
ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. చైల్డ్ పోర్నోగ్రఫీ, డ్రగ్స్ అక్రమ రవాణా.. ఇతరత్రా చట్టవిరుద్ధ కార్యకలాపాల వ్యాప్తిని అరికట్టడంలో ఆయన ఘోరంగా విఫలమయ్యారని ప్యారిస్ కోర్టు ధృవీకరించింది. దీంతో ఈ వ్యవహారంలో ఆయన విచారణ ఎదురోవాల్సి ఉండనుంది.
టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్‌లో అభ్యంతరకర కార్యకలాపాలకు(నేరాలుగా పరిగణిస్తూ..) పాల్పడేందుకు ఆయన అనుమతి ఇచ్చారనే అభియోగాలు ఆయనపై నమోదయ్యాయి. అంతేకాదు.. యాప్‌లో పిల్లలపై అశ్లీల కంటెంట్ వ్యాప్తి చేశారనే అరోపణలకుగానూ అధికారులు కోరిన డాక్యుమెంట్లను సమర్పించేందుకు ఆయన నిరాకరించినట్లు ప్యారిస్ ప్రాసిక్యూటర్లు తెలిపారు. దీంతో.. కోర్టు అనుమతితో ఆయన్ని ఫ్రాన్స్ విచారణ జరపనుంది.
రష్యాలో జన్మించిన దురోవ్ ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటున్నారు. 2021 ఆగస్టులో ఈయన ఫ్రెంచ్ పౌరసత్వం తీసుకున్నారు. టెలిగ్రామ్ యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా సుమారు 90 కోట్లమంది వినియోగిస్తున్నారు. దురోవ్ అరెస్టుపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. వాక్ స్వాతంత్య్రంపై పశ్చిమ దేశాల ద్వంద్వ ప్రమాణాలకు ఇది నిదర్శనమని రష్యా అంటోంది.
.. గత శనివారం సాయంత్రం అజర్‌బైజాన్ నుంచి పారిస్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న 39 ఏళ్ల పావెల్ దురోవ్‌ను అక్కడి అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. టెలిగ్రామ్ ద్వారా హవాలా మోసం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, పిల్లలపై లైంగిక దోపిడీకి సంబంధించిన సమాచారం షేర్ చేయడం వంటి అభియోగాలు ఆయనపై ఉన్నాయి. దీంతో గతంలోనే ఆయనపై అరెస్టు వారెంటు జారీ చేసిన ఫ్రాన్స్ అధికారులు.. ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు.