![- - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/28/655.jpg.webp?itok=aPFfMtfF)
హైదరాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌కు అనుబంధంగా ఏర్పడిన ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఖొరాసన్ ప్రావెన్సీలో (ఐఎస్‌కేపీ) కీలక పాత్ర పోషించిన సూరత్ మహిళ సుమేరా బాను మాలిక్ హైదరాబాద్‌లో అడ్డా ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించిందా? అనే ప్రశ్నకు సమాధానం అవుననే అంటున్నాయి గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) వర్గాలు. మంగళవారం నగరానికి వచ్చిన ప్రత్యేక బృందం సదరు వ్యాపారి నుంచి వాంగ్మూలం నమోదు చేసుకువెళ్లింది.
ఆన్‌లైన్ ద్వారా ప్రేరణ పొంది..
► సూరత్‌కు చెందిన సుమేరా బాను ఆన్‌లైన్ ద్వారా ప్రేరణ పొంది ఐఎస్‌కేపీలో చేరింది. విదేశాల్లో ఉన్న అబు హంజాలా అనే ఉగ్రవాది ఈమెకు హ్యాండ్లర్‌గా వ్యవహరించారు. టెలిగ్రామ్ సహా వివిధ సోషల్‌మీడియా గ్రూపుల ద్వారా అతడితో సంప్రదింపులు జరిపింది. ఉత్తరాదిలోని అనేక ప్రాంతాల్లో విధ్వంసాలు పథక రచన చేసిన సుమేరా శ్రీనగర్‌కు చెందిన నలుగురితో ముఠా కట్టింది. వీళ్లు కూడా అబు హంజాలా ద్వారానే ఈమెకు పరిచయం అయ్యారు.
వీరిలో ఉబేద్ నాసిర్ మీర్, హనన్ హయత్ సోల్, మహ్మద్ హాజిం షాలను ఇటీవల గుజరాత్‌లోని పోర్‌బందర్‌కు పిలిపించింది. అక్కడి ఓ హోటల్‌లో బస చేసిన సుమేరా సహా నలుగురూ విధ్వంసాలపై కుట్రలు చేశారు. దీనిపై సమాచారం అందుకున్న ఏటీఎస్ అధికారులు ఈ నెల 9న దాడి చేసి నలుగురినీ అరెస్టు చేశారు. వీరి విచారణలో శ్రీనగర్‌కు చెందిన జుబేర్ అహ్మద్ మున్షీ కూడా ముఠా సభ్యుడని తేలడంతో రెండు రోజుల క్రితం అతడినీ అరెస్టు చేశారు. కోర్టు అనుమతితో సుమేరాను అహ్మదాబాద్ ఏటీఎస్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు.
► ఈ నేపథ్యంలోనే తాను హైదరాబాద్‌లో మకాం ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. కాలాపత్తర్ ప్రాంతానికి చెందిన ఓ మెడికల్ షాపు యజమానితో ఈమెకు సోషల్ మీడియా ద్వారా పరిచయమైంది. కొన్నాళ్లు అతడితో సంప్రదింపులు జరిపిన సుమేరా తనకు హైదరాబాద్‌లో టీచర్ ఉద్యోగం కావాలని కోరింది. దాని కోసమే కాలాపత్తర్ వ్యాపారితో అనేకసార్లు ఫోనులోనూ మాట్లాడింది. సాంకేతికంగానూ ఈ విషయం నిర్థారించిన ఏటీఎస్ అధికారులు మంగళవారం నగరానికి చేరుకున్నారు.
కాలాపత్తర్‌లోని సదరు వ్యాపారి ఇంటికి వెళ్లి వాంగ్మూలం నమోదు చేశారు. అహ్మదాబాద్‌లో నమోదైన సుమేరా కేసులో ఇతడిని సాక్షిగా పరిగణిస్తున్నారు. భర్త నుంచి 2021లో వేరైన ఆమెకు ఇద్దరు సంతానం ఉన్నట్లు సమాచారం. మరోపక్క సుమేరా హైదరాబాద్‌కు ఎందుకు రావాలని భావించింది? ఇక్కడ మకాం ఏర్పాటు చేసుకుని ఏం చేయాలని పథకం వేసింది? నగరంలో ఇంకా ఎవరినైనా ఐఎస్‌కేపీ వైపు మళ్లించిందా? ఎవరితోనైనాసంప్రదింపులు జరిపిందా? ఇతర అంశాలపై రాష్ట్ర నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి.
ప్రస్తుతం అహ్మదాబాద్ ఏటీఎస్ కస్టడీలో ఉన్న సుమేరాను విచారించడానికి ప్రత్యేక బృందం అక్కడకు వెళ్లాలని నిర్ణయించింది. సుమేరా బాను సోషల్ మీడియా ద్వారా గోల్కొండ ప్రాంతానికి చెందిన ఓ తండ్రి, కూతురితో సంప్రదింపులు జరిపింది. మంగళవారం వీరిద్దరూ కరీంనగర్‌లో ఓ శుభ కార్యానికి వెళ్లిన విషయం తెలిసి అక్కడికి ఏటీఎస్ బృందం వెళ్లి వారి వాంగ్మూలాలను నమోదు చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment