సాక్షి, హైదరాబాద్: నిషిద్ధ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉండి, దేశంలోని ప్రధాన నగరాల్లో విధ్వంసాలకు కుట్రపన్నిన కేసులో అరెస్టు అయిన పాతబస్తీ వాసి ఒబేదుర్ రెహ్మాన్‌కు ఢిల్లీ కోర్టు గత బుధవారం పదేళ్ల జైలు శిక్ష విధించింది.
ఈ శిక్షా కాలం రిమాండ్ పీరియడ్‌లోనే పూర్తి కావడంతో ఆ మర్నాడే ఢిల్లీలోని తీహార్ జైలు నుంచి విడుదలయ్యాడు. ఇతడిపై బెంగళూరు సీసీబీ పోలీసులు నమోదు చేసిన మరో కేసులోనూ ఇప్పటికే శిక్షపడటం, రిమాండ్‌లోనే అదీ పూర్తవడం జరిగాయి. ఒబేదుర్ రెహ్మాన్ గత శుక్రవారం సిటీకి చేరుకున్నాడు.
తొలి కేసు బెంగళూరులో నమోదు...
పాతబస్తీలోని చంద్రాయణగుట్ట గుల్షన్ ఇక్బాల్ కాలనీకి చెందిన ఒబేదుర్ రెహ్మాన్ డిగ్రీ చదువుతుండగానే ఉగ్రవాద బాటపట్టాడు. ఉగ్రవాద సంస్థ హుజీలో కీలకపాత్ర పోషించాడు. బెంగళూరులో ఉన్న బీజేపీ నాయకులను, ప్రముఖులను హతమార్చడానికి ఈ మాడ్యుల్‌కు చెందిన ఉగ్రవాదులు 2012లో రంగంలోకి దిగారు.
ఈ విషయం గుర్తించిన కేంద్ర నిఘా వర్గాలు బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హైదరాబాద్‌లో ఒబేద్‌తో పాటు నాందేడ్, బెంగళూరు, హుబ్లీలకు చెందిన 11 మందినీ అరెస్టు చేశారు. వీళ్లు జైల్లో ఉండగానే ఐఎం నేతృత్వంలో సాగిన మరో కుట్ర వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్, ఢిల్లీల్లో పేలుళ్ళకు కుట్ర పన్నడంతో అదే ఏడాది ఢిల్లీ ఎన్‌ఐఏ యూనిట్ మరో కేసు నమోదు చేసింది. ఒబేద్ సహా మరికొందరికి బెంగళూరు జైలు నుంచి 2013లో తీహార్ జైలుకు తరలించింది.
జైల్లో ఉండగానే రెండు ‘శిక్షలు’ పూర్తి...
ఈ రెండు కేసులకు సంబంధించి ఒబేద్ సహా మరికొందరు ఉగ్రవాదులు 2012 నుంచి జైల్లో రిమాండ్ ఖైదీలుగానే ఉన్నారు. బెంగళూరు కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళు న్యాయస్థానంలో నేరం అంగీకరించారు. దీంతో కోర్టు వీరిని దోషులుగా తేలుస్తూ ఆరేళ్ళ శిక్ష విధించింది. అప్పటికే వీళ్ళు అంతకంటే ఎక్కువే జైలులో ఉండటంతో ఆ కాలాన్ని కోర్టు శిక్షగా పరిగణించింది.
ఢిల్లీలో నమోదైన కేసు విచారణ పూర్తి కావడంతో ఈ నెల 7న ఒబేద్ సహా నలుగురిని దోషులుగా తేల్చిన కోర్టు బుధవారం పదేళ్ళ జైలు విధిస్తూ తీర్పు చెప్పింది. అయితే ఈ ఉగ్రవాదులు అంతకంటే ఎక్కువ రోజులే జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉండటంతో శిక్షాకాలం పూర్తయింది. దీంతో ఒబేద్ తదితరులు పదేళ్ల శిక్షపడిన మరుసటి రోజైన గురువారమే తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు.
ఇదే కేసులో భత్కల్ తదితరులు...
ఢిల్లీ ఎన్‌ఐఏ యూనిట్ నమోదు చేసిన ఈ కేసులో హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్–లుంబినీపార్క్ ట్విన్ బ్లాస్ట్, దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ళకు బాధ్యులైన వాళ్ళూ నిందితులుగా ఉన్నారు. ఐఎం ఉగ్రవాదులైన రియాజ్ భత్కల్, యాసీన్ భత్కల్, అసదుల్లా అక్తర్, తెహసీన్ అక్తర్, జియా ఉర్ రెహ్మాన్ అలియాస్ హడ్డీపై విచారణ జరగాల్సి ఉంది.
వీరిలో రియాజ్ మినహా మిగిలిన వాళ్ళు అరెస్టు కావడం, నగరంలో జరిగిన బాంబు పేలుళ్ళ కేసుల్లో శిక్షలు పడటం కూడా జరిగింది. ఐఎం కో–ఫౌండర్స్ రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ ఆదేశాల మేరకు మిగిలిన ఉగ్రవాదులు ఢిల్లీ, హైదరాబాద్‌ల్లో మానవబాంబులతో మారణహోమం సృష్టించడానికి కుట్రపన్నారని ఎన్‌ఐఏ గుర్తించింది.
Comments
Please login to add a commentAdd a comment