ఐసిస్.. అన్నంత పనీ చేస్తోందా?
తాజ్‌మహల్‌ను టార్గెట్‌గా చేసుకుని భారతదేశం మీద త్వరలోనే దాడులు చేస్తామని హెచ్చరించిన ఇస్లామిక్ స్టేట్.. (ఐసిస్) అన్నంత పని చేసేందుకు సిద్ధమవుతోందా? ఆగ్రా రైల్వే స్టేషన్ సమీపంలో సంభవించిన జంటపేలుళ్లను చూస్తే అలాగే అనిపిస్తోంది. తాజ్‌మహల్‌కు దగ్గరలోనే ఉన్న ఈ రైల్వేస్టేషన్ సమీపంలో ఒక చెత్తకుండీ దగ్గర మొదటి పేలుడు సంభవించింది. ఆ తర్వాత మరో ఇంటి వద్ద ఇంకో బాంబు పేలింది. రైల్వేట్రాక్ వద్ద ఓ బెదిరింపు లేఖ కూడా ఉంది. అయితే.. అదృష్టవశాత్తు బాంబులు అంత శక్తిమంతమైనవి కాకపోవడంతో పెద్దగా ప్రమాదం ఏమీ సంభవించలేదు. అయితే.. తమ ఉనికిని చాటుకోడానికి, లేదా తాజ్‌మహల్ సమీపంలోనికి కూడా తాము ప్రవేశించగలమని చెప్పడానికే ఇలా చేశారా అన్న అనుమానాలు పోలీసు వర్గాలకు వస్తున్నాయి.
భారతదేశం మీద త్వరలోనే దాడులు చేస్తామని ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) అనుకూల మీడియా గ్రూపు ఒకటి ఇటీవలే హెచ్చరించింది. వాళ్ల హెచ్చరికలో ఉపయోగించిన చిత్రంలో తాజ్‌మహల్‌ను టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. అహ్వాల్ ఉమ్మత్ మీడియా సెంటర్ వాళ్లు ఈ టార్గెట్ గ్రాఫిక్‌ను టెలిగ్రాం యాప్‌లో పోస్ట్ చేశారు. సైనిక యూనిఫాంలో ఉండి, తలమీద నల్లటి తలపాగా ధరించిన ఒక వ్యక్తి అసాల్ట్ రైఫిల్, రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ పట్టుకుని ఆగ్రాలోని తాజ్‌మహల్ దగ్గరలో ఉన్నట్లుగా ఆ గ్రాఫిక్‌లో ఉంది. అలాగే దీనికి ఇన్‌సెట్‌లో వాడిన మరో బొమ్మలో తాజ్‌మహల్ బొమ్మ, అక్కడ 'న్యూ టార్గెట్' అని రాసి ఉన్నట్లుగా కనపడుతోంది.
దానికి తగ్గట్లుగానే ఆగ్రా నగరంలో చిన్నపాటి పేలుళ్లు జరగడంతో ఇప్పుడు అంతా అప్రమత్తం అవుతున్నారు. నిఘా వర్గాలు ఐసిస్ హెచ్చరికలను మధ్యలోనే ట్రాక్ చేసి, వాటి విషయాన్ని బయటపెట్టినా కూడా నగరంలో భద్రత అంతంతమాత్రంగానే ఉండటం గమనార్హం. ఆగ్రా లాంటి ప్రాంతాల్లో పర్యాటకుల సందడి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి చోట్ల ఏమైనా జరగరానిది జరిగితే ప్రాణనష్టం ఎక్కువగా ఉండటంతో పాటు విదేశాల్లో కూడా భారతదేశ పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లుతుంది. ఈ నేపథ్యంలో మరింత అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది.