ప్రముఖ ఆన్‌లైన్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌ను ప్రాన్స్ నిషేధిస్తుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. సంస్థ సీఈఓ పావెల్ దురోవ్(39)ను పారిస్‌లోని లే బోర్గెట్ విమానాశ్రయంలో ఇటీవల అరెస్టు చేశారు. టెలిగ్రామ్‌పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి గతంలో ఫ్రెంచ్ అధికారులు ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. తాజాగా తనను అరెస్టు చేయడంతో ఒకవేళ ఆరోపణలు రుజువైతే స్థానికంగా ప్రాన్స్‌లో ఈ యాప్‌ను నిషేధిస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మాదకద్రవ్యాల అక్రమ రవాణా, పిల్లల లైంగిక వేధింపులు, హింసను ప్రేరేపించే కంటెంట్ టెలిగ్రామ్‌లో వ్యాపిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కానీ ఆ సమాచారం నియంత్రణకు ప్లాట్‌ఫామ్‌లో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఎక్కువయ్యాయి. దాంతో సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న దురోవ్ నియంత్రిత కంటెంట్ నిర్వహణలో విఫలమయ్యారని పారిస్ అధికారులు తెలిపారు. అయితే టెలిగ్రామ్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ప్రస్తుతం సంస్థ అనుసరిస్తున్న నియంత్రణ పద్ధతులు సమర్థంగా ఉన్నాయని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: పేరుకుపోతున్న ప్యాసింజర్ కార్లు!
ఈ వ్యవహారంపై రష్యా రాయబార కార్యాలయం స్పందిస్తూ పోలీసులు అదుపులోకి తీసుకున్న దురోవ్‌ను సంప్రదించాలంటే ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందడం లేదని తెలిపింది. ఇదిలాఉండగా, రష్యా, ఉక్రెయిన్‌తోపాటు గతంలోని సోవియట్ కూటమిలో భాగంగా ఉన్న దేశాల్లో ఈ యాప్ ప్రజాదరణ పొందింది. అయితే యూజర్ డేటాను పంచుకోవడానికి దురోవ్ నిరాకరించడంతో 2018లో రష్యా ప్రభుత్వం ఈ యాప్‌ను నిషేధించింది. ఈ నిషేధం 2021లో ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment