
ఇరాక్‌లో ఐఎస్ నరమేధం
ఆత్మాహుతి దాడిలో 115 మంది మృతి
170 మందికి గాయాలు
బాగ్దాద్: ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్‌ఐఎస్) ఉగ్రవాద సంస్థ నెత్తుటేరులు పారించింది. రంజాన్ పండుగను జరుపుకునేందుకు సిద్ధమవుతున్న షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడికి తెగబడి వందలాది మందిని బలిగొంది. తూర్పు ఇరాక్‌లోని దియాలా ప్రావిన్సులో శుక్రవారం రాత్రి రద్దీగా ఉన్న మార్కెట్ ప్రాంతంలో పేలుడు పదార్థాలతో నింపిన ట్రక్కును ఐఎస్‌ఐఎస్ ఆత్మాహుతి దళ సభ్యుడు పేల్చేశాడు. ఈ పేలుడులో 115 మంది దుర్మరణం చెందగా మరో 170 మంది గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. పేలుడు తీవ్రతకు మృతుల శరీర భాగాలు పలు చోట్ల ఎగిరిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతమంతా భీతావహ దృశ్యాలతో హృదయ విదారకంగా మారింది. టమాటోలను ఉంచే బాక్సులను ఖాళీ చేసి వాటిలో చిన్నారుల మృతదేహాలను స్థానికులు తరలించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
తమకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమవడం వల్లే ఉగ్రవాదులు పేట్రేగిపోయారని ప్రజలు ఆరోపించారు. రంజాన్ కోసం ఉత్సాహంగా షాపింగ్‌కు వచ్చామని...కానీ ఈ పేలుడులో తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను పోగొట్టుకున్నామని వాపోయారు. మరోవైపు ఈ పేలుడు తమ పనేనని ఐఎస్‌ఐఎస్ ట్వీటర్ ద్వారా ప్రకటించుకుంది. ఇరాక్‌లో గత పదేళ్లలో ఒక ప్రదేశంలో జరిగిన ఉగ్ర దాడుల్లో భారీగా ప్రాణనష్టం జరిగిన ఘటనల్లో ఇది కూడా ఒకటి కావడం గమనార్హం. ఆత్మాహుతి దాడి నేపథ్యంలో దియాలా ప్రావిన్సులో ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. భారీగా బలగాలను మోహరించింది. ఈ దాడిని ఇరాక్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రత్యేక ప్రతినిధి జాన్ కూబిస్ తీవ్రంగా ఖండించారు. ఇరాక్‌లో ప్రస్తుతం ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు మూడో వంతు ప్రాంతాన్ని తమ అధీనంలో ఉంచుకున్నారు.