బాంబు పేలుళ్లలో ధ్వంసమైన గోకుల్‌చాట్ (ఫైల్) వికారుద్దీన్ అహ్మద్ ,మన్సూర్ అస్ఫర్ పీర్భాయ్
సాక్షి, సిటీబ్యూరో: వికారుద్దీన్ అహ్మద్... తెహరీక్–గల్బా–ఏ–ఇస్లాం (టీజీఐ) లోకల్ ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేసి... మరో నలుగురితో కలిసి మాడ్యుల్ తయారు చేసి... 2009–10 మధ్య ఏడాదిన్నర కాలంలో మూడుసార్లు పోలీసులపై తుపాకీ ఎక్కుపెట్టిన ఉగ్రవాది ఇతడు. హైదరాబాద్‌తో పాటు గుజరాత్‌లోనూ అనేక నేరాలు చేసిన వికార్... ఉగ్రవాద బాటపట్టడానికి ‘మక్కా కాల్పులే’ కారణం. 2006 మే 18న మక్కా మసీదులో జరిగిన పేలుడులో మృతుల సంఖ్య తొమ్మిది అయినప్పటికీ... ఘటనాస్థలిలో చనిపోయింది ఐదుగురు. ఈ సందర్భంగా చెలరేగిన ఘర్షణలను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో దర్స్‌గా జిహాద్ ఏ షెహదత్ (డీజేఎస్) అనే సంస్థలో పని చేస్తున్న వికారుద్దీన్ ఈ ఘటనతో పోలీసులపై కక్ష పెంచుకున్నాడు. ఓల్డ్ మలక్‌పేట ప్రాంతానికి చెందిన ఇతడు కొన్నాళ్ల పాటు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. సులేమాన్ తదితరులతో కలిసి ముఠా కట్టి హఠాత్తుగా 2008 డిసెంబరు 3న సంతోష్‌నగర్‌లో ప్రత్యక్షమై నిఘా విభాగం అధికారులపై కాల్పులు జరిపాడు. ఆపై టీజీఐ పేరులో ఏకంగా సంస్థనే ఏర్పాటు చేసి 2009 మే 18న ఫలక్‌నుమాలో, మరికొన్ని రోజులకు శాలిబండలో హోంగార్డు బాలస్వామి, కానిస్టేబుల్ రమేష్‌లను పొట్టనపెట్టుకున్నాడు. ‘మక్కా కాల్పులకు’ ప్రతీకారంగా అంటూ పోలీసులను టార్గెట్‌గా చేసుకున్నాడు. ఈ గ్యాంగ్‌ను 2010 జూలైలో అరెస్టు చేసిన పోలీసులు వరంగల్ కారాగారానికి తరలించారు. 2015 ఏప్రిల్‌లో విచారణ నిమిత్తం నగరానికి తీసుకువస్తుండగా పోలీసులపై దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించగా... పోలీసులు జరిపిన కాల్పుల్లో వికారుద్దీన్ సహా ఐదుగురు హతమయ్యారు.
‘మక్కా’ కారణంగానే ఐఎం విధ్వంసం..
దేశవాళీ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) హైదరాబాద్‌ను రెండుసార్లు టార్గెట్‌గా చేసుకుంది. 2007 ఆగస్టు 25న గోకుల్‌చాట్, లుంబినీ పార్క్‌ల్లో, 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లోని 107 బస్టాప్, ఏ–1 మిర్చ్ సెంటర్ల వద్ద విధ్వంసాలు సృష్టించింది. 2002 నుంచి ఐఎం దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు పాల్పడింది. ఈ సంస్థలో మీడియా సెల్ ఇన్‌చార్జ్‌గా వ్యవహరించిన పుణే వాసి, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మన్సూర్ అస్ఫర్ పీర్భాయ్ బంజారాహిల్స్‌లోని ఓ సంస్థలో ఎథికల్ హ్యాకింగ్‌లో శిక్షణ తీసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే మక్కా పేలుడు జరిగినప్పుడు హైదరాబాద్‌లోనే ఉన్న అతను మసీదు వద్దకు వెళ్ళి చూసి వచ్చాడు. ఆ తర్వాత ఐఎంకు చెందిన కీలక ఉగ్రవాదులు రియాజ్ భత్కల్, యాసీన్ భత్కల్ తదితరుతో పుణేలో సమావేశమై ‘భవిష్యత్తు కార్యాచరణ’పై చర్చించారు. ఇందులో పాల్గొన్న పీర్భాయ్ ‘మక్కా’ ఉదంతాన్ని వివరించడంతో రియాజ్ అందుకు ప్రతీకారంగా హైదరాబాద్‌ను టార్గెట్‌గా చేసుకుందామని నిర్ణయించాడు. 2007 ఆగస్టులో సిటీకి వచ్చిన రియాజ్, అనీఖ్, అ క్బర్ అదే నెల 25న జంట పేలుళ్లకు పాల్పడి పారిపోయారు. ప్రస్తు తం ఈ కేసు విచారణ సైతం తుది దశకు చేరుకుంది. ఈ కేసునూ మక్కా పేలుడు కేసును దర్యాప్తు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థే ఇన్వెస్టిగేట్ చేయడం కొసమెరుపు. ఈ కేసు కూడా అనేక చేతులు మారిన తర్వాతే ఎన్‌ఐఏకే చేరింది.
Comments
Please login to add a commentAdd a comment