
ఆ దారుణం చేసింది నిజానికి నైస్ గై.. కానీ!
వాషింగ్టన్: అనూహ్యంగా ఓ గుంపు మీదకు కారును తీసుకొచ్చి బలంగా ఢీకొట్టడమే కాకుండా అనంతరం అదే కారులో నుంచి దిగి కత్తితో విచక్షణా రహితంగా ఓ పన్నెండు మందిని పొడిచి అనంతరం పోలీసుల కాల్పుల్లో చనిపోయిన అబ్దుల్ రజాక్ అలీ అర్తాన్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. వాస్తవానికి అతడు చాలా మంచివాడని, కలుగొలుపుగా ఉండే లక్షణాలున్నవాడని అతడి చుట్టుపక్కలవారు, స్థానికులు చెబుతున్నారు. అతడు ఉంటున్న అపార్టుమెంటు వద్ద ఎదురైన ప్రతి వ్యక్తిని పలకరించేవాడని, తన తల్లి, తోడబుట్టినవారితో అదే అపార్టుమెంటులోని తక్కువ అద్దె ఉన్న ఇంట్లో ఉండేవాడని చెబుతున్నారు.
అతడు ప్రతి రోజు వచ్చే దారిలో ఓ దుకాణం దగ్గర ఆగి స్నాక్స్ కొనుక్కోని తినేవాడని, మసీదుకు రోజు హాజరయ్యేవాడని కూడా చెబుతున్నారు. ప్రతి రోజు తానే కాకుండా తన సోదరీసోదరుడిని స్కూల్లో దింపేవాడని అతడి తల్లి చెప్పింది. అమెరికాలోని ఒహయో స్టేట్ యూనివర్సిటీలో ఈ సోమవారం కారుతో ఢీకొట్టి, కత్తితో దాడిచేసి 12 మందిని అబ్దుల్ గాయపరిచిన విషయం తెలిసిందే. అతడి చేతిలోని కత్తి కిందపడేయాలని పోలీసులు చెప్పినా వినకపోవడంతో జరిపిన కాల్పుల్లో అతడు చనిపోయాడు. దీంతో విద్యార్థిగా వచ్చిన అబ్దుల్ అసలు ఎందుకు హంతకుడిగా మారాడు? అతడి కుటుంబ నేపథ్యం ఏమిటని ఆరాతీయగా కొన్ని ఆసక్తికర అంశాలు తెలిశాయి. కొలంబస్ స్టేట్ కమ్యూనిటీ కాలేజీ నుంచి ఈ ఏడాది మే నెలలో అబ్దుల్ గ్రాడ్యుయేట్ అయ్యాడు. ఆ సమయంలో జరిగిన ఓ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలో అతడు వేదికపై ఎంతో సంతోషంగా కనిపించాడట. ఆడుతూపాడుతూ గెంతులేస్తూ, పెద్ద నవ్వుతూ తన సంతోషాన్ని కూడా వ్యక్తం చేశాడట. అయితే, ఆ తర్వాత బ్యాచిలర్ డిగ్రీ కోసం ఒహియో వర్సిటీకి వచ్చిన అతడు స్టూడెంట్ మేగజిన్ కు ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు.
అయితే, అక్కడ బహిరంగంగా ప్రార్థన చేసుకునేందుకు ప్రయత్నించేవాడని, చుట్టుపక్కలవారు తనను ఎలా రిసీవ్ చేసుకుంటారో అని మదన పడేవాడని ఇంకొందరు అంటున్నారు. ఏదైనా మానసిక ఒత్తిడికి గురై ఇలా చేశాడా..? లేక ఉగ్రవాద భావజాలానికి ప్రభావితుడయ్యాడా అనేది ఇప్పటికీ తేలని అంశమే.. మరోపక్క, సోమలియా దేశస్తుడైన రజాక్ 2007-2014 మధ్య కాలంలో పాక్‌లో ఉన్నాడని అమెరికా అధికారులు చెప్పారు. ‘ముస్లిం దేశాల వ్యవహారాల్లో తలదూర్చడాన్ని అమెరికా ఆపాలి’ అని రజాక్ దాడికి ముందు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసినట్లు మీడియా తెలిపింది. అతడు తమ వాడే అని కూడా ఐసిస్ ప్రకటించింది.