బాంబుల
కూడంకుళం అణు విద్యుత్ కేంద్రానికి కూత వేటు దూరంలోని ఇడిందకరై ఉదయాన్నే నాటు బాంబుల పేలుళ్లతో దద్దరిల్లింది. అణువ్యతిరేకులు, అణు మద్దతుదారులు నువ్వా..నేనా అన్నట్టుగా ఢీ కొనడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరస్పరం నాటు బాంబుల్ని రువ్వుకోవడంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ఆ పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. 30 నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నాయి.
సాక్షి, చెన్నై:తిరునల్వేలి జిల్లా కూడంకుళంలో నిర్మించిన అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమం మూడేళ్లుగా సాగుతూ వస్తోంది. ఈ ఉద్యమానికి ఉదయకుమార్, పుష్పరాయన్, జేసురాజ్ నేతృత్వం వహిస్తున్నారు. ఏళ్ల తరబడి సాగుతున్న ఈ ఉద్యమం గత ఏడాది రెండుగా చీలింది. ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ, అణు విద్యుత్ కేంద్రానికి మద్దతుగా ఆ ప్రాంతానికి చెందిన స్టాలిన్ నేతృత్వంలో కొత్తగా ఓ గ్రూపు బయలు దేరింది. ఇడిందకరై వేదికగా అణు వ్యతిరేక ఉద్యమం, ఆ సమీపంలోని కూత్తంకులిలో అణు విద్యుత్‌కు మద్దతుగా తరచూ సభలు జరుగుతూ వస్తున్నాయి.
వివాదం: కూత్తంకులికి చెందిన కొన్ని కుటుంబాలు ఇటీవల ఇడిందకరై పరిధిలోని సునామీ కాలనీలో చేరాయి. దీంతో ఆ కాలనీలోని అణు వ్యతిరేక గ్రూపునకు, అణు మద్దతుదారులుగా చెప్పుకుంటున్న గ్రూపునకు మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ రెండు గ్రూపులతో అణు కేంద్రానికి భద్రత ప్రశ్నార్థకం అవుతోంది. ఈ సమయంలో కొన్ని నెలల క్రితం కూత్తంకులికి చెందిన వారు నాటు బాంబులు తయారు చేస్తుండగా జరిగిన పేలుళ్లలో ఆరుగురు మరణించడం పెను కలకలాన్ని సృష్టించింది. దీంతో ఆ పరిసరాల్లో పోలీసులు నిఘా పెంచారు. అయినా, తరచూ నాటు బాంబుల మోత వినిపించడం, పేలని బాంబులు లభించడం పరిపాటిగా మారింది.
బాంబుల మోత: ఇన్నాళ్లు సునామీ కాలనీలో పేలుతూ వచ్చిన నాటు బాంబులు సోమవారం ఉదయాన్నే ఇడిందకరైను దద్దరిల్లేలా చేశాయి. అణు మద్దతు గ్రూపు, అణు వ్యతిరేక గ్రూపులు అక్కడి మాతా ఆలయం వద్ద ఢీ కొట్టాయి. ఆలయం వెనుక వైపు నుంచి అణు మద్దతుదారులు, ముందు వైపు నుంచి వ్యతిరేకులు తొలుత రాళ్లు రువ్వుకున్నారు. కాసేపటికి వివాదం ముదరడంతో నాటు బాంబుల మోతతో ఆ పరిసరాలు దద్దరిల్లాయి. అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు మాత్రం కాలేదు. ఆస్తి నష్టం కూడా జరగలేదు. వరుస బాంబుల మోత సమాచారం తిరునల్వేలి జిల్లా ఎస్పీ రాజేంద్రనాయర్‌కు చేరింది. దీంతో హుటాహుటిన బలగాలు ఇడిందకరైకు ఉరకలు తీశాయి. వళ్లియూరు డీఎస్పీ బాలాజీ నేతృత్వంలో కొన్ని బృందాలు అక్కడికి చేరుకున్నాయి. పోలీసులను చూసిన ఇరువర్గాలు పలాయనం చిత్తగించాయి. క్షణాల వ్యవధిలో ఆ పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి.
పేలకుండా పడి ఉన్న 30 నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బలగాల మోహరింపు : వెళ్తూ వెళ్తూ ఓ గ్రూపు మరో గ్రూపు ఇంటిపై బాంబులు విసరడంతో ఆ ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. అదృష్ట వశాత్తు ఆ ఇంట్లో ఉన్న వాళ్లెవ్వరికీ ఏమీ కాలేదు. వరుస బాంబుల మోతను తీవ్రంగా పరిగణించిన ఎస్పీ, ఆర్టీవో తదితర అధికారులు కూడంకుళం పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. బలగాల్ని రంగంలోకి దించి, అన్ని మార్గాల్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కూడంకుళం వైపుగా వెళ్లే ప్రతి వాహనం, ప్రతి వ్యక్తిని తనిఖీల అనంతరం అనుమతిస్తున్నారు. అయితే, ఈ గొడవతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ అణు ఉద్యమ నేతలు ప్రకటించడం గమనార్హం.