డొనాల్డ్ ట్రంప్‌కు అన్నీ తానై ముందుండి నడిపిస్తున్న ఎలాన్ మస్క్
మస్క్ ప్రధానమంత్రిలా వ్యవహరిస్తారంటూ డెమొక్రాట్ల విమర్శలు
కొట్టిపారేసిన ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ పోరులో విజయనాదం చేసిన డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ పీఠంపై కూర్చున్నాక ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? పాలన ఎలా ఉంటుంది? అనే ఆసక్తికర అంశాలకంటే మరో అంశం ఇప్పుడు అమెరికాలో హాట్‌టాపిక్‌గా మారింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నూతన ప్రభుత్వంలో ఎలాంటి పాత్ర పోషిస్తారనేది ఇప్పుడు అతిపెద్ద చర్చనీయాంశమైంది. కొత్తగా సృష్టించిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ(డోజ్)కు సహ సారథిగా కొనసాగాల్సిన మస్క్ ఏకంగా అధ్యక్షుడి నిర్ణయాల్లో కలగజేసుకుంటున్నారనేది ప్రధాన ఆరోపణ.
ఇందుకు బలం చేకూర్చే ఘటనలు తరచూ జరగడం చూస్తుంటే అధ్యక్ష పీఠంపై పేరుకే ట్రంప్ కూర్చున్నా నిర్ణయాధికారం మస్క్‌దేనన్న రాజకీయ పండితుల విశ్లేషణలు ఇప్పుడు సగటు అమెరికన్‌ను ఆలోచనల్లో పడేస్తు న్నాయి. మేక్ అమెరికా గ్రేట్ ఎగేన్ నినాదంతో దూసుకొచ్చి పీఠంపై పెత్తనాన్ని ఖరారుచేసుకున్న ట్రంప్‌కు బదులు సొంత వ్యాపార ప్రయోజనాలే పరమావధిగా నడుచుకునే నయా ప్రపంచ కుబేరుడు మస్క్ ఆలోచనలే ప్రభుత్వ నిర్ణయాలుగా అమలుకాబోతున్నాయని డెమొక్రాట్లు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇందులో నిజమెంతో తెలియాలంటే మరో నాలుగు వారాలు ఆగక తప్పదు.
డోజ్ మొదలు ద్రవ్య వినిమయ బిల్లు దాకా..
టెస్లా సీఈవోగా, ప్రపంచ కుబేరుడుగా సుపరిచిత మస్క్ అమెరికా రాజకీయాల్లో మొత్తం తలదూర్చేసి ట్రంప్‌ను ఎలాగైనా గెలిపించాలని కంకణం కట్టుకున్నారు. వేల కోట్లరూపాయల సొంత డబ్బును ట్రంప్ ప్రచారం కోసం నీళ్లలా ఖర్చుచేశారు. డోజ్‌కు సారథ్యం వహిస్తూ అమెరికా ప్రభుత్వ అనవసర ఖర్చులకు కత్తెర వేసే పనిని తన భుజాలకెత్తుకున్నారు. అంతటితో ఆగకుండా అమెరికా తాత్కాలిక బడ్జెట్ అయిన ద్రవ్య వినిమయ బిల్లులోనూ వేలు పెట్టారు. అమెరికా తలపై షట్‌డౌన్ కత్తి వేలాడుతున్నా సరే ఈ బిల్లు ఆమోదం పొందకూడదని మస్క్ తెగేసి చెప్పారు.
మస్క్ తన అభిప్రాయం చెప్పిన కొద్దిసేపటికే ట్రంప్ సైతం అదే పాటపాడటం గమనార్హం. పార్లమెంట్‌లో ఆ బిల్లును వ్యతిరేకించాలని సొంత పార్టీ రిపబ్లికన్ నేతలకు ట్రంప్ హెచ్చరికలు జారీచేశారు. ప్రతి అంశంలో కలగజేసుకోవడం చూస్తుంటే మస్క్ అప్రకటిత ప్రధానమంత్రి హోదా వెలగబెట్టడం ఖాయంగా కనిపిస్తోందని డెమొక్రాట్లతోపాటు కొందరు రిపబ్లికన్ పార్లమెంట్ సభ్యులూ ఆరోపిస్తున్నారు. ‘‘‘ఎక్స్’ను మస్క్ కొనుగోలుచేశారుకాబట్టి సరిపోయింది. లేదంటే ద్రవ్య బిల్లులో ఏముందో మాకు కూడా తెలిసేదికాదు. ‘ఎక్స్’పోస్ట్‌ల ద్వారానే బిల్లు వివరాలు తెల్సుకున్నాం’’అని రిపబ్లికన్ సెనేటర్ విలియం ప్రాన్సిస్ హగెర్టీ వ్యాఖ్యానించారు.
ఈ ఆరోపణలను ట్రంప్ ఆదివారం కొట్టిపారేశారు. ఆరిజోనా రాష్ట్రంలోని ఫీనిక్స్ సిటీలో ట్రంప్ పాల్గొన్న అమెరికాఫీస్ట్ కార్యక్రమంలో ప్రేక్షకులు ‘అధ్యక్షుడు మస్క్’అంటూ నినాదాలు ఇవ్వడంతో ట్రంప్ స్పందించారు. పీఎం కాకపోతే ఏకంగా ప్రెసిడెంట్ అవుతారని డెమొక్రాట్ల చేసిన వ్యంగ్య వ్యాఖ్యలపై ట్రంప్ మాట్లాడారు. ‘‘మస్క్ ఏనాటికీ అధ్యక్షుడు కాలేడు. నా సీటు భద్రం. ఆయన అమెరికాలో పుట్టలేదుగా. అమెరికా రాజ్యాంగం ప్రకారం అమెరికా గడ్డపై పుట్టిన వ్యక్తికే అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసే అర్హత ఉంటుంది’’అని ట్రంప్ అన్నారు. మస్క్ దక్షిణాఫ్రికాలో పుట్టారు.
సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నారా?
అమెరికా దేశ ప్రయోజనాలకంటే మస్క్ సొంత వ్యాపారానికే అధిక ప్రాధాన్యతనిస్తున్నారని దిగువసభ సభ్యురాలు డెమొక్రటిక్ నేత రోసా డీలారో ఆరోపించారు. ‘‘చైనాలోని షాంఘైలో టెస్లా కంపె నీ పెట్టుబడులపై అమెరికా పార్లమెంటరీ కమిటీ సమీక్ష జరగాలి. దానిని మస్క్ అడ్డుకుంటున్నారు. దీనిపై మస్క్ సరైన వివరణ ఇవ్వలేదు పైగా ఆమె ను పార్లమెంట్ నుంచి బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఎవరినీ లెక్కపెట్టని ట్రంప్.. మస్‌్కకు ప్రస్తుతానికి అగ్ర తాంబూలం ఇస్తున్నారు. మరి ఈ సఖ్యత ఎన్నా ళ్లు ఉంటుందో చూడాలి మరి.
వినూత్న దారిలో వ్యాపార దార్శనికుడు
ఈ–కామర్స్ మొదలు విద్యుత్ వాహనాలు, అంతరిక్ష రంగంలో స్పేస్‌క్రాఫ్ట్ పునరి్వనియోగం దాకా పట్టిందల్లా బంగారంగా మార్చిన మస్‌్కకు అమెరికా వ్యాపారవర్గాల్లో, యువతలో ఎనలేని క్రేజ్ ఉంది. అన్ని ఖండాల్లో వ్యాపారాలు, అంతర్జాతీయంగా వ్యాపారదిగ్గాజాలు, అగ్రనేతలతో సత్సంబంధాలు, అమెరికా ప్రభుత్వం నుంచి బిలియన్ డాలర్ల భారీ కాంట్రాక్టులు, శాటిలైట్ ఇంటర్నెట్ వ్యవస్థ, సొంత ఉపగ్రహాలు, సొంత సోషల్‌మీడియా నెట్‌వర్క్‌లతో విశ్వవ్యాప్తంగా వ్యాపారాన్ని విస్తరించిన మస్‌్క.. అమెరికా పాలననూ శాసిస్తారని ఇప్పటికే పుకార్లు మొదలయ్యాయి.
అగ్రరాజ్యానికి అధినేతగా ట్రంప్ కొనసాగినా సెనేట్ సభ్యులైన రిపబ్లికన్ నేతల ఆర్థిక అవసరాలు తీర్చే నిలువెత్తు ఖజానాగా మస్క్ మారారని వార్తలొచ్చాయి. పార్లమెంట్‌లో రిపబ్లికన్ నేతలు ట్రంప్ కంటే మస్క్ మాటకే ఎక్కువ విలువ ఇచ్చే పరిస్థితులు కనబడుతున్నాయని తెలుస్తోంది. ఇదే జరిగితే త్వరలో కొలువుతీరే కొత్త ప్రభుత్వంలో మస్క్ నిర్ణయాలే ఎక్కువగా అమలుకు నోచుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషణలు వినవస్తున్నాయి.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీకి సహ సారథిగా ఉంటూ సొంత వ్యాపార ప్రయోజనాలకే మస్క్ పెద్దపీట వేస్తారని డెమొక్రాట్లు ఆరోపిస్తున్నారు. ద్రవ్య వినిమయ బిల్లు తెచ్చిన దిగువసభ స్పీకర్ మైక్ జాన్సన్‌పై మస్క్ బహిరంగంగా విమర్శలు చేయడం చూస్తుంటే ఆయన ఇప్పటికే పరిపాలనలో జోక్యం చేసుకుంటున్నారని స్పష్టంగా తెలుస్తోంది. అధ్యక్షుడిగా గెలిచిన ట్రంప్‌కు ప్రపంచదేశాధినేతలు ఫోన్ చేస్తే పక్కనే ఉన్న మస్క్‌తోనూ ట్రంప్ ఫోన్ మాట్లాడించడం చూస్తుంటే స్వయంగా ట్రంపే ఆయనను చంకన ఎక్కించుకున్నారని అర్ధమవుతోంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment