ఐఎం చీఫ్ అక్తర్ అరెస్ట్
నేపాల్ సరిహద్దుల్లో అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
రోజుల వ్యవధిలోనే మరో ముందడుగు
న్యూఢిల్లీ: దేశంలో గత కొన్నేళ్లుగా వరుస బాంబు పేలుళ్లతో వందల సంఖ్యలో అమాయక పౌరుల ప్రాణాలను బలితీసుకున్న ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్(ఐఎం)కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ సంస్థకు నాయకత్వం వహిస్తున్న తెహ్‌సీన్ అక్తర్(23) అలియాస్ మోను ఢిల్లీ స్పెషల్‌సెల్ పోలీసులకు పట్టుబడ్డాడు. పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో... భారత్-నేపాల్ సరిహద్దుల్లో కాకరవత్త వద్ద తెహ్‌సీన్‌ను అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ స్పెషల్‌సెల్ పోలీస్ ప్రత్యేక కమిషనర్ శ్రీవాత్సవ మంగళవారం ఇక్కడ మీడియాకు వెల్లడించారు. పాకిస్థాన్ కేంద్రంగా ఐఎంకు బాస్‌లుగా వ్యవహరిస్తున్న ఇక్బాల్ భత్కల్, రియాజ్ భత్కల్‌కు తెహ్‌సీన్ సన్నిహితుడని చెప్పారు.
నేపాల్ నుంచి భారత్‌లోకి ప్రవేశిస్తుండగా... మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అయితే, వకాస్ అరెస్ట్ విషయం తెలుసుకుని బంగ్లాదేశ్‌కు పారిపోయే క్రమంలో తెహ్‌సీన్ పట్టుబడినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. అతడిని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకొచ్చినట్లు, రానున్న రోజుల్లో మరిన్ని అరెస్ట్‌లు జరిగే అవకాశాలున్నట్లు వెల్లడించాయి.
ఐఎంకు చెందిన కీలక ఉగ్రవాది, జియా ఉర్ రెహ్మాన్ అలియాస్ వకాస్, అతని ముగ్గురు అనుచరులు రాజస్థాన్‌లో అరెస్ట్ అయిన రెండు రోజుల వ్యవధిలోనే వీరి నాయకుడూ పట్టుబడడం కీలక పరిణామం. ఐఎం సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్ అలియాస్ హద్దిలను పోలీసులు గతేడాది భారత్-నేపాల్ సరిహద్దుల్లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వకాస్, తెహ్‌సీన్ కోసం పోలీసులు నిఘా వేసి ఉంచారు. ఎట్టకేలకు వీరి అరెస్ట్‌తో ఐఎం అగ్రశ్రేణి నాయకులంతా పట్టుబడినట్లయింది. దేశంలో ఈ సంస్థ నిర్వహించిన ప్రతీ బాంబు పేలుళ్ల విధ్వంసం వెనుక వీరే ముఖ్య పాత్ర పోషించారు.
2013 ఫిబ్రవరిలో దిల్‌షుక్‌నగర్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస ఐదుగురిని నిందితులుగా పేర్కొన్న సంగతి తెలిసిందే. తెహ్‌సీన్ అరెస్ట్‌తో ఈ కేసులో ప్రధాన నిందితుడైన రియాజ్ మినహా నలుగురూ పట్టుబడ్డారు.బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన అక్తర్ బాంబుల తయారీలో నిపుణుడు. యాసిన్ అరెస్ట్ తర్వాత ఐఎం నాయకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు.