అతని నేర చరిత్ర, కుటుంబ నేపథ్యం, జైల్లో అతని ప్రవర్తన వివరాలు కూడా..
నెల్లూరు కలెక్టర్, డీఎస్పీ, జైలు సూపరింటెండెంట్‌లకు హైకోర్టు ఆదేశం
వీటి ఆధారంగా తుది విచారణ కొనసాగిస్తామని వెల్లడి
తదుపరి విచారణ సెప్టెంబరు 6కి వాయిదా
సాక్షి, అమరావతి: నెల్లూరు నగరంలో జరిగిన తల్లీ, కుమార్తె జంట హత్యల కేసులో ఉరిశిక్ష పడి, ప్రస్తుతం నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న దోషి షేక్ ఇంతియాజ్ మానసిక పరిస్థితి, జైలులో అతని వ్యవహారశైలి, ప్రవర్తన, అతని కుటుంబ నేపథ్యం, సామాజిక–ఆర్థిక నేపథ్యం, నేర చరిత్ర, విద్య, ఆదాయ వనరులు తదితర వివరాలను సమర్పించాలని హైకోర్టు శుక్రవారం జిల్లా కలెక్టర్, డీఎస్పీ, నెల్లూరు కేంద్ర కారాగార సూపరింటెండెంట్‌లను ఆదేశించింది. ఈ వివరాల ఆధారంగా ఈ కేసులో తదుపరి విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టంచేస్తూ విచారణను సెప్టెంబరు 6కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి, జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది.
డబ్బు కోసం హత్యలు..
వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కరస్పాండెంట్ ఎ. దినకర్‌రెడ్డి హరనాథపురంలో కొత్త ఇల్లు నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన ఇంటీరియర్ పనుల బాధ్యతలను షేక్ ఇంతియాజ్‌కు అప్పగించారు. 2013, ఫిబ్రవరి 12న పనుల విషయంపై మాట్లాడే నిమిత్తం ఇంతియాజ్ దినకర్‌రెడ్డి ఇంటికి వచ్చారు. ఈ ఇంటిని కొల్లగొట్టేందుకు ముందస్తు పథకంతో ఇంతియాజ్ తన వెంట మరో ఇద్దరిని తీసుకొచ్చాడు. ముగ్గురూ కలిసి దినకర్‌రెడ్డి సతీమణి శకుంతల, ఎంబీబీఎస్ చదువుతున్న వారి కుమార్తె భారవిలను వారి ఇంట్లోనే హతమార్చారు. అదే సమయంలో ఇంటికొచ్చిన దినకర్‌రెడ్డిపై ఇంతియాజ్ దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. బంగారు నగలు, డబ్బుతో పరారయ్యేందుకు ప్రయత్నించగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది.
ఏడేళ్ల తరువాత ఉరిశిక్ష..
సుదీర్ఘ విచారణ జరిపిన నెల్లూరు 8వ అదనపు సెషన్స్ కోర్టు కమ్ మహిళలపై అఘాయిత్యాల ప్రత్యేక న్యాయస్థానం 2020 ఫిబ్రవరి 6న ఇంతియాజ్‌కు ఉరిశిక్ష విధించింది. మిగిలిన ఇద్దరు నిందితులు మైనర్లు కావడంతో వారికి మూడేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఉరిశిక్ష ఖరారు విషయంలో తగిన నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థిస్తూ సెషన్స్ కోర్టు 2020లో హైకోర్టుకు లేఖ రాసింది. దీంతో ఈ లేఖను రెఫర్డ్ ట్రయల్‌గా పరిగణించిన హైకోర్టు దానికి నెంబర్ కేటాయించింది. ఇదే సమయంలో ఉరిశిక్షను సవాలు చేస్తూ ఇంతియాజ్ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు.
వీటిపై హైకోర్టు విచారణ జరుపుతూ వచ్చింది. తాజాగా.. శుక్రవారం జస్టిస్ శ్రీనివాసరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం తుది విచారణ మొదలుపెట్టింది. ఈ సందర్భంగా ఇంతియాజ్ తరఫు న్యాయవాది వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ, 2022లో సుప్రీంకోర్టు మనోజ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కేసులో ఇచ్చిన తీర్పును ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
ఉరిశిక్ష విధించే ముందు శిక్ష తీవ్రత తగ్గించేందుకు అవకాశమున్న పరిస్థితులను కింది కోర్టు తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టంగా చెప్పిందని చెబుతూ సుప్రీం’ తీర్పులను ధర్మాసనం ముందుంచారు. వీటిని పరిశీలించిన ధర్మాసనం.. వీరారెడ్డి వాదనతో ఏకీభవించి ఇంతియాజ్ వయస్సు, మానసిక స్థితి, జైల్లో అతని ప్రవర్తన, కుటుంబ నేపథ్యం వంటి వివరాలు తెలుసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపింది. తదుపరి విచారణను సెప్టెంబరు 6కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment