మక్కా మసీదులో బాంబు పేలుడు దృశ్యం (ఫైల్)
మే 18న... రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఉన్న హజ్రత్ ఖాజా మొయినుద్దీన్ చిస్టీ దర్గాలో అదే ఏడాది అక్టోబర్ 11న జరిగిన బాంబు పేలుళ్లను ఒకే మాడ్యుల్ చేసిందన్నది దర్యాప్తు సంస్థల మాట. నిందితులు సైతం దాదాపు ఒకరే. ఈ రెండు పేలుళ్ల మధ్యా అనేక సారూప్యతలు ఉన్నాయి. మక్కా మసీదులో సెల్‌ఫోన్ అలారంతో పేల్చిన షేప్డ్ బాంబు పేలుడు ధాటికి తొమ్మిది మంది మరణించారు. ఇదిజరిగిన దాదాపు అయిదు నెలలకు రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గాలో పేలుడు జరిగింది. అక్కడ వినియోగించిన బాంబులు, ‘మక్కా’లో వాడిన బాంబుల మధ్య సారూప్యత ఉంది. మక్కా పేలుళ్లపై సోమవారం కోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో ‘డిటో పేలుళ్ల’ అంశం చర్చనీయాంశమైంది. ఇక మక్కా కేసులో నిందితులు నిర్దోషులుగా బయటపడ్డారు. అజ్మీర్ దర్గా కేసులో మాత్రం పలువురు నిందితులకు అక్కడి కోర్టు శిక్ష విధించింది. కొందర్ని నిర్దోషులుగా ప్రకటించింది.
సాక్షి, సిటీబ్యూరో: పాతబస్తీలో ఉన్న మక్కా మసీదులో 2007 మే 18న... రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఉన్న హజ్రత్ ఖాజా మొయినుద్దీన్ చిస్టీ దర్గాలో అదే ఏడాది అక్టోబర్ 11న జరిగిన బాంబు పేలుళ్లకు సంబంధించి చాలా విషయాల్లో పోలికలున్నాయి. కాకపోతే మక్కా కేసు సోమవారం ఎన్‌ఐఏ కోర్టులో వీగిపోగా...అజ్మీర్ దర్గా కేసులో మాత్రం నిందితులు కొందరికి శిక్ష పడింది. 2017, మార్చి 22న అజ్మీర్ దర్గాలో పేలుళ్ల కేసుకు సంబంధించి కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో దేవేందర్‌గుప్తా (మక్కా మసీదు కేసులో కూడా ఉన్నాడు), భూపేష్‌కుమార్, తీర్పు నాటికే హత్యకు గురైన సుశీల్ జోషి (మక్కా కేసులోనూ నిందితుడు)లను దోషులుగా తేల్చింది. సుశీల్ కాకుండా మిగతా ఇద్దరికి జీవిత ఖైదు విధించింది. అసిమానందతో పాటు మరికొందర్ని నిర్దోషులుగా అక్కడి కోర్టు పేర్కొంది.
ఎన్నో పోలికలు...
కాగా ఈ రెండు పేలుళ్లకు పాల్పడింది ఒకరే అన్న అనుమానాలను బలపరిచేందుకు చాలా పోలికలు ఉన్నాయి. రెండు చోట్లా బాంబు సర్క్యూట్ పూర్తి కావడానికి ఏర్పాటు చేసిన సెల్‌ఫోన్‌లోని సిమ్ కార్డులను ఒకే ప్రాంతంలో కొనుగోలు చేశారు. ఈ ఘాతుకాలకు పాల్పడిన ఉగ్రవాదులు నోయిడాలోని కాలేజ్ అఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో పని చేసే తారఖ్ నాథ్ ప్రమాణిక్ ఫొటోను వినియోగించి బాబూలాల్ యాదవ్ పేరుతో జార్ఖండ్ నుంచి నకిలీ డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ కార్డులు పొందారు. వీటి సాయంతో రాంచీలో సిమ్‌కార్డులు, ఫరీదాబాద్‌లో నోకియా 6030 సెల్‌ఫోన్లు కొనుగోలు చేశారు. వీటినే ఇటు ‘మక్కా’, అటు ‘అజ్మీర్’ పేలుళ్లలో వినియోగించారు. ఈ రెండు చోట్లా ఉగ్రవాదులు వినియోగించిన బాంబులను సాంకేతికంగా షేప్డ్ బాంబ్స్ అని పిలుస్తారు. ప్రత్యేకంగా తయారు చేసిన అచ్చుల్లో ఆర్డీఎక్స్, టీఎన్‌టీ మిశ్రమం నింపి సెల్‌ఫోన్ అలారం ద్వారా సర్క్యూట్ ఏర్పాటు చేశారు. వీటిని ప్రత్యేకంగా తయారు చేసిన ఇనుప పెట్టెల్లో పెట్టారు. వీటిపై సీరియల్ నెంబర్లు సైతం వేశారు. మక్కా మసీదులో దొరికిన పేలని బాంబు పెట్టెపై 2, అజ్మీర్ దర్గాలో దొరికిన పేలని బాంబు ఉన్న పెట్టెపై 3 అంకెలు ఉన్నాయి. వీటిని పరిశీలించిన అధికారులు ఈ రెండు ఉదంతాలకూ పాల్పడింది ఒకే సంస్థకు చెందిన వారని, వారు తయారు చేసిన బాంబుల్లో 1,4 నెంబర్లున్నవి పేలగా... 2,3 నెంబర్లవి దొరికాయని నిర్థారించారు.
Comments
Please login to add a commentAdd a comment