=22,282 బెల్లం దిమ్మల క్రయవిక్రయాలు
=ఈ సీజన్‌లోనే అత్యధికం
అనకాపల్లి, న్యూస్‌లైన్: అనకాపల్లి బెల్లం మార్కెట్‌కు శనివారం రికార్డు స్థాయిలో లావాదేవీలు జరిగాయి. ఈ సీజన్‌లోనే అత్యధిక బెల్లం దిమ్మల క్రయవిక్రయాలు నమోదయ్యాయి. మార్కెట్‌కు 22,282 దిమ్మలు రాగా, మొదటి రకం క్వింటాకు గరిష్టంగా రూ. 2800లు, మూడో రకం కనిష్టంగా రూ.2350 ధర పలికింది. ధరల విషయంలో ఒడిదుడుకులు కొనసాగుతుండగా, లావాదేవీలు క్రమేపీ పెరుగుతున్నాయి.
సమైక్యాంధ్రకు మద్దతుగా ఆగస్టు, సెప్టెంబర్‌లలో జరిగిన బంద్‌లు, అక్టోబర్ నెలాఖరులో కురిసిన భారీ వర్షాల వల్ల లావాదేవీలు అప్పుడప్పుడు నిలిచిపోయాయి. సీజన్ తారాస్థాయికి చేరుకునే నెలగా డిసెంబర్‌కు గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో మార్కెట్‌కు వచ్చిన 22 వేలకు పైగా బెల్లం దిమ్మల క్రయవిక్రయాలతో యార్డులన్నీ కళకళలాడాయి. ధరలు మాత్రం ఎప్పటిలాగే రైతులకు నిరాశ పరిచాయి.
గత నెల 29న ఈ సీజన్‌లోనే అత్యల్పంగా రూ. 2,750ల ధర పలికింది. ఈ నెల నాలుగున మొదటి రకం క్వింటాల్‌కు రూ.మూడు వేలకు చేరుకున్నప్పటికీ మళ్లీ శని వారం రూ.2800లకు పడిపోయింది. ధరల వ్యవహారాల ను పక్కన పెడితే భారీ వర్షాలతో ముంపుకు గురైన చెరకు తోటల కు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన చెందుతున్న తరుణంలో లావాదేవీలు ఊపందుకోవడం ఊరటనిస్తోంది.
రికార్డు స్థాయిలో లావాదేవీలు
Published Sun, Dec 8 2013 2:20 AM | Last Updated on Sat, Sep 2 2017 1:22 AM
Advertisement
Advertisement