా తాగేస్తున్నారు. నాలుగేళ్లుగా అమ్మకాలు ఏటా రూ.వందకోట్లు పెరుగుతున్నాయి. రికార్డుస్థాయి అమ్మకాలతో ఈ ఏడాది మన జిల్లా రాష్ట్రంలోనే మూడోస్థానంలో నిలిచింది. ఒక్క ఏడాదిలో రూ.1,006 కోట్ల మద్యం తాగేశారు. ఎన్నికల కమిషన్ ఆంక్షలు లేకుంటే అమ్మకాలు ఇంకా భారీగానే ఉండేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
కరీంనగర్ క్రైం :జిల్లాలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్రం లో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల తర్వాత మూడో స్థానంలో కరీంనగర్ జిల్లా నిలిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రంగారెడ్డి, హైదరాబాద్, విశాఖపట్నం తర్వాత స్థానం మన జిల్లా దే. గత నాలుగేళ్లుగా ఏటా సుమారు రూ.వంద కోట్ల మేర అమ్మకాలు పెరుగుతున్నాయి. జిల్లాలో 2010-11లో  రూ.708.89 కోట్లు, 2011-12లో రూ.769.51 కోట్లు, 2012-13లో ఏకంగా రూ.1,087 కోట్ల అమ్మకాలు చేసి రికార్డు నెలకొల్పగా 2013-14లో మే వరకు రూ.1006 కోట్ల మద్యం అమ్మకాలు అయ్యా యి. జూన్ నెలలో కనీసం రూ.100 కోట్లకుపైగా అమ్మకాలు జరుగుతాయని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఎన్నికల సీజన్ రాగా.. అందినకాడికి సొమ్ము చేసుకుందామనుకున్న వ్యాపారులకు ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. గతేడాది సదరు నెలలో ఎంత మద్యం అమ్మకాలు చేశారో... ఈ ఏడాది ఆ నెలలో అంతే మద్యం కేటాయించింది. దీంతో మార్చి, ఏప్రిల్‌లో అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి. కొన్ని దుకాణాల్లో మద్యం స్టాక్ లేక దుకాణాలు మూసుకున్నారు. లేకుంటే అమ్మకాలు ఇంకా భారీగానే నమోదయ్యేవి. ఈనెల 30తో మద్యం దుకాణాల లెసైన్స్ కాలం పూర్తవుతుండగా జూలై 1 నుంచి నూతన టెండర్లు రానున్నాయి.

ఈ ఏడాదీ అదే పాలసీ

టెండర్ విధానానికి స్వస్తి చెబుతూ జనాభా ప్రకారం ధర నిర్ణయిస్తూ ప్రభుత్వం రెండేళ్ల క్రితం నూతన మద్యం పాలసీని అమల్లోకి తెచ్చింది. గతేడాది 315 దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానించింది. దరఖాస్తులు ఎక్కువ వచ్చిన చోట లక్కీడ్రా తీసి కేటాయించారు. 1112 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుకు రూ.25 వేలు చలానాగా నిర్ణయించారు. వీటిని తిరిగి చెల్లించరు. దరఖాస్తుల ద్వారానే ప్రభుత్వానికి రూ.278 కోట్ల ఆదాయం సమకూరింది. మొదట 109 దుకాణాలకు దరఖాస్తులు రాలేదు. 10 సార్లు టెండర్లు పిలవగా చివరకు 48 దుకాణాలు మిగిలిపోయాయి. వీటిని ఎక్సైజ్‌శాఖ నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసినా... ఆచరణలోకి రాలేదు. నగర శివారులోని మద్యం డిపో వద్ద ఒక్క దుకాణాన్ని ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. దుకాణాలకు కోటా ప్రకారం మద్యం కేటాయించారు. కోటాకు మించి మద్యం తీసుకోవాలనుకుంటే ప్రివిలేజ్ ఫీజు చెల్లించాలి. అదనపు మద్యం అమ్మకాలపై ప్రివిలేజ్ ఫీజుగా 14 శాతం ట్యాక్స్ అదనంగా చెల్లించాలి. దీంతో తమకు ఏమీ మిగలదని వ్యాపారులు అధిక మద్యం తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు. ఈసారి సైతం పాత మద్యం విధానాన్నే ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రివిలేజ్ ఫీజును 13.6 శాతానికి తగ్గించింది. దీంతో కొత్త పాలసీ వస్తుందని ఎదురుచూసిన వ్యాపారులకు నిరాశే మిగిలింది.

బెల్టుషాపుల జోరు

 బెల్టుషాపులు లేకుండా చూస్తామని ప్రభుత్వం ప్రకటించినా... ఎక్కడా అడ్డుకట్ట పడలేదు. జిల్లాలో 1207 గ్రామాలుండగా 4 వేలకుపైగా బెల్టుషాప్‌లు నడిచాయని సమాచారం. మద్యం దుకాణాలు ఉదయం 10.30 నుంచి రాత్రి 10 వరకూ మద్యం అమ్మకాలు చేస్తుండగా బెల్టుదుకాణాలు 24 గంటలపాటు మద్యాన్ని అందుబాటులో ఉంచుతున్నాయి. వీటి ద్వారానే 60 శాతం అమ్మకాలు సాగుతున్నాయని సమాచారం. మద్యం అమ్మకాలు పెరగడంతో నకిలీ మద్యం తయారీ జోరందుకుంది. సిరిసిల్ల డివిజన్‌లోని ముస్తాబాద్‌లో, మంథని డివిజన్‌లో నకిలీ మద్యం పట్టుబడింది. చాలాచోట్ల నకిలీ మద్యం డంపులు, ముఠాలు పట్టుబడ్డాయి. ఇతర రాష్ట్రాలనుంచి కూడా మద్యాన్ని భారీ ఎత్తున జిల్లాకు తరలించారు. దీనివల్ల ప్రభుత్వం రూ.100 కోట్ల మేర ఆదాయం కోల్పోయిందని సమాచారం.

వ్యాపారులు ముందుకు వచ్చేనా?

 2013-14లో 315 దుకాణాలకు గాను 48 దుకాణాలు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రభుత్వం రూ.200 కోట్ల ఆదాయం కోల్పోయిందని సమాచారం. అసలే దరఖాస్తులు రాని 11 మద్యం దుకాణాలను ఈ సారి ఇతర ప్రాంతాలకు తరలించారు. దీంతో ప్రస్తుతం జిల్లాలో 304 దుకాణాలు మిగిలాయి. పూర్తిస్థాయిలో అమ్మకాలు చేస్తే రూ.1,300 కోట్ల మార్క్ దాటుతుందని ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు. గత సీజన్‌లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులు... ఇప్పుడు ఎన్నికలు లేనందున ఎంతమంది ముందుకు వస్తారనేది వేచి చూడాల్సి ఉంది. ఇప్పుడున్న మద్యం పాలసీతో లాభాలు పెద్దగా రావడం లేదని... నూతన పాలసీ ప్రకటిస్తే బాగుండేదని వ్యాపారులు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement