ఇద్దరికి ఉరి.. ఒకరికి యావజ్జీవం | Gokul Chat Blast One Accused Gets Death Sentence And One Gets Life Term | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 11 2018 2:15 AM | Last Updated on Mon, Apr 8 2019 8:11 PM

Gokul Chat Blast One Accused Gets Death Sentence And One Gets Life Term - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : లుంబినీపార్క్, గోకుల్‌చాట్‌లో బాంబు పేలుళ్లు జరిపి అమాయకుల ప్రాణాలు బలిగొన్న అనీక్‌ షఫీక్‌ సయీద్, మహ్మద్‌ అక్బర్‌ ఇస్మాయిల్‌ చౌదరిలకు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. ఈ బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితులైన వీరిద్దరినీ గత వారం దోషులుగా నిర్ధారించిన న్యాయస్థానం, సోమవారం హత్య, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడం వంటి నేరాల కింద ఉరిశిక్షను ఖరారు చేసింది. అలాగే ఒక్కొక్కరికీ రూ.10 వేల జరిమానా విధించింది. అంతేకాక హత్యయత్నం కింద జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా, కుట్ర కింద జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా, దేశంపై యుద్ధం ప్రకటించిన నేరం కింద జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా, పేలుడు పదార్థాల నిరోధక చట్టం కింద జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం చట్టం కింద ఐదేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. దోషులది ఆవేశపూరిత చర్య ఎంత మాత్రం కాదని, పక్కా ప్రణాళిక ప్రకారం బాంబు పేలుళ్లకు పాల్పడ్డారని న్యాయస్థానం స్పష్టం చేసింది. భారీగా ప్రజల ప్రాణాలు తీసి దేశంలో అలజడి సృష్టించేందుకు కుట్ర పన్నారనేందుకు తగిన ఆధారాలున్నాయని తెలిపింది.

శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలన్న లక్ష్యంతో కుట్రపూరితంగా వ్యవహరించారనేందుకు సైతం ప్రాసిక్యూషన్‌ తగిన ఆధారాలను చూపగలిగిందని స్పష్టం చేసింది. దోషులు అత్యంత హేయమని చర్యలకు పాల్పడ్డారని, అందువల్ల ఈ కేసును అత్యంత అరుదైన కేసుగా భావిస్తూ దోషులిద్దరికీ ఉరిశిక్ష విధిస్తున్నట్లు తెలిపింది. దర్యాప్తు సంస్థ తమను ఈ కేసులో ఉద్దేశపూర్వకంగా ఇరికించిందన్న దోషుల వాదనకు ఆధారాలు లేవని తేల్చింది. అలాగే ఈ దోషులకు ఢిల్లీలో ఆశ్రయం కల్పించిన తారీఖ్‌ అంజూమ్‌ ఎహసాన్‌ను సైతం దోషిగా నిర్ధారిస్తున్నట్లు తెలిపింది. ఇందుకు అతనికి జీవిత ఖైదు విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. నిర్ధోషులుగా తేల్చిన షాదిక్‌ ఇష్రార్‌ షేక్, ఫరూక్‌ షర్ఫూద్దీన్‌ తర్ఖాష్‌కు బాంబు పేలుళ్లతో సంబంధం ఉందని నిరూపించడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైందని తెలిపింది. ఈ మేరకు రెండో అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి టి.శ్రీనివాసరావు సోమవారం సాయంత్రం సంచలన తీర్పు వెలువరించారు.

ఈ కేసులో నిందితులుగా ఉన్న రియాజ్‌ బత్కల్, ఇక్బాల్‌ బత్కల్, అమీర్‌ రజాఖాన్‌ పరారీలో ఉన్నారు. ఈ ముగ్గురిపై ఉన్న కేసును విడగొట్టి మిగిలిన వారిపై న్యాయస్థానం విచారణ జరిపి ఈ తీర్పు వెలువరించింది. ఘటన జరిగిన 11 ఏళ్ల తరువాత కేసులో తీర్పు వెలువడటం విశేషం. తీర్పు నేపథ్యంలో చర్లపల్లి జైలు పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. అలాగే తీర్పు వెలువరించిన జడ్జి శ్రీనివాసరావు ఇంటి పరిసర ప్రాంతాల్లో కూడా మఫ్టీలో పోలీసులను ఏర్పాటు చేశారు. కాగా కోర్టు తీర్పుపై హైకోర్టుకు అప్పీలుకు వెళ్తామని నిందితుల తరుఫు న్యాయవాది గందం గురుమూర్తి పేర్కొన్నారు.  

ఉరిశిక్షపై హైకోర్టు నిర్ణయం...
అనీక్, ఇస్మాయిల్‌ చౌదరిలకు విధించిన ఉరిశిక్షను హైకోర్టు ఖరారు చేయాల్సి ఉంటుంది. కింది కోర్టు తీర్పును హైకోర్టు ఖరారు చేసేంత వరకు ఉరిశిక్ష అమలుకు అవకాశమే లేదు. ఉరిశిక్ష తీర్పు వెలువరించిన జడ్జి తానిచ్చిన తీర్పుతో పాటు ఈ కేసుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను హైకోర్టుకు పంపుతారు. ఉరిశిక్ష వ్యవహారాల్లో తన ముందుకు వచ్చిన కేసులపై హైకోర్టు విచారణ జరుపుతుంది. దీనిని రెఫర్‌ ట్రయిల్‌ అంటారు. అలాగే కింది కోర్టు తీర్పుపై దోషులు హైకోర్టును ఆశ్రయించవచ్చు. రెఫర్‌ ట్రయిల్‌తో పాటు దోషులు దాఖలు చేసే అప్పీళ్లపై హైకోర్టు ఏక కాలంలో విచారణ జరుపుతుంది.  

తెలిసి చేయలేదు.. రోబోల్లా పనిచేశారు...
శిక్ష ఖరారుకు ముందు అనీక్, ఇస్మాయిల్‌ చౌదరిల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. వీరిద్దరూ తెలిసి బాంబు పేలుళ్లకు పాల్పడలేదని, రోబోల్లా తమకు అప్పగించిన పనిని పూర్తి చేశారని వివరించారు. ఉద్దేశపూర్వకంగా వ్యవహరించలేదన్నారు. అయితే ఈ వాదనను జడ్జి తోసిపుచ్చారు. ఈ వాదన ద్వారా దోషులు తమ నేరాన్ని అంగీకరించినట్లయిందన్నారు. దోషులిద్దరూ రోబోలైతే, వారిని ఎవరు నడిపించారో వారి వివరాలిస్తే సరిపోతుందన్నారు. అనంతరం దోషులు కూడా వ్యక్తిగతంగా తమ వాదనను కోర్టు ముందుంచారు. పోలీసులు తప్పుడు కేసులో ఇరికించారని అనీక్‌ తెలిపాడు. పేలుళ్లతో తనకు ఏ మాత్రం సంబంధం లేదన్నాడు. ఇస్మాయిల్‌ చౌదరి స్పందిస్తూ.. తనకు భార్య, బిడ్డలు ఉన్నారని, తన తల్లి కేన్సర్‌తో బాధపడుతోందని తెలిపాడు. వారి బాగోగులు చూడాల్సిన బాధ్యత తనపై ఉందని నివేదించాడు. గత పదేళ్లుగా జైలులో ఉన్నానని, ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని తనపై కరుణ చూపాలని కోర్టును అభ్యర్థించాడు.

వీరి వల్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయి...
అంతకు ముందు ప్రాసిక్యూషన్‌ తరఫున స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కె.సురేంద్ర వాదనలు వినిపిస్తూ, దోషుల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలిపారు. 44 కుటుంబాలు విచ్ఛినమయ్యాయన్నారు. బాంబు పేలుళ్ల వల్ల గాయపడిన వారు ఇప్పటికీ కోలుకోలేదని, బాధను అనుభవిస్తూనే ఉన్నారన్నారు. శిక్ష నుంచి తప్పించుకునేందుకు దోషులు కట్టుకథలు చెబుతున్నారని, వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని వివరించారు. ఒకరిని హత్య చేస్తేనే న్యాయస్థానాలు ఉరిశిక్ష విధిస్తున్నాయని, 44 మందిని పొట్టనపెట్టుకున్న దోషులకూ అదే సరైన శిక్షని ఆయన విన్నవించారు.

ఇదీ జరిగింది...
2007, డిసెంబర్‌ 25న లుంబనీ పార్క్, గోకుల్‌ చాట్‌లలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. పేల్చేందుకు దిల్‌సుఖ్‌నగర్‌ ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి వద్ద పెట్టిన బాంబును పోలీసులు నిర్వీర్యం చేశారు. లుంబినీ పార్క్‌ పేలుడులో 12 మంది మరణించగా, 21 మంది గాయపడ్డారు. గోకుల్‌చాట్‌లో జరిగిన పేలుళ్లలో 32 మంది మృతి చెందగా, 47 మంది గాయాలపాలయ్యారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసుల్లో కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు 1,195 పేజీల చార్జిషీట్‌ను దాఖలు చేశారు. నిందితులకు సహాయ సహకారాలు అందించిన తారీఖ్‌ అంజూమ్‌ ఎహసాన్‌ పాత్రపై అనుబంధ చార్జిషీట్‌ దాఖలు చేశారు. లుంబినీపార్క్‌ కేసులో 98 మందిని, గోకుల్‌చాట్‌ కేసులో 147 మంది, దిల్‌సుఖ్‌నగర్‌ కేసులో 46 మందిని సాకు‡్ష్యలుగా చూపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement