
అన్నదాతకు అండగా ఉంటాం
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్.. రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరిగే వ్యాపారకేంద్రం. ఏటా రూ.300కోట్లకు పైగా ధాన్యం విక్రయాలు జరిగి.. ప్రభుత్వానికి ఏటా రూ.30 కోట్ల ఆదాయం సమకూరుతోంది. ఇంతటి వ్యాపార సముదాయంలో కనీస సౌకర్యాలైన టాయిలెట్లు లేవు. రైతులు భోజనం చేసేందుకు నీడలేదు. ధాన్యాన్ని చూసుకునేందుకు వాచ్‌మెన్ లేడు. రైతుబంధు పథకం ఉందనే విషయం చాలామంది రైతులకు తెలియదు. కమీషన్ కూడా ఎక్కువగానే లాగుతున్నారు. బుక్కచిట్టీలు వేసి రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. ఎన్నో సమస్యలు ఉన్న బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డును స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చర్లకోల లక్ష్మారెడ్డి ‘సాక్షి’ తరఫున రిపోర్టర్‌గా మారి సమస్యలను తెలుసుకున్నారు. అన్నదాతకు అండగా ఉండి వారి కష్టాలు తీరుస్తానని భరోసా ఇచ్చారు. ఆయన సంభాషణ ఇలా సాగింది..
లకా్ష్మరెడ్డి: ఏం పెద్ద మనిషి.. ఏ ఊరు?
మైసయ్య: వేముల నుంచి వచ్చిన..సారూ!
లకా్ష్మరెడ్డి: మక్కలు ఎన్ని ఎకరాలు వస్తే..
ఎన్ని సంచులైనయ్
మైసయ్య: ఆరెకరాలు వేస్తే.. 23 పిండి సంచులు అయినవి. ఏం చేద్దాం సారూ..! పెట్టుబడి మీద పడ్డది. ఆరెకరాలకు రూ.40వేల పైనే అయ్యింది. ఇవి అమ్మితే పెట్టుబడి కూడా రాదు.
లకా్ష్మరెడ్డి: మీరేం తీసుకొచ్చారన్నా?
కృష్ణయ్య: వడ్లు తెల్చిన..
లకా్ష్మరెడ్డి: ఎన్ని ఎకరాలు వేస్తే... ఎన్ని సంచులైనవి?
కృష్ణయ్య: రెండెకరాలు వేస్తే... 35 సంచులు అయినవి. ఈ సారి ఏం పాయిదా లేదు. ఒక్క ఎకరంలో కావాల్సిన వడ్లు, రెండు ఎకరాల్లో కూడా పండలేదు.
లకా్ష్మరెడ్డి: ఎందుకట్లా?
కృష్ణయ్య: ఎందుకేంటి? వానలు పడ్డయా? లేదయే..!
గవర్నమెంటోళ్లు కరెంట్ ఇయ్యకపోయిరి. చేను ఎండిపాయే.. కావాలికాసి నీళ్లు పారపెట్టంగా.. ఈ ఇంత పండింది.
లకా్ష్మరెడ్డి: ఏం సాయిరెడ్డి బాగున్నావా? ఏం తెచ్చినవ్?
సాయిరెడ్డి: వడ్లు తెచ్చిన అన్నా..
లకా్ష్మరెడ్డి: మార్కెట్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా?
సాయిరెడ్డి: చాన ఇబ్బందులు ఉన్నాయి. ఇంతపెద్ద మార్కెట్ల మరుగుదొడ్లు లేవు. క్యాంటీన్ లేదు. రైతులకు విశ్రాంతి గది లేదు. ధాన్యం విషయానికొస్తే.. మక్కలు తీసుకోకుండా రిటన్ పంపిస్తుండ్రు. మార్కెట్‌కు తీసుకొచ్చిన ధాన్యాన్ని కచ్చితంగా తీసుకోవాలని మీరు ఎన్నిసార్లు చెప్పినా అధికారులు వింటలేరు. కాస్త మీరు గట్టిగ చెప్పాలె.
లకా్ష్మరెడ్డి: బాగాలేదని కొంటలేరా ఏంది?
సాయిరెడ్డి: బాగలేని వాటిని కూడా సెకండ్‌గ్రేడ్ కింద కొనాలి కదా? ఫస్టు గ్రేడ్ ధాన్యాన్ని తీసుకుంటున్నరు. మిగతావి వదిలేస్తుండ్రు. ఈసారి సరిగా వానలు పడక పంటలే. అంతంతగా పండినయి. దాన్ని కూడా కొనకుండా రిటన్ పంపితే ఎట్ల ఎల్తది మాకు.
లకా్ష్మరెడ్డి: సరే సాయిరెడ్డి ఈ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తా. మీరు చెప్పండి పెద్దాయనా?
శేఖర్: ఏం చెప్పమంటవు సారూ..! పంటలు అంతంతనే. ఇప్పుడు మళ్లీ యాసింగి పంట ఏ తమంటే యూరియా దొరుకుతలేదు. మూడు దినాల సంది తిరుగుతున్నా...దొరకక ఉట్టిగనే పోతున్నా. సేట్ల దగ్గరికి పోయినా లేదంటున్నరు.
లకా్ష్మరెడ్డి: యూరియా ఇప్పుడు దొరక్కపోవడమేంటి? సరే ఈ విషయాన్ని అడిగి సమస్యను పరిష్కరిస్తా. పెద్దమనిషి మీరు చెప్పండి.. ఎక్కడి నుంచి వచ్చినవు? ఏం తెచ్చిండ్రు?
శేఖర్‌రెడ్డి: గొరిట నుంచి వచ్చిన. మక్కలు తెచ్చిన
లకా్ష్మరెడ్డి: మాల్ ఫస్టు క్లాస్ ఉంది. ఎన్ని ఎకరాలు వేసినవ్. ఎన్ని సంచులు అయినవి?
శేఖర్‌రెడ్డి: ఐదెకరాలు వేసిన. మాల్ మంచిగా ఉందంటే.. ఇంటొళ్లం కష్టపడి, దగ్గరుండి చూసుకుంటే మంచిగా వచ్చింది.
లకా్ష్మరెడ్డి: కొనుగోలు చేయలేదా? ఎట్లా?
మహ్మద్ యూసఫ్: ఏం లేదు.. కొన్నరు. సారొళ్లను అడిగితే.. దినాం లారీలు రాలేదంటరు. రోజూ ఇట్లే గడిచిపోతుంది.
లకా్ష్మరెడ్డి: సరే ఈ విషయాన్ని అధికారులను అడుగుతా? అమ్మా మీరు చెప్పండి ఏం ఇబ్బందులు ఉన్నయి?
లక్ష్మమ్మ: ఈ మార్కెట్ల ఆడోళ్లకు చాన ఇబ్బంది ఉంది. బాత్‌రూంలు లేవు. తెచ్చిన గింజలు అమ్ముడుపోకపోతే.. రాత్రిల్ల ఇక్కడే ఉండాలె. ఈ మార్కెట్ల వాచ్‌మెన్ కూడా లేడు. ఎట్ల ఉండేది. ఎమ్మెల్యే సారూ.. నాకు తోచింది చెప్పిన ఏమీ అనుకోవు కదా?
లకా్ష్మరెడ్డి: చూడమ్మా.. నేను ఇప్పుడు ‘సాక్షి’ రిపోర్టర్‌గా వచ్చిన. మీ సమస్యలు తెలుసుకోవడానికి ఇక్కడి వచ్చిన. నీవు చెప్పినదాంట్లో ఏం తప్పులేదు. నీవు అడిగిన వాటన్నింటికీ కూడా త్వరలో అయితవి. మొన్ననే శంకుస్థాపన చేసినం. త్వరలో పూర్తవుతయి. పెద్దమనిషి.. ఈ మార్కెట్ల రైతు బంధు పథకాన్ని ఉపయోగించుకుంటుండ్రా?
తిరుమల్‌రెడ్డి: ఇది వరకు దాంక తెల్వదు. మొన్న మీటింగ్‌లో మీరు చెప్తే విన్నం. గింజలను పెట్టుకొని 75శాతం పైసలు మిత్తి లేకుండా ఇస్తమన్నరు. అట్ల చేస్తే బాగుంటది. ఇంకా ఇక్కడ ఏమైతుందంటే.. మక్కలను మార్క్‌ఫెడ్ వాళ్లు కొంటున్నరు. అయితే మమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టకుండా చూడమనండి. ఈడ సెలక్టు కావాలి. ఆడ సెలక్టు కావాలని మమ్మలను ముప్పు తిప్పలు పెడుతున్నరు. పైసలు కూడా నెల దినాలకు ఇస్తున్నరు. జర తొందర ఇప్పించెటట్లు చేయండి.
లకా్ష్మరెడ్డి: ఏమ్మా... ఏమైంది?
దేవమ్మ: ఏం సారూ.. ఇక్కడ మమ్మల్ని ఎవరూ పట్టించుకోరు. మారేపల్లి నుంచి నిన్న వడ్లు తీసుకొచ్చిన. ఫస్టు తీసుకుంటమని బేరం చేసిండ్రు. మళ్లీ వచ్చి మేం తీసుకోమని చెప్పి ఉత్తది చేసి పోయిండ్రు. ఎవరు చేసిండ్రు, ఎందుకు వద్దన్నరు?
దేవమ్మా: ఇంకెవరు.. గవర్నమెంటోళ్లు. వడ్లు తాలున్నయని వద్దన్నరు. అంటే సోన చేనుకు తెగులు వచ్చి అంతా తాలుపోయింది. మరి తాలు అంటే మా చేతుల పనాసారూ? ఇట్ల వడ్లు తీసుకోకపోతే, రాత్రిళ్ల ఇక్కడ ఉండనింకె సచ్చిపోతున్నం. రైతులకు ఇంత ఇబ్బందా?
లకా్ష్మరెడ్డి: సరేనమ్మా.. సెక్రటరీని అడుగుతా? సమస్యను పరిష్కరిస్తా.. ఏం రైతు సంఘం నాయకుడా? చెప్పు ఈ మార్కెట్లో ఎలాంటి సమస్యలున్నాయి?
కరకాల కృష్ణారెడ్డి: ఈ మార్కెట్లో పూర్తిగా దోపిడీ జరుగుతుంది. కమీషన్ ఎక్కువ తీసుకుంటరు. బుక్కచిట్టీలు వేసి రైతులను మోసం చేస్తున్నరు.
హమాలీలు చాట అని ఇష్టానుసారంగా ధాన్యం తీసుకుంటరు. మళ్లీ చాట కమీషన్ తీసుకుంటరు. ఇక మార్క్‌ఫెడ్ విషయానికొస్తే వాళ్లు పూర్తిగా వ్యాపారులకు కొమ్ముకాస్తున్నరు. ధా న్యాన్ని కమీషన్ ఏజెంట్ల నుంచి తీసుకుంటరు. ఒక వేళ నేరుగా రైతుల నుంచి తీసుకున్నా.. కమీషన్ వేస్తరు. చాలావరకు గతంలో జరిగిన తప్పిదమే జరుగుతుంది. ఇంకొకటి మార్క్‌ఫెడ్ వాళ్లు రైతుల నుంచి వంద సంచి తీసుకుంటే... వ్యాపారులతో కుమ్మక్కు అయి 180 సంచులు అని రాస్తరు. అందులో 80 వరకు కమీషన్ ఏజెంట్లు కలుపుకొని అమ్ముతున్నరు.
లకా్ష్మరెడ్డి: మీరంతా హమాలీలా?
హమాలీలు: అవును సారూ..!
లకా్ష్మరెడ్డి: మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా?
చెన్నయ్య: ఇబ్బందులైతే మాకు చాన ఉన్నయి. మాకు ఇప్పటి దాకా లెసైన్స్ కార్డులు ఇయ్యలేదు.
లకా్ష్మరెడ్డి: దరఖాస్తు చేసుకున్నా రాలేదా?
భుజంగం: అవును సార్.. ఇస్తం అంటున్నరు తప్ప ఇప్పటి దాకా రాలేదు.
లకా్ష్మరెడ్డి: మీకు ఇంకా ఏమైనా సమస్యలున్నాయా?
యాదయ్య: హమాలీ విషయంలో చాన డోక జ రుగుతుంది. మా అసోసియేషన్ తరఫున కమీష న్ రూ.3 పెట్టుకున్నం. అయితే రైసుమిల్లొళ్లు మాకు పని ఇస్తలేరు. బీహారొళ్లు రూ.2.50కే చేస్తున్నరని వాళ్లకే ఇస్తున్నరు. సేట్లను ఎంత బతిమాలినా మాకు ఇయ్యరు. 50పైసలు సూసుకొని వాళ్లకు ఇస్తున్నరు. మీరైనా వాళ్లకు కాస్త చెప్పండి సార్..!
లకా్ష్మరెడ్డి: కమీషన్ ఏజెంట్ల సమస్యలు ఏమైనా ఉన్నాయా?
బాలస్వామి: సమస్యలు మాకు ఉన్నయి. మార్క్‌ఫెడ్ వాళ్లు మక్కలు కొంటరు. లారీలోడ్ చేసి పంపుతరు. లారీలో ఒక్కటే ధాన్యం ఉండదు కదా? రెండు, మూడు రకాలు ఉంటది. అందులో ఏ ఒక్కటీ బాగోలేకపోయినా.. అన్నీ వాపస్ వస్తయి. అట్ల చేస్తే రైతులకు చాన ఇబ్బంది అయితది.
లకా్ష్మరెడ్డి: కొన్నింట్లో వ్యాపారులు నాసిరకం ధాన్యం కలిపి పంపుతున్నరంట కదా?
బాలస్వామి: సేట్లు అట్ల కలిపితే.. వాటిని అధికారులు పట్టుకోవాలి. వారిపై జరిమానా విధించాలి. అలా చేస్తే మేము మీ వెంట ఉంటం. సార్.. మీకొక విషయం చెప్పాలి. కర్ణాటకలో రైతులు తీసుకొచ్చే ధాన్యానికి మార్కెట్లో దడవాయి, కమీషన్ లేదు. కేవలం లేబర్ ఖర్చులు మాత్రమే తీసుకొని పేమెంట్ ఇచ్చేస్తరు. అట్ల మన దగ్గర కూడా చేస్తే రైతులకు చాన మేలు అయితది.
లకా్ష్మరెడ్డి: సరే.. మీ చెప్పిన విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా... మార్కెట్ సెక్రటరీ ఎక్కడున్నారు?
అనంతయ్య: సార్.. ఇక్కడే ఉన్నాను.
లకా్ష్మరెడ్డి: ఏం సెక్రటరీ గారు.. మార్కెట్లో చాన సమస్యలున్నాయి. మీరు పట్టించుకోవడం లేదా?
అనంతయ్య: టాయిలెట్లు, విశ్రాంతి గది తదితర సమస్యలపై మీ ద్వారా ప్రపోజల్స్ పంపిం చినం. అవన్నీ కూడా మంజూరయ్యాయి. పది రోజుల్లో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తాం.
లకా్ష్మరెడ్డి: మార్కెట్లో రైతుబంధు పథకం ఎందుకు అమలు కావడంలేదు?
అనంతయ్య: నిజమే సార్.. ఈ పథకం విషయం లో కాస్త సమస్యలు ఉన్నాయి. గోదాములు మొత్తం కూడా మార్క్‌ఫెడ్, నాఫెడ్ వాళ్లకు ఇవ్వడం జరిగింది. దాని వల్ల ఇబ్బంది కలుగుతుంది. అయితే ఒక వేళ రైతులు ముందుకు వస్తే ప్రైవేట్‌గానైనా ఏర్పాటు చేస్తాం.
లకా్ష్మరెడ్డి: ధాన్యం కూడా రోజుల తరబడి ఎందుకు నిల్వ ఉంచుతున్నారు. కొనుగోలు చేసిన వెంటనే ఎందుకు పంపడం లేదు?
అనంతయ్య: మార్క్‌ఫెడ్ వాళ్లతో కాస్త సమస్య వస్తోంది. లారీల సమస్య ఉందంటున్నరు. ఈ విషయమై వారితో సీరియస్‌గా వాళ్లతో మాట్లాడినం.. తర్వలో సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తామన్నారు.
లకా్ష్మరెడ్డి: అధికారుల తీరు వల్ల రైతులు చాన ఇబ్బంది పడుతున్నరు. లోపాలు ఎక్కడున్నయో చూసి, సమస్యలను వెంటనే పరిష్కరించండి.