కలకలం రేపుతున్న యాసిన్ భత్కల్
తాజాగా మరోసారి లేఖ విసిరిన యాసిన్
హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఇండియన్ ముజాహిద్దీన్(ఐఎం) ఉగ్రవాద సంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్‌భత్కల్ కలకలం రేపుతున్నాడు. బాంబు పేలుళ్ల కేసులో ట్రయల్స్ నిమిత్తం జాతీయ దర్యాప్తు సంస్థ న్యాయస్థానానికి హాజరైనప్పుడల్లా ఏదో ఒకరకమైన చర్యలతో పోలీసులను పరుగులు పెట్టిస్తున్నాడు. తాజాగా మంగళవారం కోర్టు విచారణకు హాజరైన భత్కల్ ఒక లేఖను విసిరేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈసారి విసిరిన లేఖలో తనకు జైల్లో తగిన సదుపాయాలు కల్పించాలని న్యాయమూర్తిని కోరిన ట్లు సమాచారం.
ఇప్పటికే భత్కల్ పరారీకి పలు ఉగ్రవాద సంస్థలు కుట్ర చేస్తున్నాయనే ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకున్నారు. ఈ నెల 6న కోర్టుకు వచ్చినప్పుడు కూడా ఒక లేఖ విసిరేశాడు. తనకు తగిన భద్రత కల్పించాలని అందులో విన్నవించాడు. రెండోసారి పువ్వును ప్రదర్శించిన అతడు తాజాగా మరోసారి లేఖ విసిరేశాడు. అయితే భత్కల్ ఇలాంటి చర్యలు ఎందుకు చేస్తున్నాడనే దానిపై పోలీసులు, నిఘా వర్గాలు లోతుగా ఆరా తీస్తున్నాయి.