Trump 2.0: మనపై ప్రభావమెంత? | Donald Trump 2.0 Impact for Indian Americans | Sakshi
Sakshi News home page

Trump 2.0: మనపై ప్రభావమెంత?

Published Sun, Jan 19 2025 4:33 AM | Last Updated on Sun, Jan 19 2025 4:33 AM

Donald Trump 2.0 Impact for Indian Americans

అమెరికాలో ప్రబల శక్తిగా భారతీయులు 

ఉద్యోగాల నుంచి రాజకీయాల దాకా ముద్ర 

వలసలు, వీసా విధానాల్లో మార్పులపై ఉత్కంఠ 

ట్రంప్‌ 2.0

రెండోసారి అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. శ్వేతసౌధంలోకి ఆయన పునరాగమనం అక్కడి భారతీయులకు పలు అవకాశాలతో పాటు సవాళ్లను కూడా మోసుకొస్తున్నట్టే కనిపిస్తోంది. అమెరికాలో భారత సంతతికి చెందినవారు 45 లక్షలకు పైగా ఉన్నారు. సంఖ్యాపరంగా తక్కువగా అనిపిస్తున్నా కొన్నేళ్లుగా వాళ్లు ప్రబల శక్తిగా ఆవిర్భవించారు. 

ఐటీ, వైద్యం, విద్య వంటి రంగాల్లో విశేషంగా రాణిస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు ప్రధాన చోదక శక్తులుగా మారారంటే అతిశయోక్తి కాదు. ఇటీవల రాజకీయ రంగంలో కూడా సత్తా చాటుతున్నారు. అధ్యక్షునిగా ట్రంప్‌ తొలి హయాం భారత అమెరికన్లకు కాస్త తీపి, కాస్త చేదుగానే గడిచింది. ప్రధాని నరేంద్ర మోదీతో ట్రంప్‌ సాన్నిహిత్యం అందరినీ ఆకర్షించింది. 

‘హౌడీ మోడీ’ పేరిట 2019లో హూస్టన్‌లో ట్రంప్‌ అట్టహాసం చేస్తే, అంతకుమించి అన్నట్టుగా మరుసటేడే మోదీ అహ్మదాబాద్‌లో నమస్తే ట్రంప్‌ పేరుతో భారీ సభ నిర్వహించారు. దానికి తరలివచ్చిన లక్ష పైచిలుకు జన సందోహాన్ని చూసి ఆశ్చర్యానందాల్లో మునిగిపోవడం అధ్యక్షుని వతయింది. 

ఆసియాలో చైనా ప్రాబల్యానికి చెక్‌ పెట్టడం వంటి ఉమ్మడి వ్యూహాత్మక లక్ష్యాలు ఇరు దేశాలను మరింత సన్నిహితం చేశాయి. వరక్త వ్యాపారాలూ ఇతోధికంగా పుంజుకున్నాయి. భారత్‌–అమెరికా సంబంధాలు మొత్తమ్మీద మరింత బలోపేతమే అయ్యాయి. ఈ నేపథ్యంలో ట్రంప్‌ 2.0 భారత్‌కు, అమెరికాలోని మనవారికి ఎలా ఉండనుందన్నది ఆసక్తికరంగా మారింది.        

సామాజిక ఆందోళనలు 
ట్రంప్‌ తొలి హయాంలో జాతి విద్వేష, విద్వేష నేర ఘటనలు పెరిగాయి. వాటిలో తరచూ దక్షిణాసియా మూలాలున్న వారినే లక్ష్యంగా చేసుకునే ఆందోళనకర ట్రెండుకు తెర లేచింది. దీని ప్రభావం భారతీయ అమెరికన్లపైనా బాగానే పడింది. దానికి తోడు ‘మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌’ నినాదానికి ఈసారి మరింత ప్రాధాన్యమిస్తానని ట్రంప్‌ కుండబద్దలు కొట్టారు. తమపట్ల వివక్షకు తావులేని వాతావరణాన్ని కోరుకుంటున్న భారతీయ అమెరికన్లలో ఈ ప్రకటన మరింత గుబులు రేపుతోంది. ఈ ఆందోళనలను తొలగించేందుకు రిపబ్లికన్‌ పార్టీలోని భారత మూలాలున్న నేతలు ఏ మేరకు కృషి చేస్తారన్నది కీలకం కానుంది.  

వర్తకం.. ఆచితూచి 
ట్రంప్‌ తొలి హయాంలో వర్తకానికి పెద్దపీటే వేసినా కొన్నిసార్లు వివాదాలూ తప్పలేదు. ఉక్కు, అల్యూమినియం, వ్యవసాయోత్పత్తుల వంటివాటిపై టారిఫ్‌లు గొడవకు దారితీశాయి. రిటైల్‌ నుంచి టెక్‌ స్టార్టప్‌ల దాకా రెండు ఆర్థిక వ్యవస్థల్లోనూ కీలకంగా మారిన భారత అమెరికన్‌ వ్యాపారవేత్తలకు ట్రంప్‌ తొలి హయాంలో మిశ్రమ ఫలితాలే ఎదురయ్యాయి. 

పన్ను తగ్గింపులు, నిబంధనల సడలింపు వంటి ట్రంప్‌ సర్కారు నిర్ణయాలు వ్యాపార విస్తృతికి దోహదపడినా మొత్తమ్మీద టారిఫ్‌ల విషయంలో కొనసాగిన అనిశ్చితి ఎప్పటికప్పుడు వారికి సవాలుగానే నిలుస్తూ వచ్చింది. వాటిపై సంప్రదింపులు కూడా పెద్దగా ఫలితమివ్వలేదు. ఈసారి వాటిని చక్కదిద్దుకోవడానికి ట్రంప్‌ ప్రాధాన్యమిచ్చే అవకాశముంది. 

→ విధానాలు ఇరు దేశాలకూ లాభసాటిగా ఉండేలా మెరుగు పరిచేందుకు ద్వైపాక్షిక వర్తకంతో ప్రత్యక్ష భాగస్వామ్యమున్న భారతీయ అమెరికన్‌ వ్యాపార దిగ్గజాలు ప్రయత్నించవచ్చు. 
→ ఫార్మా, జౌళి, టెక్నాలజీ వంటి రంగాల్లో టారిఫ్‌లు తగ్గడమో, లేదంటే సరళంగా మారడమో ఖాయంగా కనిపిస్తోంది. 
→ పన్ను ప్రోత్సాహకాలపై నియంత్రణల ఎత్తివేతతో పాటు చిన్న వ్యాపారాలకు ఇతోధికంగా వృద్ధి అవకాశాల కల్పన దిశగా అడుగులు పడవచ్చు. 
→ ట్రంప్‌ అత్యంత ప్రాధాన్యమిస్తున్న ‘అమెరికా ఫస్ట్‌’ విధానం భారతీయ అమెరికన్‌ వ్యాపారవేత్తలకు సవాలుగా పరిణమించే ఆస్కారమూ లేకపోలేదు.

వలసలపై ఉత్కంఠే 
అమెరికాలో భారతీయుల విజయగాథకు హెచ్‌–1బీ వీసా విధానమే దశాబ్దాలుగా మూలస్తంభంగా నిలుస్తూ వచ్చింది. ముఖ్యంగా ఐటీ, వైద్య తదితర రంగాల్లో మన నిపుణులు అగ్ర రాజ్యంలో తిరుగులేని రీతిలో జెండా పాతారు. అంత కీలకమైన హెచ్‌–1బీ వీసా విధానం ట్రంప్‌ తొలి హయాంలో ఒడిదుడుకులకు లోనైంది. మితిమీరిన వడపోతలు, కఠినమైన అర్హత ప్రమాణాల వంటివి అమెరికా కలలుకనే భారతీయ ఔత్సాహికుల్లో, వారి కుటుంబాల్లో తీవ్ర అనిశి్చతికి దారితీశాయి. 

→ ఈ సవాళ్లు ట్రంప్‌ 2.0లో మరింత పెరిగే సూచనలే కన్పిస్తుండటం ఆందోళనకరం. 
→ గ్రీన్‌కార్డు కోసం దశాబ్దాలుగా ఎదురుతెన్నుల్లోనే గడుపుతున్న భారత అమెరికన్లు మరిన్ని సమస్యలు ఎదుర్కోక తప్పేలా లేదు. 
→ జీవిత భాగస్వామి ప్రధానంగా హెచ్‌–4 వర్క్‌ వీసా పర్మిట్లపై ఆధారపడే కుటుంబాల పరిస్థితి మరింత డోలాయమానంగా తయారైంది. ఆ వీసాలకు వర్క్‌ పర్మిట్లు రద్దు చేస్తామని ట్రంప్‌ గతంలో చేసిన ప్రకటన ఇప్పుడు మళ్లీ భయపెడుతోంది. అదే జరిగితే భారత మహిళలకు కోలుకోలేని దెబ్బే అవుతుంది. కుటుంబానికి ఆర్థిక భద్రత, వృత్తిగత ఎదుగుదలకు కీలకమైన అవకాశం వారి చేజారుతుంది. 
→ వీసా పర్మిట్ల గందరగోళంతో నిపుణులైన భారతీయులపై ఎక్కువగా ఆధారపడే అమెరికా వ్యాపార సంస్థలు కూడా బాగా ప్రభావితమవుతాయి. 
→ వర్క్‌ వీసాలపై పరిమితులు కీలక రంగాల్లో మానవ వనరుల కొరతకు దారితీస్తాయి.

రూటు మారిన రాజకీయం 
భారత అమెరికన్లు మొదటినుంచీ డెమొక్రటిక్‌ పార్టీ మద్దతుదారులుగా ఉంటూ వచ్చారు. వలసలు, వైవిధ్యం, సామాజిక న్యాయం తదితర విధానాల్లో ఆ పార్టీ ప్రగతిశీల వైఖరే అందుకు ప్రధాన కారణం. కానీ వలస సంస్కరణలపై బైడెన్‌ సర్కారు నిర్లిప్తత, అంతూపొంతూ లేని గ్రీన్‌కార్డుల వెయిటింగ్‌ లిస్టు వంటివి ఆ పార్టీపై వారిలో అసంతృప్తికి దారితీశాయి. 

ఈ నేపథ్యంలో కుటుంబ విలువలు, విద్య తదితరాల్లో అచ్చం తమను పోలి ఉండే రిపబ్లికన్‌ పార్టీ వైఖరి, దాని సరళీకృత ఆర్థిక విధానాలు సంప్రదాయ భారతీయులను కొంతకాలంగా అమితంగా ఆకర్షిస్తున్నాయి. నిక్కీ హేలీ, వివేక్‌ రామస్వామి వంటి భారత సంతతికి చెందిన రిపబ్లికన్‌ నేతలు మరింతగా వారి ఆదరణను చూరగొంటున్నారు. ముఖ్యంగా దూకుడుకు మారుపేరైన ట్రంప్‌ రిపబ్లికన్‌ పగ్గాలు చేపట్టిన నాటినుంచీ ఈ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. భారత అమెరికన్‌ సమాజం నానాటికీ ఆ పార్టివైపు మొగ్గుతోంది. ట్రంప్‌ 2.0 విధానాలను బట్టి ఇది మరింత ఊపందుకున్నా ఆశ్చర్యం లేదు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement