సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రంలో పాస్‌పోర్టు సేవలు మెరుగయ్యాయి. ముఖ్యంగా విశాఖ రీజనల్ పాస్‌పోర్ట్ కేంద్రంలో గతంలో మాదిరిగా నెలల తరబడి నిరీక్షణకు చెక్ చెబుతూ.. ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తూ.. దరఖాస్తుల క్లియరెన్స్‌పై దృష్టిసారించారు. ఇతర ప్రాంతాలకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రోజు రోజుకీ దరఖాస్తులు పెరుగుతున్నాయి. ఫలితంగా.. విశాఖ ఆర్‌పీవో కిక్కిరిసిపోతోంది. రోజుకు 1,290 అపాయింట్‌మెంట్స్ అందిస్తున్నారు. 2023లో ఏకంగా 1,98,577 పాస్‌పోర్టులు రికార్డు స్థాయిలో జారీ చేయడం విశేషం.
ఇక్కడ నుంచి 13 జిల్లాలకు పాస్‌పోర్టు సేవలందుతున్నాయి. ఉపాధి, ఉన్నత విద్య, ఇతర అవసరాల కోసం విదేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్టు పొందడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చేది. రోజులు, నెలల తరబడి కాళ్లరిగేలా తిరిగినా స్లాట్లు దొరికే పరిస్థితి ఉండేది కాదు. కానీ.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీసుకున్న కీలక నిర్ణయాలతో పాస్‌పోర్టు సేవలు సులువయ్యాయి. దళారుల ప్రమేయం లేకుండానే.. దరఖాస్తుదారుల చేతికి సులువుగా పాస్‌పోర్టు లభిస్తోంది.
రాష్ట్రంలోని ప్రధానమైన విశాఖపట్నం ప్రాంతీయ పాస్‌పోర్టు కేంద్రంలో తత్కాల్, సాధారణ అపాయింట్‌మెంట్లను పెంచి, కాలపరిమితిని తగ్గించడంతో పాటు శనివారం కూడా సేవలు అందిస్తుండటంతో.. పాస్‌పోర్టుల జారీ ప్రక్రియ కూడా వేగవంతమైంది. మరోవైపు పోలీసుల వెరిఫికేషన్ ప్రక్రియ కూడా త్వరితగతిన పూర్తి చేస్తూ.. క్లియరెన్స్ సర్టిఫికెట్స్(పీసీసీ) ఇస్తున్నారు. ఈ సంస్కరణల కారణంగా.. విశాఖపట్నం పాస్‌పోర్టు కేంద్రాల్లో పనితీరు జోరందుకుంది.
2023లో 1,98,577 పాస్‌పోర్టుల జారీ
పాత నిబంధనల ప్రకారం పాస్‌పోర్టు కోసం, పోలీస్ విచారణ కోసం నెలల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. ప్రజల సౌలభ్యం కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు దరఖాస్తుతో పాటు నాలుగు పత్రాలుంటే వారం రోజుల్లో పాస్‌పోర్ట్ చేతిలో ఉంటుంది. ఆధార్‌కార్డు(ఇందులో డేట్ ఆఫ్ బర్త్ కచ్చితంగా ఉండాలి). ఎల్రక్టానిక్ ఫొటో ఐడెంటిటీ కార్డు, పాన్ కార్డు ఉండాలి. వీటితో పాటుగా స్థానికత, క్రిమినల్ రికార్డు, ఇంటి చిరునామాతో కూడిన వివరాలు పొందుపరిచి ఉండేలా లాయర్ అఫిడవిట్ ఉంటే చాలు.
వీటిలో ఉన్న సమాచారం నిజమని నిర్ధారించుకున్న వెంటనే పాస్‌పోర్టు ఇస్తున్నారు. విశాఖ ప్రాంతీయ కేంద్రంలో పాస్‌పోర్ట్, పోలీస్ క్లియరెన్స్ సర్టీఫికేట్స్ కోసం రోజుకు సగటున 1,290 వరకూ అపాయింట్‌మెంట్స్ ఇచ్చి దరఖాస్తుల్ని పరిశీలిస్తున్నారు. 2023 జనవరి సమయంలో దరఖాస్తు చేసుకుంటే అపాయింట్‌మెంట్ 25 పనిదినాల్లోపు ఇచ్చేవారు. ఇప్పుడు కేవలం ఒక్క రోజులో ఇస్తున్నారు.
పీవో పీఎస్‌కేల పరిధిలో విస్తృతంగా సేవలు..
ఏడాదిన్నర కిందట తపాలా కార్యాలయాల్లోనూ పాస్‌పోర్టు సేవలు అందుబాటులోకొచ్చాయి. విశాఖ ఆర్‌పీవో పరిధిలో రెండు పాస్‌పోర్టు సేవా కేంద్రాలతో పాటు ఏడు పోస్టాఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రాలు (పీవోపీఎస్‌కే) ఉన్నాయి. ఈ పీవోపీఎస్‌కేల ద్వారానే పోలీస్ క్లియరెన్స్ సర్టీఫికెట్స్(పీసీసీ) స్లాట్లు కూడా జారీ చేస్తుండటంతో పరిశీలన ప్రక్రియ మరింత సులభంగా మారింది. విశాఖ ఆర్‌పీవో పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశి్చమ గోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, యానాం జిల్లాలున్నాయి.
పారదర్శకంగా సేవలు
దరఖాస్తుదారులకు సమీప తేదీల్లో అపాయింట్‌మెంట్ ఉండేలా చర్యలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. రెన్యువల్ కోసం చివరి తేదీ వరకూ ఆలస్యం చేస్తుండటం సరికాదు. ఆరు నెలల ముందుగానే దరఖాస్తు చేసుకుంటే.. పాత పాస్‌పోర్టు గడువు ముగిసేలోగా కొత్త పాస్‌పోర్టు మంజూరవుతుంది. ఏదైనా విచారణ కోసం ఆర్‌పీవోకి ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 లోపు ఎలాంటి అపాయింట్‌మెంట్ లేకపోయినా హాజరుకావచ్చు. – విశ్వంజలి గైక్వాడ్ విశాఖ ఆర్‌పీవో అధికారి
Comments
Please login to add a commentAdd a comment