సాక్షి, చెన్నై: దుబాయ్ నుంచి వచ్చిన ప్రత్యేక విమానంలో ఓ యువకుడి చర్యలు అనుమానాలకు దారి తీశాయి. నిషేధిత తీవ్ర వాద సంస్థ ఐసీస్‌లో శిక్షణ పొంది చెన్నైకు వచ్చినట్టుగా వచ్చిన సమాచారం కలకలం రేపింది. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇటీవల కాలంగా రాష్ట్రంలో నిషేధిత తీవ్రవాద సంస్థల కార్యకలాపాలు తరచూ వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. శ్రీలంకలో గతంలో సాగిన పేలుళ్ల తదుపరి తరచూ కేరళ నుంచి ఎన్‌ఐఏ వర్గాలు రాష్ట్రంలోకి రావడం, అనుమానితులు, నిషేధిత సంస్థల సానుభూతి పరులను పట్టుకెళ్లడం జరుగుతోంది. ఈ పరిణామాలతో సముద్ర తీరాల్లో, విమానాశ్రయాల్లో ప్రత్యేక నిఘా ఉంచారు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి దుబాయ్ నుంచి చెన్నైకు వచ్చిన ఓ విమానంలో 31 ఏళ్ల యువకుడిపై అధికారుల దృష్టి పడింది. అతడి పాస్‌పోర్టు, వీసాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఒమన్‌కు ఎందుకు వెళ్లినట్టో..
ఏడాదిన్నర క్రితం ఉద్యోగ రీత్యా ఆ యువకుడు దుబాయ్ వెళ్లినట్టు గుర్తించారు. గత ఏడాది కరోనా సమయంలో ఇతడు దుబాయ్ నుంచి తిరిగి రాలేదు. అదే సమయంలో ఆరు నెలలు ఒమన్‌లో ఉండడం అనుమానాలకు దారి తీసింది. నిషేధిత ఐఎస్‌ఐఎస్ తీవ్రవాద సంస్థ కార్యకలాపాలకు కేంద్రంగా ఒమన్ మారి ఉండడంతో ఆ దేశంపై భారత్ నిషేధం విధించింది. ఇక్కడకు తమిళనాడు నుంచి ఇప్పటికే పలువురు యువకులు సరిహద్దులు దాటి వెళ్లినట్టు ఎన్‌ఐఏ విచారణలో తేలింది. ఈ పరిస్థితుల్లో ఈ యువకుడు ఒమన్‌కు వెళ్లిరావడం అనుమానాలకు బలం చేకూరినట్టు అయింది.
ఆ యువకుడు పెరంబలూరుకు చెందిన వ్యక్తి కావడంతో అక్కడి ఎస్పీకి సమాచారం ఇచ్చారు. అతడి కుటుంబం నేపథ్యం గురించి విచారిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎన్‌ఐఏ వర్గాలు సైతం యువకుడిని విచారించారు. దుబాయ్‌లో ఉద్యోగం నచ్చక, ఒమన్‌కు వెళ్లి పనిచేసినట్టుగా ఆ యువకుడు పేర్కొంటున్నాడు. అందులో వాస్తవాలు లేవని భావించిన అధికారులు చెన్నై సెంట్రల్ క్రైం బ్రాంచ్ కార్యాలయానికి తీసుకెళ్లి విచారించే పనిలో పడ్డారు. యువకుడు పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో అతడికి మరెవరితోనైనా సంబంధాలు ఉన్నాయా..? లేదా, అతడితో పాటుగా పెరంబలూరు నుంచి దుబాయ్‌కు వెళ్లిన వారి వివరాలను సేకరించి, విచారణను ముమ్మరం చేశారు.
చదవండి:
హఠాత్తుగా గోనెసంచిలో నుంచి లేచి..
ఇండియా బుక్‌లోకి ‘ఎన్నికల వీరుడు’
Comments
Please login to add a commentAdd a comment