జేమ్స్‌బాండ్ @ 2200 కోట్లు | Spectre is the longest James Bond film | Sakshi
Sakshi News home page

జేమ్స్‌బాండ్ @ 2200 కోట్లు

Published Fri, Oct 30 2015 10:56 PM | Last Updated on Fri, Nov 9 2018 6:16 PM

జేమ్స్‌బాండ్ @ 2200 కోట్లు - Sakshi

జేమ్స్‌బాండ్ @ 2200 కోట్లు

ప్రపంచమంతా తెలిసిన సూపర్‌స్టార్ జేమ్స్‌బాండ్... అతనికి క్లాసూ, మాసూ తేడా తెలీదు... కుల, మత, ప్రాంతీయ భాషా భేదాలు అస్సలుండవ్... తెలిసిందల్లా తన అడ్వెంచర్స్‌తో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయడం... ఈ అంతర్జాతీయ గూఢాచారి ఈసారి ‘స్పెక్టర్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు... జస్ట్ ఫైవ్ డేస్ మాత్రమే వెయింటింగ్... రెండు వేల రెండువందల కోట్ల రూపాయల బడ్జెట్‌లో రూపొందిన ‘స్పెక్టర్’ గురించి స్పెషల్...
 
1962 నుంచి జేమ్స్ బాండ్  ప్రపంచ సినీ అభిమానులకు ఓ వ్యసనంలా తయారయ్యాడు. వచ్చే నెల 5న  విడుదల కానున్న ‘స్పెక్టర్’ ఈ సిరీస్‌లో 24వ సినిమా. ట్రైలర్స్ నుంచే ఈ సినిమా సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. గత చిత్రాలతో పోలిస్తే ‘స్పెక్టర్’లో అంతకుమించిన యాక్షన్ ఉంటుందని అర్థమవుతోంది.  జేమ్స్‌బాండ్‌గా డానియల్ క్రెగ్‌కి ఇది నాలుగో సినిమా!  ‘ స్కైఫాల్’ని తెరకెక్కించిన శామ్ మెండస్ ‘స్పెక్టర్’నూ తీశాడు..
 
ఆ అమ్మాయి కోసం
చీకటి సామ్రాజ్యంలో తన అక్రమాలను సాగిస్తూ, ప్రపంచానికి పెనుముప్పులా మారిన స్పెక్టర్ అనే ఉగ్రవాద సంస్థ అంతు చూసే క్రమంలో జేమ్స్‌బాండ్ ఓ అమ్మాయిని కాపాడాల్సి వస్తుంది. తర్వాత ఏమైంది? అసలా అమ్మాయి ఎవరు? ఆమెను విలన్లు ఎందుకు వెంటాడుతున్నారనేదే మిగతా కథ.
 
‘స్పెక్టర్’ కోసం కేసు
1962లో వచ్చిన ‘డాక్టర్ నో’, 1965లో వచ్చిన  ‘థండర్‌బాల్’ చిత్రాలలో ‘స్పెక్టర్’ ఓ ఉగ్రవాద సంస్థగా కనిపిస్తుంది.  50 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ చిత్రంలో  కనిపిస్తుంది. అసలు ‘స్పెక్టర్’ యాక్టివిటీ గురించి కెవీ మెక్లోరి అనే స్క్రిప్ట్ రైటర్ తన సినిమా కోసం రాసుకున్నారు. దాన్నే  ఇయాన్ ఫ్లెమింగ్  లీగల్ రైట్స్ ఏవీ తీసుకోకుండా ‘థండర్‌బాల్’లో  వాడుకున్నారు. అప్పటి నుంచి ఇయాన్ ఫ్లెమింగ్, మెక్లోరీల మధ్య కేసు నడుస్తూనే ఉంది. 2013లో  హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మెట్రో గోల్డెన్ మేయర్.. మెక్లోరీతో ఓ ఒప్పందం కుదుర్చుకొని స్పెక్టర్‌కు సంబంధించిన పూర్తి హక్కులను చేజిక్కించుకుంది.
 
ఓల్డ్ లేడీతో రొమాన్స్
‘స్పెక్టర్’లో జేమ్స్‌బాండ్ 51 ఏళ్ల లేడీతో రొమాన్స్ చేస్తాడు. ఇలా నడివయసు స్త్రీతో జేమ్స్‌బాండ్ ప్రేమ నడపడం బాండ్ సిరీస్ హిస్టరీలోనే ఫస్ట్‌టైమ్. 51 ఏళ్ల ఓల్డ్‌లేడీ పాత్రను  మోనికా బెలూసి పోషించగా, బాండ్ గర్ల్‌గా  లియా సీదూ నటించారు.
 
ఖరీదైన కార్ల విధ్వంసం
మెక్సికో, ఇటలీ, బ్రిటన్, ఆస్ట్రియా, మొరాకో, రష్యా దేశాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంది.   చేజింగ్ సీక్వెన్సెస్ కోసం అత్యంత ఖరీదైన 10 ఆస్టిన్ మార్టిన్ కార్లను వాడారు. ఆస్టిన్ మార్టిన్ సంస్థ  డీబీ10 అనే స్పోర్ట్స్ కారును ఈ చిత్రం కోసమే ప్రత్యేకంగా తయారు చేయించింది. సినిమాలో 7 కార్లను  ధ్వంసం చేశారట. కార్ల కోసం ఆస్టిన్ సంస్థ ఖర్చుపెట్టింది  240 కోట్ల రూపాయలు.

సినిమాలో వాటి విధ్వంసం కోసం అయిన ఖర్చు 54 కోట్లు. తయారీ, విధ్వంసం కోసం పెట్టిన మొత్తం ఖర్చు 294 కోట్ల రూపాయలు. రోమ్‌లో చిత్రీకరించిన ఓ యాక్షన్ సన్నివేశం కోసం అక్కడ ఉన్న కొన్ని చారిత్రక కట్టడాలు కూడా దెబ్బతినడంతో స్థానికుల నుంచి  తీవ్ర నిరసన వ్యక్తమైందట. అలాగే మెక్సికోలో బాంబుపేలుడు సన్నివేశం చిత్రీకరణ కోసం ఓ పాత కట్టడాన్ని కూల్చేశారట.
 
మెక్సికోతో రహస్య ఒప్పందం?
ఈ సినిమా ప్రధానంగా మెక్సికో నగరం చుట్టూ సాగుతుంది. ఇప్పటికే డ్రగ్ మాఫియా మచ్చను మోస్తున్న మెక్సికో.. మరింత అపఖ్యాతిని మూటగట్టుకోకుండా ఉండేలా  ఈ స్క్రిప్ట్‌లో మార్పులు చేయమని చిత్రబృందంతో రహస్య ఒప్పందం కుదుర్చుకుందట. దీనికి బదులుగా ఈ సినిమా విడుదల సమయంలో భారీగా పన్ను రాయితీలు కల్పించిందని సమాచారం. అందుకే  విలన్‌ను మొదట మెక్సికో జాతీయుడిగా చూపిద్దామనుకున్నా, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో చిత్ర బృందం విలన్ పాత్రలో మార్పులు, చేర్పులు చేసిందని టాక్.
 
లండన్ రాజకుటుంబంతో ‘బాండ్’
అది లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్. అభిమానులందరూ ఆ  హాల్ చుట్టూ  గూమిగూడారు. తమకెంతో  ఇష్టమైన తారల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.  కారులోంచి బ్లాక్ సూట్‌లో ఓ వ్యక్తి  స్టయిలిష్‌గా దిగారు. పక్కనే అందాల రాశులు.  వారి  ఎంట్రీతో ఆ హాలు మొత్తం అరుపులతో మోతమోగిపోయింది. ఫొటోలకు  ఓపిగ్గా పోజులు ఇస్తూ, అభిమానులతో సెల్ఫీలు కూడా దిగారు. ఇంతకీ వీళ్లెవరా అనుకుంటున్నారా? అతనే... బాండ్... జేమ్స్‌బాండ్ పాత్రధారి డానియల్ క్రెగ్, కథానాయికలు మోనికా బెలూసీ, లీయా సీదు.  

23 ఏళ్ల బాండ్ చరిత్రలో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన బాండ్ సిరీస్‌లోని తాజా చిత్రం ‘స్పెక్టర్’ ప్రీమియర్ వేడుకలో కనిపించిన దృశ్యాలివి. లండన్ రాజకుటుంబం కోసం ప్రత్యేకంగా ప్రదర్శించిన ఈ షో తారల తళుకులతో కళకళలాడింది.  రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ విలియమ్స్, కేట్ మిడిల్‌టన్ ముఖ్య అతిథులుగా ఈ ప్రీమియర్‌లో పాల్గొని ‘స్పెక్టర్’ చిత్ర బృందంతో కాసేపు ముచ్చటించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement