సాక్షి, సిటీబ్యూరో: ఆ ముగ్గురూ నగర పోలీసు విభాగంలో పని చేసిన/చేస్తున్న అధికారులు... 2007 మే 18న మక్కా మసీదులో బాంబు పేలుడు జరిగిందని తెలిసిన మరుక్షణం అక్కడికి చేరుకున్నారు... మసీదు ప్రాంగణంలో ఉన్న మరో బాంబును గుర్తించి, రక్షణ సాధనాలు లేకపోయినా ధైర్యంగా నిర్వీర్యం చేశారు... నగర పోలీసు ఉన్నతాధికారులు వీరిని పొగడ్తలతో ముంచెత్తడమేగాక పదోన్నతులు ఖాయమనీ ప్రకటించారు. అంతే... కథ అక్కడితో ఆగిపోయింది... ఇది జరిగి పదకొండేళ్లు అయినా... కేసు విచారణ పూర్తై వీగిపోయినా... వీరి పదోన్నతుల ఫైలు మాత్రం ఒక్క అడుగూ ముందుకు పడలేదు. మక్కా మసీదులో ఉగ్రవాదులు అత్యంత శక్తిమంతమైన సెల్‌ఫోన్ బాంబులను అమర్చారు. ఆర్డీఎక్స్, టీఎన్‌టీ మిశ్రమంతో కూడిన ఈ బాంబులతో ఉన్న ఓ బ్యాగ్‌ను మసీదు ప్రాంగణంలోని ఆరంగుళాల మందమున్న రాతి బల్ల కింద పెట్టారు. ఈ పేలుడు ధాటికి బండ తునాతునకలైంది. నిపుణుల అంచనా ప్రకారం పేలుడు తీవ్రతలో బయటకు వచ్చింది కేవలం 30 శాతం మాత్రమే. అయినా ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంతే శక్తివంతమైన మరో బాంబును మసీదు పరిపాలనా కార్యాలయం సమీపంలో గ్రిల్స్‌కు వేలాడదీశారు.
ఇది పేలి ఉంటే ప్రాణనష్టం అపారంగా ఉండేది. మసీదులో తొలి బాంబు పేలిన వెంటనే అప్రమత్తమైన నగర పోలీసులు సిటీ సెక్యూరిటీ వింగ్ (సీఎస్‌డబ్ల్యూ)లోని బాంబు నిర్వీర్య బృందాలతో పాటు... క్లూస్ టీమ్‌ను ఘటనా స్థలికి పిలిపించారు. అప్పట్లో సిటీ క్లూస్ టీమ్ అధికారిగా ఉన్న తరువు సురేష్, సీఎస్‌డబ్ల్యూలో పనిచేస్తున్న రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్.ఎన్.ఎస్.వి.రమణ, కానిస్టేబుల్ హెచ్.అనిల్‌కుమార్ ఘటనా స్థలికి చేరుకున్నారు. అప్పటికే మసీదు ప్రాంగణంలో అనుమానాస్పదంగా ఉన్న మరో బ్యాగును గుర్తించిన మసీదు సిబ్బంది వీరి దృష్టికి తెచ్చారు. అయితే బాంబ్‌సూట్, మరే ఇతర రక్షణ సాధనాలు లేకపోయినా వేగంగా స్పందించారు. బాంబును మసీదు సమీపంలోని కిల్వత్ గ్రౌండ్‌లోకి తరలించి అందుబాటులో ఉన్న సాధారణ పరికరాలతోనే నిర్వీర్యం చేశారు. ఆ సందర్భంగా వీరి సాహసాన్ని అందరూ కొనియాడారు. పోలీసు ఉన్నతాధికారులు హామీల వర్షం కురిపించారు. నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో అప్పట్లో ప్రతి నెలా ఇచ్చే రివార్డులను ఇచ్చి సరిపుచ్చారు. రమణ, అనిల్‌లకు పదోన్నతికి సిఫారసు చేస్తూ అదే ఏడాది జూన్‌లో అప్పటి కమిషనర్ బల్వీందర్‌సింగ్ ప్రభుత్వానికి లేఖ (నెం. ఎల్ అండ్ ఓ ఎం 7ఆర్‌ఆర్255907) రాశారు. ఈ ప్రతిపాదన ఇప్పటికీ పెండింగ్‌లో ఉంది. ఆ లేఖలో క్లూస్ అధికారి సురేష్ ప్రస్తావన సైతం లేకపోవడం గమనార్హం. ఈ ఫైల్‌కు ఇప్పటికీ మోక్షం లభించలేదు.
దర్యాప్తులో ఎన్‌ఐఏ విఫలం
చాదర్‌ఘాట్: మక్కా మసీదు బాంబు పేలుళ్ల కేసు దర్యాప్తులో ఎన్‌ఐఏ విఫలమైనందున దర్యాప్తు బాధ్యతలు మరో సంస్థకు అప్పగించాలని ఎంబీటీ అధికార ప్రతినిధి, మాజీ కార్పొరేటర్ అంజదుల్లాఖాన్ అన్నారు. సోమవారం చంచల్‌గూడ లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. బాంబు పేలుళ్ల కేసులో నిందితులుగా పేర్కొన్న వారిని నిర్ధోషులుగా విడుదల చేసిన నేపథ్యంలో కేసుపై హైకోర్ట్‌లో అప్పీల్ వేయాలన్నారు. ఈ పేలుళ్లతో ఎలాంటి సంబంధం లేకపోయినా వంద మంది మైనారిటీ యువకులను నెలలు జైళ్లల్లో నిర్భందించారన్నారు. అసలు నిందితులను పట్టుకోవటంలో ఎన్‌ఐఏ విఫలమైందని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధత కూడా కారణమని ఆరోపించారు. తమను అన్యాయంగా జైల్లో ఉంచి తమ జీవితాలతో ఆడుకున్నారని బాధితుడు సయ్యద్ ఇమ్రాన్ ఆవేదన వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment