సాక్షి, కరీంనగర్/జగిత్యాల జోన్, న్యూస్‌లైన్ : మండుతున్న ఎండలతో జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. వారం రోజులుగా 41 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు కదలాడుతున్నాయి. ఉదయం 10 గంటలు దాటిందంటే వడగాల్పులు దడదడలాడిస్తున్నాయి. ఎండలో బయటకెళ్తే అటో ఇటో అన్నట్టుంది.
సగటున రోజుకొక్కరు భానుడి ప్రతాపానికి బలవుతున్నారు. మార్చి 31 నుంచి ఈ నెల 2వరకు జిల్లావ్యాప్తంగా 28 మంది వడదెబ్బతో మరణించారు. మధ్యాహ్నం నెత్తిన కుంపటి మాదిరిగా ఎండవేడిమి మంట పుట్టిస్తోంది. ఆ సమయంలో బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళ్లల్లో పనులు పూర్తి చేసుకుని ఇంటిపట్టునే ఉంటున్నారు. పట్టణ ప్రజలు ఫ్యాన్లు, కూలర్ల కింద సేదదీరుతున్నారు. శీతలపానీయాలు సేవిస్తూ ఎండవేడిమి నుంచి ఉపశమనం తరువాయి పొందుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లోని రైతు కూలీల పరిస్థితే దయనీయంగా మారింది. పొట్టనింపుకునేందుకు ఎర్రటెండలోనూ పనులు చేయాల్సి వస్తోంది. దీంతో వడదెబ్బకు గురై ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతోంది. ఇప్పటివరకు వడదెబ్బతో మృతి చెందిన వారిలో రైతు, కూలీలు, వృద్ధులే అధికంగా ఉండటంగమనార్హం.
ముందుంది
మరింత మంట..
ఏటా మార్చి మొదటి వారం నుంచి ఎండలు ప్రారంభమై ఏప్రిల్‌లో ముదురుతాయి. మేలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. మూడేళ్ల నుంచి జూన్‌లోనూ ఎండ ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం జిల్లా ప్రజలు భరించలేని ఎండవేడిమితో అల్లాడుతున్నారు. ఈ నెలాఖరు నుంచి జూన్ దాకా ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఉష్ణోగ్రత 42 డిగ్రీలకు చేరాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే వారం రోజుల్లో 45 డిగ్రీలకు, వేసవి ముగిసేలోపు 47 డిగ్రీలకు చేరుకునే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెద్దపల్లి, మంథని డివిజన్ మండలాల్లో ఎండ ప్రభావం ఎక్కువగా ఉంది. ఓపెన్‌కాస్టు బొగ్గు గనులైతే అగ్నిగుండాన్ని తలపిస్తున్నాయి. నైరుతీ రుతుపవనాలు జిల్లాకు చేరే వరకు ఉష్ణోగ్రతలు ఇలాగే ఉంటాయని జగిత్యాల పొలాస పరిశోధన స్థానం డెరైక్టర్ డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. అంటే మరో నెలరోజులపాటు ఈ ఎండవేడిమి తప్పదన్నమాటే.
జాగ్రత్తలు తీసుకోవాలి
శరీరానికి ఎండ దెబ్బ తగలకుండా నీరు ఎక్కువగా తీసుకోవాలి. మజ్జిగ, కొబ్బరి నీరు తాగాలి. అత్యవసరమైతే తప్ప ఎండలో బయటకు వెళ్లకూడదు. బయటకు వెళ్లేప్పుడు ముఖానికి కర్చీఫ్, చేతులకు గ్లవ్స్ ధరించాలి. సన్‌స్క్రీన్ లోషన్స్ తప్పకుండా రాసుకోవాలి. వడదెబ్బకు గురైతే వెంటనే వైద్యుడి వద్దకు వెళ్లి చికిత్స చేయించుకోవాలి.
పిట్టల్లా.. రాలుతున్నారు
Published Sat, May 3 2014 2:29 AM | Last Updated on Sat, Sep 2 2017 6:50 AM
Advertisement
Advertisement