ఒబామాపై అమెరికాలో కేసు
త్వరలోనే పదవి నుంచి దిగిపోబోతున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై కేసు నమోదైంది. అవును.. ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టులపై పోరాడుతున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు అమెరికా పార్లమెంటు నుంచి చట్టపరమైన అనుమతి లేదని ఆరోపిస్తూ 28 ఏళ్ల అమెరికా సైనికాధికారి ఒకరు ఆయనపై కేసు పెట్టారు. ఇస్లామిక్ స్టేట్‌పై పోరాటాన్ని తాను కూడా గట్టిగా సమర్థిస్తున్నానని, అయితే అందుకు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలనేది తన అభిమతమని, ఇస్లామిక్ స్టేట్‌పై పోరాడేందుకు అమెరికా సైన్యాన్ని ఒబామా పంపించారని, అందుకు అమెరికా కాంగ్రెస్ నుంచి చట్టపరమైన అనుమతి లేదన్నది తన వాదనని కువైట్ స్థావరంగా పనిచేస్తున్న అమెరికా ఇంటెలిజెన్స్ అధికారి కెప్టెన్ నాథన్ మైఖేల్ స్మిత్ తెలిపారు.
అయితే, ఇస్లామిక్ స్టేట్‌పై పోరాడాలని సైన్యాన్ని ఆదేశించేందుకు కాంగ్రెస్ నుంచి కొత్తగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదన్నది ఒబామా వాదన. 2001, సెప్టెంబర్ 11న జరిగిన టెర్రరిస్టు దాడుల నేపథ్యంలో దాడుల కుట్రదారులపై చర్యలు తీసుకునే అధికారాన్ని అమెరికా కాంగ్రెస్ తనకు కట్టబెట్టిందని, ఈ మేరకు దాడుల తర్వాత కాంగ్రెస్ ఓ తీర్మానం చేసిందని ఒబామా వాదిస్తున్నారు. ఆయన వాదనతో విభేదిస్తూ యుద్ధ అధికారాల చట్టం ప్రకారం కాంగ్రెస్ నుంచి అనుమతి తీసుకోవాల్సిందిగా ఒబామాను కోర్టు ఆదేశించాలని రాజ్యాంగంపై తాను చేసిన ప్రమాణం స్ఫూర్తితో కోరుతున్నానని కెప్టెన్ నాథన్ పేర్కొన్నారు.
2001లో జరిగిన దాడులు అల్ కాయిదా టెర్రరిస్టులకు సంబంధించినవని, సిరియా టెర్రరిస్టుల ఇస్లామిక్ స్టేట్ డిమాండ్ వేరన్నది కెప్టెన్ నాథన్ వాదనకాగా, టెర్రరిస్టులు ఎవరైనే ఒక్కటేనని, అమెరికాకు ముప్పుగా పరిగణించే టెర్రరిస్టులు ఎక్కడున్నా వారిపై సైనిక దాడులకు ఆదేశించే హక్కు తనకుందన్నది ఒబామా వాదన. ఈ రెండు వాదనలపై కోర్టు తీర్పు ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.