ఐసిస్‌లో భారతీయుల పరిస్థితి దారుణం
న్యూఢిల్లీ: ఆసియా దేశాల్లో ముఖ్యంగా భారత్‌లో పాగా వేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న భయంకర ఉగ్రవాద సంస్థ ఐసిస్‌లో 23 మంది భారతీయులు చేరినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఇందులో ఆరుగురు వివిధ సందర్భాల్లో మానవబాంబులుగా, ప్రత్యర్థుల దాడుల్లో హతమయ్యారు. చనిపోయిన వారిలో అతిఫ్ వసీమ్ మహమ్మద్ (తెలంగాణ, ఆదిలాబాద్), ఉమర్ సుభాన్ (బెంగళూరు), ఫైజ్ మసూద్ (బెంగళూరు), మౌలానా సుల్తాన్ అమర్ (భత్కల్, కర్ణాటక), ఫారూఖీ టంకీ (థానే, మహారాష్ట్ర), మహమ్మద్ సజ్జద్ (ఆజంగఢ్, యూపీ) ఉన్నారు. నిఘా వివరాల ప్రకారం.. ఐసిస్ ఆర్మీలో చేరేందుకు ఆసియన్ దేశాల నుంచి వెళ్లిన వారి జీవితాలు దుర్భరంగా ఉంటాయని, కిందిస్థాయిలోనే వీరిని వాడుకుంటారని వెల్లడైంది.
ఆసియా దేశాల వారిలో పోరాడేతత్వం తక్కువని , అందుకే వీరిని మానవబాంబులుగానే వినియోగించుకుంటారని తెలిసింది. ట్యునీషియా, పాలస్తీనా, సౌదీ, ఇరాక్, సిరియానుంచి వచ్చిన వారిని ఐసిస్‌లో ఉన్నత స్థానాల్లో నియమిస్తూ భారత్, పాక్, బంగ్లాదేశ్ దేశస్తులను కిందిస్థాయిలో చేర్చుకుంటున్నారు. ఇంటర్నెట్ వలవేసి చేర్చుకుంటున్న వారిలో వీరే ఎక్కువ. అసలైన ఇస్లాం వీరికి తెలియదని అవమానపరుస్తూ నీచంగా చూస్తారు. వీరిరికిచ్చే ఆయుధాలు అధునాతనమైనవి కావు. అయినా వీరిని యుద్ధానికి పంపిస్తారు. సిరియా యుద్ధంలో చనిపోతున్న వారిలో వీరే ఎక్కువ.
పారిపోకుండా ఉండేందుకు వీళ్ల పాస్‌పోర్టులు కాల్చేస్తారు. భారత్, పాక్‌లలో ఉండే ముస్లింలు అసలైన ముస్లింలు కారని, ఒక్కసారి జిహాద్‌లో చేరిన తర్వాత పారిపోయేందుకు ప్రయత్నిస్తే.. వారిని ‘జిన్’ (దెయ్యం) వెంటాడుతుందని భయపెడుతున్నారని రిపోర్టులు వెల్లడించాయి. దీంతో ఐసిస్‌లో చేరిన వారంతా మింగలేక కక్కలేక భయంతో మగ్గిపోతున్నారని తెలిపాయి.