ఉక్కు ఉత్పత్తులకు కనీస దిగుమతి ధర ! | Tata Steel launches two new innovative products | Sakshi
Sakshi News home page

ఉక్కు ఉత్పత్తులకు కనీస దిగుమతి ధర !

Published Tue, Dec 15 2015 1:46 AM | Last Updated on Fri, Nov 9 2018 5:37 PM

ఉక్కు ఉత్పత్తులకు కనీస దిగుమతి ధర ! - Sakshi

ఉక్కు ఉత్పత్తులకు కనీస దిగుమతి ధర !

* త్వరలో నిర్ణయించనున్న కేంద్రం
* దేశీయ స్టీలు కంపెనీలకు పెద్ద ఊరట
* ఒకే పోర్టుకు దిగుమతులు పరిమితం!


హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఉక్కు (స్టీలు) రంగ కంపెనీలకు తీపి కబురు. కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల్లో స్టీలు ఉత్పత్తులకు కనీస దిగుమతి ధర (ఎంఐపీ) నిర్ణయించనుంది. కేంద్ర వాణిజ్య శాఖతోపాటు ఉక్కు శాఖ సంయుక్తంగా 30-35 రకాల స్టీలు ఉత్పత్తులకు ఎంఐపీని నేడోరేపో ప్రకటించే అవకాశం ఉంది.

ఇదే జరిగితే ఎంఐపీ కంటే తక్కువ ధర ఉన్న ఉత్పత్తుల దిగుమతులకు చెక్ పెడతారు. దీంతో భారత్‌కు ప్రధాన ఎగుమతిదారైన చైనాతోపాటు జపాన్, దక్షిణ కొరియా, రష్యా తదితర దేశాల చవక ఉత్పత్తులకు అడ్డుకట్ట పడనుంది. మరోవైపు గుజరాత్‌లోని ముంద్రా నౌకాశ్రయం నుంచి మాత్రమే ఉక్కు ఉత్పత్తులను అనుమతించేలా నిబంధన రానుంది.  చైనా, యూఎస్ తర్వాత అతిపెద్ద స్టీల్ మార్కెట్‌గా ఉన్న భారత్‌లో ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు పెద్ద ఎత్తున రానుండడంతో ఇక్కడి విపణిపై సానుకూల పవనాలు వీస్తున్నాయి.
 
పెద్ద కంపెనీలకూ కష్టాలు: చవక దిగుమతుల కారణంగా భారతీయ కంపెనీలు మార్కెట్లో పోటీపడలేకపోతున్నాయి. లాభాలు కుచించుకుపోతున్నాయని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, జేఎస్‌డబ్ల్యు స్టీల్, ఎస్సార్ స్టీల్, జిందాల్ స్టీల్ తదితర దిగ్గజ కంపెనీలు కేంద్రానికి గతంలో ఫిర్యాదు చేశాయి.

భారతీయ స్టీలు కంపెనీల తయారీ వ్యయం టన్ను స్టీలుకు సుమారు రూ.23 వేలుంటే, దిగుమతైన స్టీలు ధర రూ.16 వేలుంటోంది. ప్లాంట్ల సామర్థ్యం 20 శాతానికి మించడం లేదని, చాలా ప్లాంట్లు మూతపడ్డాయని ముంబైకి చెందిన ఒక కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. ఓఎన్‌జీసీ సైతం చైనా పైపులను దిగుమతి చేసుకుంటోందని వెల్లడించారు.  పరిశ్రమను కాపాడాలంటే దిగుమతులకు అడ్డుకట్ట వేయాల్సిందేనని పలు స్టీలు కంపెనీలను నిర్వహిస్తున్న కామినేని గ్రూప్ చైర్మన్ కామినేని సూర్యనారాయణ సాక్షి బిజినెస్ బ్యూరోతో అన్నారు.
 
లక్షల కోట్లలో పెట్టుబడులు..
దేశీయ స్టీలు కంపెనీలు విస్తరణకుగాను కోట్లాది రూపాయలను వెచ్చించాయి. ఇందుకోసం భారీగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నాయి. ప్రభుత్వ బ్యాంకుల వద్ద నిరర్దక ఆస్తులు రూ.3.09 లక్షల కోట్లకు ఎగిశాయి. ఇందులో అత్యధిక వాటా స్టీల్ పరిశ్రమదేనని సమాచారం. కోల్డ్ రోల్డ్ ఫ్లాట్ స్టెయిన్‌లెస్ స్టీల్ ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం శుక్రవారం యాంటీ డంపింగ్ సుంకాన్ని రకాన్నిబట్టి 57.4 శాతం వరకు విధించింది.

సీమ్‌లెస్ పైపులపైనా యాంటీ డంపింగ్ సుంకం విధించాలని మహారాష్ట్రకు చెందిన ఒక కంపెనీ ఎండీ తెలిపారు. భారత సీమ్‌లెస్ పైప్ మార్కెట్ రూ.15,000 కోట్లుగా ఉన్నప్పటికీ,  ఒక్క భారతీయ సీమ్‌లెస్ పైప్ కంపెనీ కూడా ఆర్డరు పొందకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement