భారతదేశం మీద త్వరలోనే దాడులు చేస్తామని ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) అనుకూల మీడియా గ్రూపు ఒకటి హెచ్చరించింది. వాళ్ల హెచ్చరికలో ఉపయోగించిన చిత్రంలో తాజ్‌మహల్‌ను టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. అహ్వాల్ ఉమ్మత్ మీడియా సెంటర్ వాళ్లు ఈ టార్గెట్ గ్రాఫిక్‌ను టెలిగ్రాం యాప్‌లో పోస్ట్ చేశారు. ఇది కేవలం కొంతమందికి మాత్రమే వెళ్లిందని, పూర్తి ఎన్‌క్రిప్టెడ్ పద్ధతిలో వెళ్లిందని అంటున్నారు. అయినా, జీహాదీల కార్యకలాపాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండే ఇంటెలిజెన్స్ విభాగం ఒకటి దీన్ని గుర్తించింది. సైనిక యూనిఫాంలో ఉండి, తలమీద నల్లటి తలపాగా ధరించిన ఒక వ్యక్తి అసాల్ట్ రైఫిల్, రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ పట్టుకుని ఆగ్రాలోని తాజ్‌మహల్ దగ్గరలో ఉన్నట్లుగా ఆ గ్రాఫిక్‌లో ఉంది. అలాగే దీనికి ఇన్‌సెట్‌లో వాడిన మరో బొమ్మలో తాజ్‌మహల్ బొమ్మ, అక్కడ 'న్యూ టార్గెట్' అని రాసి ఉన్నట్లుగా కనపడుతోంది. ఇక్కడ ఆత్మాహుతి దాడి చేయడానికి వాళ్లు సిద్ధపడుతున్నట్లుగా కూడా అందులో రాసి ఉంది.
ఇస్లామిక్ స్టేట్ అనుకూల వర్గాలు భారతదేశం మీద దాడులు చేస్తామని బెదిరించడం ఇది మొదటిసారి ఏమీ కాదు. లక్నోలో ఉగ్రవాద నిందితుడు సైఫుల్లాను భద్రతాదళాలు ఎన్‌కౌంటర్‌లో హతమార్చినప్పుడు కూడా భారత్ మీద దాడులు చేస్తామని టెలిగ్రాం యాప్‌లో సందేశాలు వచ్చాయి. సైఫుల్లాను భారతదేశం నుంచి వచ్చిన ఖలీఫా సైనికుడిగా అందులో అభివర్ణించారు. ఇప్పటివరకు ఇస్లామిక్ స్టేట్‌లో దాదాపు 75 మంది భారతీయులు చేరినట్లు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. ఎక్కువగా మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి వెళ్తున్నారు.
ఐసిస్ టార్గెట్ తాజ్‌మహలా?
Published Thu, Mar 16 2017 7:58 PM | Last Updated on Tue, Sep 5 2017 6:16 AM
Advertisement